వాళ్ళు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు !

బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన అగ్ర కథానాయిక మాధురీ దీక్షిత్‌ కూడా కెరీర్‌ తొలినాళ్ళల్లో చాలా ఇబ్బందులు పడ్డారట. ఆనాటి జ్ఞాపకాలను మాధురీ పంచుకుంటూ…. ‘నాకు మైక్రోబయాలజిస్ట్‌ కావాలనుండేది. ఓ రోజు గోవింద్‌ మూనిస్‌ అనే ఓ దర్శకుడు నన్ను చూసి సినిమాల్లో నటించమని అడిగారు. ఆ విషయం అమ్మతో చెప్పా. బంధువులు చేసిన మోసంతో అప్పుడు మా ఫ్యామిలీ ఆర్థిక సమస్యల్లో ఉంది. దీంతో నేను నటించేందుకు ఇంట్లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గోవింద్‌ మొదట ‘ఆబోధ్‌’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అలాగే ‘మానవ్‌ హత్య’ అనే ఓ సినిమాలో చిన్న పాత్ర పోషించా. ఈ సినిమాను అశ్లీల చిత్రాలు ప్రదర్శించే థియేటర్‌లో వేశారు. దీంతో నాకు ఎలాంటి పేరు రాలేదు.

ఓసారి ముంబయి ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ జరుగుతున్న ప్రదేశంలో నేను, మా అమ్మ కలిసి ఓ రాయి మీద కూర్చున్నాం. అందులో ఏదైన ఛాన్స్‌ వస్తుందని ఎదురు చూసేదాన్ని. మా దగ్గర తినడానికి కూడా ఏం లేవు. ప్రొడక్షన్‌ వాళ్ళు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. రాకేష్‌ శ్రేష్ట అనే ఫొటోగ్రాఫర్‌ మమ్మల్ని గమనించి నా ఫొటోలు తీసి, దర్శకుడు సుభాష్‌ ఘాయ్ కి చూపించారు. ఆయన మొదట యాడ్స్‌లో నటించే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు’ అని తెలిపింది.