ఆ హీరోల్లాంటి జీవిత భాగస్వామి కావాలి !

కీర్తిసురేష్… హీరోయిన్లు తమకు కాబోయే జీవిత భాగస్వాములు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని కలలు కంటుంటారు. నటి కీర్తిసురేష్ ఇందుకు అతీతం కాదు. సినీ వారసత్వం నుంచి వచ్చిన కీర్తిసురేష్ మూడు నాలుగేళ్లలోనే వరుసగా విజయవంతమైన చిత్రాలు చేసేసింది.
 
అనూహ్యంగా విజయ్, విక్రమ్, సూర్య, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో జత కట్టేసింది. ఇక ‘నడిగైయార్‌ తిలగం’ (తెలుగులో మహానటి) చిత్రంలో సావిత్రిగా జీవించి ప్రశంసలు అందుకుంది. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో నటించబోతుందన్న వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు కొన్ని నెలలు విశ్రాంతి తీసుకోనున్నానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రస్తుతం ఒక మలయాళ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా ఇటీవల కీర్తిసురేష్ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చింది. ఈ సందర్భంగా పెళ్లి గురించి ప్రశ్నించగా.. ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేసింది. ప్రేమ వివాహం చేసుకుంటారా? లేక పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్నకు అది కూడా ఇప్పుడు చెప్పలేనంది. అయితే ఒక వేళ ఎవరినైనా ప్రేమిస్తే ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో అభ్యంతరం చెప్పరని చెప్పింది. ఎలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు మాత్రం టక్కున.. తనకు నటుడు విజయ్, విక్రమ్‌ లాంటి భర్త రావాలని చెప్పింది.
టాలీవుడ్‌ బెస్ట్ హీరోయిన్‌ కీర్తిసురేష్‌
టాలీవుడ్‌లో ఈ ఏడాది బెస్ట్ హీరోయిన్‌గా కీర్తిసురేష్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆమె తన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. సరిగ్గా నాలుగు సినిమాల అనుభవం కూడా లేని కీర్తిసురేష్ ‘మహానటి’లో సావిత్రి పాత్రను పోషించే సాహసం చేయడం ఆశ్చర్యపరిచింది. అసలు సావిత్రి పాత్రకు కీర్తిని ఎలా తీసుకున్నారని కూడా చర్చ జరిగింది. అయితే ఆశ్చర్యపోయిన వాళ్లే అబ్బురపడేలా సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ జీవించేసింది. వపన్‌కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’తో ఈ ఏడాది ఆరంభించిన కీర్తిసురేష్ ‘మహానటి’తో టాప్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. కాకపోతే ఈ సినిమా తర్వాత తెలుగులో ఎలాంటి సినిమా చేయాలనే సందిగ్ధంలో ఆమె మరో తెలుగు సినిమాకు ఇంత వరకు సైన్ చేయలేదు. అనువాద చిత్రాలు ‘పందెం కోడి 2’, ‘సర్కార్’లలో తన అల్లరి నటనతో ప్రేక్షకులను అలరించింది కీర్తిసురేష్.