ప్రతి ఫ్లాప్ తరువాత హిట్‌ వచ్చి నేనేమిటో చెప్పాయి !

సినిమాలపరంగా ఇక రజనీ ఔట్ అనే విమర్శలు వస్తున్నప్పుడల్లా హిట్‌తో నిలుస్తున్నానని సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పారు. కొంతకాలంగా తన సినిమాలు అపజయం పాలవుతూ వస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. గురువారం ఇక్కడ తాజా చిత్రం ‘కాలా’ ఆడియో విడుదల సందర్భంగా రజనీ మాట్లాడారు….

అపజయాలను అధిగమిస్తూ తాను విజయాలను సాధించిన సందర్భాలు ఉన్నాయని, ఇవి విమర్శకులకు తగు జవాబులుగా నిలిచాయన్నారు. కూతురు సౌందర్య నిర్మించిన ‘కొచ్చాడియాన్’, కెఎస్ రవికుమార్ చిత్రం ‘లింగా’ బాక్సాఫీసు వద్ద దెబ్బతిన్న మాట వాస్తవమేనని రజనీకాంత్ అంగీకరించారు. కూతురు సౌందర్య జీనియస్ అని, తెలివితేటలు ఉన్న వారితో కలిసి పనిచేయడం తేలికే…  అయితే వారి తెలివే ఇబ్బందిగా మారుతుందని వ్యాఖ్యానించారు. ‘లింగా’లో మంచి సందేశం ఉందని, అయితే ఇది ఫెయిల్ అయిందని, ‘ఇక రజనీ పని అయిపోయినట్లే’ అని విమర్శలు వచ్చాయని, అయితే ప్రతి అపజయం తరువాత తనకు హిట్‌లు వచ్చి తను ఏమిటనేది వెల్లడవుతోందని, గత 40 ఏళ్ల సినీ జీవితంలో సాగుతున్నది ఇదేనని తేల్చిచెప్పారు. రాబోయే ‘కాలా’ సినిమాపై రజనీ హిట్ ధీమాను వ్యక్తం చేశారు.  ఈ చిత్రంలో తనతో పాటు నానా పాటేకర్ శక్తివంతమైన పాత్ర పోషించారని, ఇంతకు ముందు రఘువరన్, అప్పట్లో రమ్యకృష్ణతో ఉద్వేగభరితంగా సాగిన సినిమాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయని రజనీ తెలిపారు.