‘నా సినిమాకే ‘నో’ చెప్తావా?..నువ్వు అయిపోయావ్‌!’ అన్నారు!

“సల్మాన్‌ఖాన్‌ ‘సుల్తాన్‌’లో ‘నేను నటించను’ అని చెప్పినందుకు బెదిరించారు. అయినప్పటికీ వాటికి భయపడకుండా నా మనసుకి నచ్చిన సినిమాలో నటించి.. విజయం సాధించాను” అని అంటోంది బాలీవుడ్‌ నాయిక కంగనా రనౌత్‌. “బాలీవుడ్‌లో నెపోటిజమే కాదు పురుషాధిక్యతను చాటుకోవాలనే అహంకారం కూడా దర్శక, నిర్మాతలు, హీరోల్లో ఉంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా నేనే”…అంటూ సల్మాన్‌ఖాన్‌ ‘సుల్తాన్‌’ సినిమా సమయంలో జరిగిన విషయాన్ని వివరించింది.
 
కంగనా రనౌత్  వైవిధ్యమైన సినిమాలు.. పాత్రలు.. ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది. జాతీయ ఉత్తమ నటిగానూ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని, పద్మశ్రీ ని కూడా చేజిక్కించుకుంది. స్టార్‌ హీరోలకు దీటుగా బాలీవుడ్‌లో రాణిస్తోంది. సినీ పరిశ్రమలోని తప్పొప్పుల్ని నిర్భయంగా చెప్పే నటిగా కంగనా తరచూ వార్తల్లో నిలుస్తోంది.
నా ప్రాధాన్యతని తగ్గించుకోలేను !
‘సల్మాన్‌ఖాన్‌ హీరోగా రూపొందబోయే ‘సుల్తాన్‌’ సినిమాలో నటించమని అడిగారు. దీని కోసం ఆ దర్శకుడు మా ఇంటికి వచ్చి స్క్రిప్ట్‌ నెరేట్‌ చేశారు. ఆ తర్వాత నేను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ హెడ్‌ ఆదిత్య చోప్రాను కలిసి ఈ సినిమాలో నటించలేనని చెప్పాను. అప్పుడు ఆయన బాగానే ఉన్నారు. ఆ తర్వాత కంగనా, ‘సుల్తాన్‌’ సినిమాకి నో చెప్పింది’ అంటూ కొన్ని వార్తలొచ్చాయి. దీంతో ఆదిత్యచోప్రా, ‘నీకు ఎంత ధైర్యం?, నా సినిమాకే నో చెప్తావా?, నువ్వు అయిపోయావ్‌..’ అని నాకు మెసేజ్‌ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయన ఇంకొక సందేశం పంపారు. ‘కంగనా.. నేను నీతో ఎప్పటికీ సినిమా చేయన’ని ఆ సందేశంలో పేర్కొన్నారు. నేను ‘సుల్తాన్‌’లో నటించకపోవడానికి కారణం ఒక్కటే.. సల్మాన్‌ లాంటి హీరో పక్కన నటించి నా ప్రాధాన్యతని తగ్గించుకోదల్చుకోలేదు’ అని కంగనా తెలిపింది.’సుల్తాన్‌’లో నటించకుండా కంగనా ‘తను వెడ్స్‌ మను’ చిత్రంలో నటించింది. ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొంది అఖండ విజయం సాధించింది. అలాగే దీనికి సీక్వెల్‌గా రూపొందించిన ‘తను వెడ్స్‌ మను రిటర్స్న్‌’ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈరెండు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి.
ఇండస్ట్రీని వదిలి వెళ్లండి !
సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌‌ మరణించిన నాటి నుంచి బాలీవుడ్‌లో బంధుప్రీతి, పక్షపాత ధోరణి గురించి తీవ్రమైన చర్చ నడుస్తోంది . బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌, ఇండస్ట్రీకి చెందిన పెద్దల గురించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కరణ్‌ జోహార్‌, మహేష్‌ భట్‌, ఆలియా భట్‌లపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే,ఇప్పుడు కరణ్‌ జోహర్‌.. కంగనను ఘాటుగా విమర్శిస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 2017లో జరిగిన ఓ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అంతర్జాతీయ సమావేశం సందర్భంగా కరణ్‌ జోహర్‌.. కంగనను తీవ్రంగా విమర్శించారు….
“కంగన తనను తాను బాధితురాలిగా చెప్పుకోవడానికి.. మహిళననే సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రతి సారి ఇండస్ట్రీ ఆమెని ఎలా బెదిరించిందో వివరించే విషాద కథలు చెప్పుకుంటూ ఉంటారు. తుపాకీతో బెదిరించి మరీ నటించమని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు కదా!. ఇండస్ట్రీని వదిలి వెళ్లండి!.. వేరే పని చేసుకొండి!”..అంటూ కటువుగా మాట్లాడారు కరణ్‌. అంతేకాక, ప్రతిసారి అవతలి మనిషి ఇగోను రెచ్చగొడితే ఇలాంటి పరిణామాలే ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు‌. ఈ వీడియో సోషల్‌ మీడియాలో హాట్ హాట్ గా వైరలవుతోంది.
ఇదిలా ఉండగా.. సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య విషయంలో తన విమర్శలను నిరూపించుకోలేకపోతే.. పద్మశ్రీ అవార్డును ఉంచుకునే అర్హత తనకుండదని కంగనా ప్రకటించింది.