శ్రీరెడ్డి పై నిషేధాన్ని ‘మా’ తొలగించింది !

అవకాశాల కోసం వెళ్తే తనను లైంగిక వేధింపులకు గురిచేశారని గత కొంతకాలంగా వర్థమాన నటి శ్రీరెడ్డి పలు ప్రచార మాద్యమాల ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. అంతేకాకుండా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’లో సభ్యత్వం ఇవ్వడం లేదని ఇటీవల ఫిల్మ్‌ఛాంబర్‌ ఆవరణలో అర్థనగ ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేసింది. శ్రీరెడ్డి చేసిన చర్యని ఖండిస్తూ ‘మా’ ఆమెకు సభ్యత్వం ఇవ్వమని చెప్పింది. ‘మా’లో ఉన్న 900 మంది సభ్యులు శ్రీరెడ్డితో నటించకూడదంటూ ప్రకటన చేసింది.

ఇదిలా ఉంటే, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌, ‘మా’ అసోసియేషన్‌ పెద్దలు శ్రీ రెడ్డి సభ్యత్వ విషయాన్ని పున:పరిశీలించాలని ఇచ్చిన సలహా మేరకు ఆమెపై ప్రస్తుతం నిషేధాన్ని  విధించిన  ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని పరిశీలించే వరకు శ్రీరెడ్డితో ‘మా’ సభ్యులు పనిచేసుకోవచ్చని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా గురువారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ‘భారత ప్రభుత్వం విశాఖ గైడ్‌లైన్స్‌ పేరుతో ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ఆధారంగా లైంగిక వేధింపుల నివారణ పానెల్‌ను ఏర్పాటు చేయాలని, దీనిలో సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, ఫెడరేషన్‌ సభ్యులతోపాటు సమాజంలో ఉన్న అందరి ప్రముఖుల్ని (సోషల్‌ ఎన్టీఓ, లాయర్లు, డాక్టర్లు, ప్రభుత్వాధికారులు) ఇందులో సభ్యులుగా చేర్చుకుని సినీ పరిశ్రమలో మహిళలకు అండగా నిలబడి, న్యాయం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ గైడ్‌లైన్స్  ప్రకారం, ప్రతి ప్రొడక్షన్‌ కంపెనీలో కాష్‌ (కమిటీ ఎగనెస్ట్‌ సెక్సువల్  హెరాస్‌మెంట్‌) ఉండి తీరాలి. ‘కాష్‌’ కామిటీని ఏర్పాటు చేసేలా ఫిల్మ్‌ ఛాంబర్‌ బాధ్యత తీసుకుంటుంది’ ఫిల్మ్‌ఛాంబర్‌ అధ్యక్షుడు పి.కిరణ్‌ పత్రికా ప్రకటనలో తెలిపారు.