ఆకట్టుకోలేకపోయాడు….’గ్యాంగ్ లీడర్’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.5/5

మైత్రీ మూవీ మేక‌ర్స్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం లో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం) ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధలోకి వెళ్తే…  సిటీలో ఓ రోజు అర్ధ‌రాత్రి బ్యాంకు దోపీడీ జ‌రుగుతుంది. ఆ దోపీడీలో ఆరుగురు పాల్గొంటారు. బ్యాంకులో డ‌బ్బు దోచుకున్న త‌ర్వాత ఆరుగురులో ఒక‌డు మిగిలిన ఐదు మందిని చంపేస్తాడు. అలాగే అక్క‌డున్న మ‌రో ముస‌లివాడిని కూడా చంపేస్తాడు. పోలీసులు ఎంత ప్ర‌య‌త్నించినా దొర‌క‌డు. దొంగ‌త‌నం జ‌రిగిన 14 నెల‌లు త‌ర్వాత స‌రస్వ‌తి(ల‌క్ష్మి).. మ‌ధ్య‌వ‌య‌స్కురాలైన వ‌ర‌ల‌క్ష్మి(శ‌రణ్య‌), పెళ్లి కాబోతున్న అమ్మాయి ప్రియ‌(ప్రియాంక‌), స్కూల్ చ‌దువుతున్న అమ్మాయి స్వాతి(శ్రియారెడ్డి), ఐదారేళ్ల చిన్న‌పాప (పాణ్య‌)ల‌కు బహుమ‌తి వ‌చ్చింద‌ని అబ‌ద్ధం చెప్పి ఇంటికి ర‌ప్పిస్తుంది. బ్యాంకు రాబ‌రీలో ఆరోవాడు త‌మ‌కు కావాల్సిన ఐదుగురుని చంపేశాడు కాబ‌ట్టి.. వాడెవ‌డో క‌నిపెట్టి ప‌గ తీర్చుకుందామ‌ని చెబుతుంది. ముందు ఒప్పుకోక‌పోయినా త‌ర్వాత అంద‌రూ ఒప్పుకుంటారు. అయితే వీరికి సాయ‌ప‌డేందుకు పెన్సిల్ పార్థ‌సార‌థి(నాని) అనే డ‌బ్బింగ్ సినిమాల ర‌చ‌యిత సాయాన్ని కోర‌తారు. ప్రియ‌ను చూసి ఇష్ట‌ప‌డ్డ పెన్సిల్ వారికి సాయం చేయ‌డానికి అంగీక‌రిస్తాడు. క్ర‌మంగా పెన్సిల్ త‌న తెలివి తేట‌ల‌తో దొంగ‌త‌నం చేసిందెవరో క‌నుక్కొంటాడు. ఇంత‌కు దొంగ‌త‌నం చేసిందెవ‌రు? దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ రేస‌ర్ దేవ్‌(కార్తికేయ‌), పెన్సిల్‌కి మ‌ధ్య గొడ‌వేంటి? దొంగ‌తనానికి, దేవ్‌కి లింకేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాలి…

విశ్లేషిస్తే… నాని- విక్రమ్‌ కాంబినేషన్ కావడం తో ‘గ్యాంగ్‌ లీడర్‌’పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటంలో దర్శకుడు విక్రమ్‌ ఫెయిల్ అయ్యాడు. విక్రమ్‌ నుంచి ఆశించిన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌ సినిమాలో లేకపోవటం నిరాశ కలిగిస్తుంది . సినిమాను ఇంట్రస్టింగ్‌ సీన్‌తో ప్రాంభించిన దర్శకుడు ప్రతీ సన్నివేశాన్ని సుదీర్ఘంగా చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో సినిమా బోరింగ్‌గా సాగుతుంది. కామెడీ, డైలాగ్స్‌ తో అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పండించారు. “ప్రేక్షకుడు ఊహించే విధంగానే” సాగే కథనం సినిమాకు మైనస్‌ అయ్యింది.అనూహ్య‌మైన మలుపులు లాంటివి లేవు. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్ సీన్ కూడా రొటీన్‌గానే ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి మ‌ళ్లీ రొటీన్ అయింది. చివరి ఇరవై నిముషాలు జస్ట్ ఓకే.సినిమా ప్రారంభంలో చూపించే స‌న్నివేశాలు బాగున్నాయి. చీక‌ట్లో జ‌రిగిన ఆ స‌న్నివేశాల క‌న్నా, వాటి వెనుక వ‌చ్చే రీరికార్డింగ్ మెప్పించింది.సినిమాలో లక్ష్మీ, శరణ్య, ప్రియాంక తదితరులతో కూడిన గ్యాంగ్‌ తో నాని చేసిన సీన్స్‌  ఎంటర్‌టైనింగ్‌ గా సాగుతాయి. అలాగే క్లైమాక్స్ లో నాని, కార్తికేయతో చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది.
 
నటవర్గం… రైట‌ర్ పెన్సిల్ పార్థ‌సార‌థిగా నాని, అత‌ని ఫ్రెండ్ గా ప్రియ‌ద‌ర్శి, బామ్మ‌గా ల‌క్ష్మి, కొడుకును పోగొట్టుకున్న అమ్మ‌గా శ‌ర‌ణ్య‌, కాబోయేవాడిని పోగొట్టుకున్న వ్య‌క్తి గా ప్రియాంక‌…ఈ చిత్రంలో న‌టించిన వారంతా ఎవ‌రి పాత్ర‌ల్లో వాళ్లు స‌రిగ్గా స‌రిపోయారు. పెన్సిల్ పాత్రలో ఒదిగిపోయిన నాని.. కామెడీ, సెంటిమెంట్‌, రొమాన్స్‌ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా పండించాడు. రేస‌ర్ పాత్ర‌లో కార్తికేయ బాగున్నాడు. యాటిట్యూడ్ కూడా చ‌క్క‌గా చూపించ‌గ‌లిగాడు. ఓ వైపు త‌ప్పు చేశాన‌న్న బాధ‌తో లోలోప‌ల భ‌య‌ప‌డుతూ, మ‌రోవైపు రేస‌ర్‌గా లైమ్‌లైట్‌లో ఉండే పాత్ర‌లో కార్తికేయ బాగా చేసాడు. హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రియాంక అరుల్‌మోహన్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కథలో పెద్దగా స్కోప్‌ లేకపోవటంతో ఆమె పాత్ర సపోర్టింగ్‌ రోల్‌గానే మిగిలిపోయింది.వెన్నెల‌కిశోర్ ఈ సారి ఇంకో వైవిధ్య‌మైన పాత్ర‌ చేశాడు.
 
సాంకేతికంగా… అనిరుధ్ సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు అంతగా లేకున్నా… నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశాడు అనిరుధ్‌. మిరోస్లా కుబా బ్రోజెక్‌ సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద ఎసెట్ . ప్రేమ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. న‌వీన్ నూలి ఎడిటింగ్‌ ఓకే.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి -రాజేష్