దర్శకుడు,నటుడు తర్వాత… నిర్మాత తప్పుకున్నారు !

‘ఝాన్సీ లక్ష్మీబాయి’ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘మణికర్ణిక’ చిత్రం సెట్స్‌పైకి వెళ్లిన దగ్గర నుంచి ఏదొక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్సిన క్రిష్‌ ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ పనుల నిమిత్తం ఆ ప్రాజెక్టు నుంచి వచ్చేయడంతో …అతని స్థానంలో కంగనా రనౌత్‌ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఇక పై చిత్రానికి కంగనా దర్శకురాలు అని తెలిసిన మరుక్షణమే సోనుసూద్‌ కూడా ఆ ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయారు. కంగనాకు దర్శకత్వ అనుభవం లేదని బహిరంగంగా చెప్పే వెళ్లిపోయారు. ఆసమయంలో కంగనా చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి.
 
తాజాగా ఈ చిత్రం నిర్మాణపు ఖర్చు భారీగా పెరిగిపోతుందని జీ స్టూడియో బిజినెస్‌ హెడ్‌ సుజయ్ కుట్టీ ‘మణికర్ణిక’ నుంచి తప్పుకున్నారట. ఈయన స్థానంలో మరో నిర్మాత భాగస్వామి అయ్యారు. ఇప్పటి వరకూ జీ స్టూడియోస్‌, కమల్‌ జైన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా మిగిలి ఉన్న సన్నివేశాల చిత్రీకరణ, కొన్ని మళ్లీ చిత్రీకరించాల్సిన వాటికి మరో పది రోజులు షెడ్యూల్‌ అనుకున్నారట. కానీ ముందనుకున్నట్టు కాకుండా చాలా ఎక్కువగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. దీని వల్ల 70 కోట్లు అనుకున్న ఈ సినిమా నిర్మాణం 100 కోట్లు దాటిపోతుందని, అందువల్లే ఈ చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్టు సుజయ్ కుట్టీ చెప్పారట. ‘మణికర్ణిక’ను వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అవే సన్నివేశాలు మరోసారి చిత్రీకరణ
ఆంగ్లేయులను గడగడలాడించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. ఆ ధీరవనిత జీవితాన్ని ఇప్పుడు వెండితెరపై చూడబోతున్నాం. ఆమె పాత్రలో కంగనా రనౌత్‌ కనిపించనుంది. ఆ చిత్రమే ‘మణికర్ణిక’. ప్రస్తుతం ప్యాచ్‌వర్క్స్‌, కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగా పోరాట సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా సెట్స్‌ ఫొటోను సామాజిక మాధ్యమంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కంగనా తలపై గాయమైనట్టుగా, ముఖం నిండడా రక్తం ఉంది. యాక్షన్‌ డైరెక్టర్‌ నిక్‌ పోవెల్‌ పోరాట సన్నివేశం వివరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మళ్లీ చిత్రీకరించాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే షూట్‌ చేసిన ఆ సన్నివేశాల్లో సోనుసూద్‌ ఉన్నారు. అయితే ఇప్పుడు అవే సన్నివేశాలు మరోసారి చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం కోసం కంగనా మరో 40 రోజులు డేట్స్‌ ఇచ్చింది. ఈ చిత్ర దర్శకుడు క్రిష్‌ ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఆ బాధ్యతలను కంగనాకే ఆ చిత్ర నిర్మాత అప్పగించారు. ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్‌ కథను అందించారు.