మహేష్ “స్పైడర్” విషయంలో రాజీ లేదట !

మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘స్పైడర్’ విడుదల ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దసరాకు వాయిదా పడటానికి మురుగదాస్ రాజీపడని మనస్తత్వమే కారణం. తన సినిమాల విషయంలో ఒక పట్టాన సంతృప్తి చెందడని మురుగదాస్‌కు పేరుంది. సినిమాలోని ప్రతి చిన్న అంశం  ప్రత్యేకంగా ఉండాలని అతను పట్టుబడతాడని అంటారు. ఏ విషయంలోనూ అసలు రాజీ అన్న మాటకు మురుగదాస్ తావివ్వడని చెబుతారు.సినిమా ఆలస్యమైనా దానికి తగిన ఫలితం దక్కుతుందని ఈ స్టార్ డైరెక్టర్ అంటాడు. ఇక ఈ చిత్రం మహేష్ స్టార్ రేంజ్‌కు అనుగుణంగా అద్భుతంగా తెరకెక్కుతోంది. అతని కెరీర్‌లోనే ఓ స్పెషల్ మూవీగా ఈ చిత్రం నిలుస్తుందని అంటున్నారు.

అయితే ఈ సినిమాలో చాలా సన్నివేశాల విషయంలో రీషూట్లు జరిగాయట… క్లైమాక్స్ మళ్లీ మళ్లీ తీశారట. ఇప్పుడు పాటల విషయంలోనూ మురుగదాస్ రాజీపడని శైలి చూపిస్తున్నాడట. మామూలుగా ఇలా సుదీర్ఘ కాలం షూటింగ్ జరిగాక మిగిలిన పాటల్ని ఏదో ఒక సెట్టింగ్ వేసి మొక్కుబడిగా కానిచ్చేస్తారు. కానీ మురుగదాస్ అలా చేయట్లేదట. మహేశ్‌తో ఒక్కో పాటను వారం, పది రోజుల షెడ్యూల్ వేశాడట. రెండు పాటలకు వేర్వేరుగా కాన్సెప్ట్ అనుకొని లెంగ్తీగా షూట్ చేయడానికి ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం. రెండు పాటల కోసం జూలై నెలలో దాదాపు మూడు వారాలు కేటాయిస్తున్నట్లు తెలిసింది.

‘స్పైడర్’ టాకీ పూర్తవగానే కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ షూటింగ్‌కు వెళ్లిపోయిన మహేశ్ ఇప్పుడు మళ్లీ వెనక్కి రానున్నట్లు సమాచారం.  మహేశ్‌తో ఈ రెండు పాటల చిత్రీకరణతో  ‘స్పైడర్’ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్ పనులు కొన్ని నెలల ముందు నుంచే సమాంతరంగా జరుగుతున్నాయి. ఆ పని త్వరలోనే పూర్తవుతుందట. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి దసరా కానుకగా ఎట్టి పరిస్థితుల్లోనూ ‘స్పైడర్’ను విడుదల చేయాలని ఫిల్మ్‌మేకర్స్ పట్టుదలతో ఉన్నారు.