ఒక వేళ ఆ రెండు వ్యాపారాలూ ప్రారంభిస్తానేమో ?

నాకు జిమ్‌ అంటే చాలా ఇష్టం. రోజులో కొంతసేపన్నా అక్కడ గడపకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. అందుకే భవిష్యత్తులో రకూల్‌లాగా జిమ్‌ ఒకటి ప్రారంభించాలన్న ఆలోచన ఉంది. అంతేకాదు. నేను భోజనప్రియురాలిని. మంచి ఫుడ్‌ ఎంత దూరంలో దొరుకుతోందన్నా అక్కడికి వెళ్ళి టేస్ట్‌ చేసి వస్తుంటాను. అలా వెరైటీ రుచుల గురించి బాగా తెలుసు. నాకు తెలిసిన రుచులను అందరికీ పరిచయం చేయాలని ఉంది. సో….రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి వెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఉంది. కాకపోతే జిమ్మా? రెస్టారెంటా? అన్నది ఇంకా తేల్చుకోలేదు. ఒక వేళ రెండు వ్యాపారాలూ ప్రారంభిస్తానేమో? తెలియదు. నేను ఏది చేసినా మా ఫ్యామిలీ సపోర్ట్‌ తప్పకుండా ఉంటుంది. ఆ వ్యాపారాల్లో వాళ్ళూ భాగస్వాములవుతారు కనుక అందరి అభిప్రాయం కనుక్కుని త్వరలోనే వ్యాపారంలోకి అడుగు పెడతాను….అంటూ చెప్పింది త్వరలో వ్యాపార రంగం లోకి అడుగుపెడుతున్న లావణ్య త్రిపాఠి.

ప్రత్యేకత చూపించడానికే ఇష్టపడతాను !

కొంతమంది అలంకరణే గ్లామర్‌ అనుకుంటారు.కేవలం చిట్టిపొట్టి డ్రస్సులు వేసుకుంటేనే గ్లామర్‌ అని నేను అనుకోను. కళ్ళు, ముఖంలోనూ హావభావాలు పలికించడమే నిజమైన గ్లామర్‌.  నా దృష్టిలో గ్లామర్‌ వేరు. ఎక్స్‌పోజింగ్‌ వేరు. అసలు కొన్ని పాత్రల రూపకల్పన లోనే గ్లామర్‌ ఉంటుంది. అలాంటి పాత్రలు దొరకడం కష్టం. అలాంటి సినిమా చేసే అవకాశం వస్తే చస్తే వదులుకోను. సినిమా సినిమాకీ నా గెటప్‌లో ప్రత్యేకత చూపించడానికే ఇష్టపడతాను. ఒక సినిమాలో నన్ను ఇష్టపడ్డారు కనుక, ఎప్పుడూ అలానే కనిపించాలని అనుకోను. నా సినిమాలను పరిశీలిస్తే అది అర్థమవుతుంది. ఒక్కో సినిమాలో ఒక్కో పాత్ర. దేనికదే డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ సినిమాల్లో నా గెటప్‌ కూడా డిఫరెంట్‌గానే ఉంటుంది. కొన్నిసినిమాల్లో మోడ్రన్‌ డ్రస్సులో కనిపించాను. ‘సోగ్గాడే చిన్నినాయిన’ సినిమాలో పూర్తిగా చీరలోనే కనిపించా..

ఆ భగవంతుడే చూసుకుంటాడు !

సినిమా హిట్‌, ఫ్లాపు అనేది ఎవరి చేతిలోనూ లేదు. మంచి కథను ఎంపిక చేసుకోవడం వరకే నా పని. అది విజయం సాధిస్తుందా? లేదా? అన్నది ఆ భగవంతుడే చూసుకుంటాడు. నా వరకూ చేస్తున్న పాత్రకు నూటికి నూరుపాళ్ళు న్యాయం చేస్తున్నానా? లేదా అనేది చూసుకుంటాను.మనలో ఎంత సత్తా ఉన్నా ‘అదృష్టం అనేది లేకపోతే వేస్ట్‌’ అనేది నేను నూటికి నూరుపాళ్ళు నమ్ముతాను. నా విషయంలో ఇది నిజమైంది కూడా! కొన్ని సినిమాలకు డేట్లు అడ్జస్ట్‌ చేయలేక ఇబ్బంది పడి వాటిని వదులుకోవలసి వచ్చింది. అవి సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి. ఏ సినిమాల కోసమైతే వాటిని వదులుకున్నానో అవి సాదాసీదాగా ఆడాయి.