పైడి జైరాజ్‌ చిత్రం నవతరానికి స్ఫూర్తిదాయకం !

మధ్య తరగతి కుటుంబంలో జన్మించి, ఒక సాధారణ వ్యక్తిగా గడపదాటి మహానటుడిగా ఎదిగిన పైడి జైరాజ్‌ జీవితాన్ని లఘుచిత్రంగానే కాదు … సీరియళ్లు, పుస్తక రూపాల్లో తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచించారు. కరీంనగర్‌లో జన్మించిన అలనాటి నటుడు పైడి జైరాజ్‌ జీవితాన్ని సుపధ క్రియేషన్స్‌ బ్యానర్‌పై పొన్నం రవిచంద్ర రూపొందించిన ‘ఇన్‌విన్సిబుల్‌ హీరో’ (పైడిజైరాజ్‌ ప్రస్థానం) లఘుచిత్రం (ఆంగ్లం) విడుదల ఫిబ్రవరి 7న రవీంద్రభారతిలోని ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. చిత్రం సీడీని ఆవిష్కరించిన బుర్రా వెంకటేశం ప్రసంగిస్తూ.. మూకీ చిత్రాలు మొదలుకొని ఆధునిక యుగపు రంగుల చిత్రాల వరకు సుమారు 70సంవత్సరాల సుదీర్ఘమైన హిందీ సినీ జీవిత ప్రయాణంలో దాదాపు 156 చిత్రాల్లో కథానాయకుడిగా, ఇతర విలక్షణమైన పాత్రల్లో మొత్తం 300 చిత్రాల్లో తన అభినయకౌశలంతో యావత్‌ భారత ప్రజల హృదయాలను కొల్లగొట్టారన్నారు.

ప్రముఖ సినీ దర్శకులు బి.నర్సింగరావు మాట్లాడుతూ… పైడి జైరాజ్‌ నటుడే కాదూ.. గొప్ప మానవతావాది అని కొనియాడారు. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. పైడి జైరాజ్‌ జీవితాన్ని లోతుగా పరిశోధించి నిర్మించిన చిత్రం నవతరానికి స్ఫూర్తినిస్తుందన్నారు. పైడి జయరాజ్‌ కుమార్తె దీపా షాహీ, మనవడు, సినీ దర్శక నిర్మాత రాజన్‌ షాహీలు ఆ మహానటుడితో ఉన్న తమ అనుభవాలను గురించి వివరించారు. సభలో ప్రముఖ సినీ సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సినీ విమర్శకులు వారాల ఆనంద్‌, ఫిలిం జర్నలిస్టు రాంమోహన్‌ నాయుడు, టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్‌ తదితరులు ఉన్నారు. నిర్వాహకుల్లో ఒకరైన రాధికారెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే విశాఖపట్నంలో తెలుగులో విడుదల చేస్తామని ప్రకటించారు.