సినీ ప్రయాణంలో ఏడేళ్ళు: చేతిలో ఏడు భారీ సినిమాలు!

ప్రభాస్‌తో పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’లో సీతగా కనిపించనుంది కృతి సనన్‌. మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ తో వెండితెరకు పరిచయమయ్యింది కృతి . ఢిల్లీ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన ఈ పంజాబీ భామ.. తర్వాత బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ అయింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సరసన నటిస్తూ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్‌ తీసుకుంటోంది కృతి. బాలీవుడ్‌లో ఆమె నటించిన తొలి చిత్రం ‘హీరోపంతి’. ఈ మూవీ విడుదలై నేటికి ఏడేళ్ళు. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్లో ఏడు భారీ సినిమాలున్నాయి. ఈ సందర్భంగా కృతి బి-టౌన్‌లో తన ఏడేళ్ల సినీ ప్రయాణం గురించి ఇలా చెప్పింది…

ప్రతిదీ డెస్టినీ అనే భావిస్తా!… “అవకాశాలు ఎప్పుడు తలుపు తడతాయో ఎవరూ ఊహించలేరు. మనం చేయాల్సింది తలుపులు తెరిచి వాటిని స్వాగతించడమే. ప్రతిదీ డెస్టినీ అనే భావిస్తాను. నేను ఇంజినీరింగ్‌ చదువుతానని అనుకోలేదు. అది పూర్తయ్యాక సినిమాల్లోకి వస్తానని అస్సలు అనుకోలేదు. అనుకోకుండా మోడలింగ్‌లోకి రావడం, పలు పోటీల్లో విజయం సాధించడం, సినిమా అవకాశాలు రావడం.. ఇవన్నీ డెస్టినీ అనే అనిపిస్తుంటుంది. అయితే, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఎంత రాసిపెట్టి ఉన్నా పట్టుదలతో ప్రయత్నిస్తేనే విజయం సాధించగలం. 

యాక్టింగ్‌ నన్ను ఉత్సాహంగా ఉంచుతుంది!… సినిమా అవకాశాల కోసం ఇండస్ట్రీకి వచ్చాను. కానీ, ఇక్కడంతా కొత్తే! ఏడేండ్ల సినిమా ప్రస్థానంలో సక్సెస్‌లు చూశాను. ఫెయిల్యూర్స్‌ కూడా పలకరించాయి.కానీ ఇందులోకి వచ్చాకే అర్థమైంది. యాక్టింగ్‌ నన్ను ఎంతగానో ఆకట్టుకుందని, అది నన్ను ఉత్సాహంగా ఉంచుతుందని. ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఇబ్బందులపాలు చేస్తాయి. గెలుపు, ఓటములకు ప్రభావితం కాకుండా ధైర్యంగా ఉండాలి. ఈ ధైర్యం లేకనే సినిమా అవకాశాల కోసం ముంబయికి వచ్చిన చాలామంది సమస్యల పాలవుతుంటారు.

సినిమా బ్యాగ్రౌండ్‌ లేని వ్యక్తిగా… ఇక్కడ నటిగా నాకు గుర్తింపు రావడానికి కొంత సమయం పట్టింది. మొదట్లో అంత నాకు కొత్తగా ఉండేది. నాకు అప్పుడు ముంబై కూడా కొత్తే. సినిమా బ్యాగ్రౌండ్‌ లేని వ్యక్తిగా పరిశ్రమలోకి రావడం వల్ల ఇక్కడ నేను ఎవరికి అంతగా తెలియదు. దాని వల్ల పలు సినిమా వేడుకల్లో ఒంటరిగా ఉండేదాన్ని. ఎవరూ అంతగా మాట్లాడేవారు కాదు. అది నాకు చాలా బాధగా అనిపించేది. ఇప్పటికీ కూడా కొన్నిసార్లు అలాగే ఫీల్‌ అవుతాను. అయితే హీరోయిన్‌గా నేను ఈ స్థాయికి అంత సులభంగా రాలేదు. ఎన్నో అపజయాలు, అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను”

# సినిమాల్లోకి వచ్చాక రకరకాల పాత్రలు పోషించక తప్పదు. తాజాగా, ఓ సినిమాలో బైక్‌ నడపాల్సి వచ్చింది. మామూలుగా అయితే, ఇలాంటి సాహసాలు నాకు సెట్‌ కావు. కానీ, తప్పదు! గత లాక్‌డౌన్‌లో వంట నేర్చుకున్నా. ఒక్కసారి మొదలుపెట్టాక మాత్రం చాలా ప్రయోగాలు చేసేస్తున్నా.

# కరోనా లాక్‌డౌన్‌ కారణంగా షాపింగ్‌ మిస్‌ అవుతున్నా. తొందర్లోనే పరిస్థితులు మారాలని కోరుకుంటున్నా. ఈ పాండమిక్‌ టైమ్‌లోనూ రెండు సినిమాల్లో నటించడం ఆనందంగా ఉంది. మరిన్ని చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. త్వరలోనే ఒక పెద్ద ఫ్లాట్‌లోకి మారబోతున్నా! మొత్తానికి గతేడాది బిజీబిజీగానే గడిచింది. ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నా!

# మా అమ్మకు గార్డెనింగ్‌ అంటే ప్రాణం. పచ్చని చెట్ల మధ్య కూర్చొని టీ తాగాలనుకుంటుంది. తన కోసం హోమ్‌ గార్డెనింగ్‌ చేయాలని భావిస్తున్నా. స్కై డైవింగ్‌ చేయాలన్నది ఎప్పట్నుంచో కల. అది కూడా నెరవేర్చుకుంటా. ఉత్తమనటిగా నేషనల్‌ అవార్డు గెలువాలన్నది నా యాంబిషన్‌. ఈ మూడు కోరికలతోపాటు ఓ అందమైన బయోపిక్‌లో నటించాలని కూడా ఉంది.