నా బయోపిక్ ను నేనే తెరకెక్కిస్తున్నా!

‘మణికర్ణిక’ కంగన రనౌత్… ‘మణికర్ణిక’ భారీ హిట్ కావడంతో కంగన రనౌత్ పేరు మారుమోగుతోంది. ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతల నుంచి మధ్యలో క్రిష్ తప్పుకోవడంతో… కంగనా స్వయంగా మెగా ఫోన్ పట్టుకుని చిత్రాన్ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఓ సంచలన ప్రకటన చేసింది. తన బయోపిక్ ను స్వయంగా తానే తెరకెక్కించబోతున్నానని ప్రకటించింది. ఇప్పటికే బయోపిక్ కు సంబంధించిన యూనిట్ ను కూడా కంగన సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. ‘బాహుబలి’, ‘మణికర్ణిక’ చిత్రాలకు కథను అందించిన విజయేంద్ర ప్రసాదే ఈ బయోపిక్ కు కథను రెడీ చేస్తున్నట్టు సమాచారం.
నా గురించి ఎలాంటి తీర్పూ ఇవ్వ‌కుండా, నన్ను న‌న్నుగా ప్రేమించేవారు నా చుట్టూ ఎంద‌రో ఉన్నారు. వారి కోసం నేను నా బ‌యోపిక్‌ను రూపొందిస్తాను. నా బ‌యోపిక్‌కు నేనే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాను. నా జీవిత‌క‌థ‌ను రాస్తాన‌ని ఇటీవ‌ల ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్‌గారు అన్నారు. ఆయ‌న గొప్ప ర‌చ‌యిత‌. ధైర్యంగా, నిజాయితీగా రాస్తార‌నే న‌మ్మ‌కం నాకుంది. ఈ బ‌యోపిక్‌కు కూడా ఆయ‌నే క‌థ అందిస్తారు. నాకు స‌హాయం చేసిన‌వారితోపాటు న‌న్ను అవ‌మానించిన వారి గురించి కూడా త‌ప్ప‌కుండా చెబుతాను. అయితే వారి పేర్ల‌ను బ‌య‌ట‌పెట్ట‌ను. ఎందుకంటే వారి నుంచి న‌న్ను నేను కాపాడుకోవాలి క‌దా అని కంగన చెప్పింది.’మణికర్ణిక’కు పని చేసిన టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు కూడా పని చేయనుంది. కంగనకు ప్రచారం చేసేలా ఈ చిత్రం ఉండదని… ఆమె జీవితంలో అనేక ఘటనలను ఈ చిత్రంలో చూపిస్తామని కంగన టీమ్ తెలిపింది.
రెబల్‌ మనస్తత్వం
దానికి నూటికి నూరుపాళ్ళు మా కుటుంబంలోనే బీజం పడింది. ఆడపిల్లల విషయంలో మా కుటుంబంలో చాలా వివక్ష చూపేవారు. అది సహించలేకపోయేదాన్ని. మా కుటుంబంలో మొదలైన ఈ వివక్ష ఇక్కడ ఇంకా ఎక్కువగా ఉంది. ఈ వివక్షను ప్రశ్నించినందుకు, ఎదిరించినందుకు నా మీద రెబల్‌ అన్న ముద్ర వేశారు. దానికి నాకేమీ బాధ లేదు. ఇక్కడ నాకు లభించిన ఈ గుర్తింపుకు ఆనందంగా ఉంది.
 
బెదిరిస్తారట!
సద్విమర్శలు చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారు. అర్థంపర్ధం లేని విమర్శలు చేస్తేనే కోపం వస్తుంది ఉదాహరణకి ‘మణికర్ణిక’ సినిమాని సెన్సార్‌ వారు ఓకే చేసిన తరువాత కూడా కొందరు పనిగట్టుకుని అవాకులు చవాకులు పేలారు. అలాంటి వారి నోళ్ళు మూయించాలంటే అలా గట్టిగా వార్నింగ్‌ ఇవ్వాల్సిందే. నేనూ అదే పనిచేశాను. దాన్ని బెదిరించడమంటారా?
విజయ రహస్యం?
మామూలు సినిమాలు, రోటీన్‌ పాత్రలు చేయడం నాకు నచ్చదు. నేను చేసే పాత్రలో జీవం ఉండాలి. దాంతో పాటు హాస్యం, చిన్న మెసేజ్‌ అన్నీ ఉండాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాను కనుకే ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. లేకపోతే నా మీద వచ్చే ఆరోపణలకీ, విమర్శలకీ ఎప్పుడో తెర వెనుకకి వెళ్ళిపోయేదాన్ని. ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం నా నిజాయితీనే!