వినోదాత్మక విమర్శ.. ‘అమ్మోరుతల్లి’ చిత్ర సమీక్ష !

సినీవినోదం :2.75/5

వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌  బ్యానర్ పై ఆర్‌.జె.బాలాజీ, ఎన్‌.జె.శరవణన్ దర్శకత్వంలో ఐరీష్‌ కె.గణేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.’మూకుత్తి అమ్మన్’‌ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో విడుదల చేశారు. ఓటీటీ ‘డిస్నీ హాట్‌ స్టార్’‌లో ఈ చిత్రం విడుదలయ్యింది.

కధ… రామస్వామి(ఆర్‌.జె.బాలాజీ) దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పుడే తండ్రి ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోవడంతో.. తాతయ్య, తల్లి, ముగ్గురు చెల్లెళ్లున్న కుటుంబాన్ని ఓ లోకల్‌ ఛానెల్‌లో పనిచేస్తూ పోషిస్తుంటాడు. అతని గ్రామంతో సహా చుట్టు పక్కల 118 గ్రామాలకు చెందిన 11 వేల ఎకరాల భూమిని దేవుడు పేరుతో ఆక్రమించుకోవాలని భగవతీబాబా(అజయ్ ఘోష్‌) ప్రయత్నిస్తుంటాడు. రామస్వామి తల్లికి తిరుమల వెళ్లాలనే కోరిక. ఆమె ఎప్పుడు తిరుమల వెళ్లాలని అనుకున్నా ఏదో ఒక సమస్య వస్తుంటుంది. ఆ సమయంలో వారి కులదైవం అయిన మూడు పుడకల అమ్మవారిని దర్శించుకోమని ఓ పెద్దాయన సలహా ఇస్తాడు. ఆ గుడికి వెళ్లి రామస్వామి తన కష్టాలను చెప్పుకుని సమస్యలను తీర్చమని చెబుతాడు. రామస్వామి కష్టాలను తీర్చడానికి అమ్మవారు(నయనతార) స్వయంగా భూమిపైకి దిగుతుంది. ముందు రామస్వామి, అతని కుటుంబం అమ్మవారిని నమ్మరు కానీ.. తర్వాత నమ్ముతారు. చివరకు అమ్మవారు ఏం చేశారు?  తన పేరు చెప్పి భూములను ఆక్రమించుకోవాలని చూస్తున్న బాబాకు ఎలా బుద్ధి చెబుతారు? అనేది తెలియాలంటే సినిమాలో చూడాలి…

సమీక్ష… “దేవుడు అనేవాడు మనలోనే ఉంటాడు. బయట వెతక్కండి. మనలో ఉండే దేవుడే ఉత్తమం‌” అని చెబుతూ ఈ సినిమాను తెరకెక్కించారు. దేవుడి గురించి సినిమాను తెరకెక్కించడం అంటే భక్తుల మనోభావాలను దెబ్బ తీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చెయ్యాలి. దర్శకుడు, నటుడు ఆర్‌జె.బాలాజీ ఈ విషయంలో సక్సెస్‌ను సాధించాడు.అమ్మవారిని అడ్డం పెట్టుకుని సెటైరికల్ గా సొసైటీలో జరుగుతున్న విషయాలను బాగా చెప్పారు. దొంగ బాబాలు మాయ మాటలతో భక్తులను ఎలా మోసం చేస్తున్నారో ఇందులో చూపించారు. బాబాలు భక్తిని ప్రచారం చేయాలి.. కానీ కొందరు వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? అని ఈ సినిమా ద్వారా ప్రశ్నించినట్లు అనిపించింది. అలాగే దిగువ మధ్య తరగతివారికి దేవుడు కనిపిస్తే.. ఎలాంటి వరాలు కోరుకుంటారు అనే విషయాలను కూడా ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. అలాగే సెకండాఫ్ పరమ రొటీన్ గా నడవటం ఇబ్బంది పెడుతుంది. క్లైమాక్స్ కూడా కలిసిరాలేదు. కథనం ఇంకాస్త పక్కాగా రాసుకోవాల్సింది.
 
నటన… నయనతార నటన హైలెట్ గా నిలుస్తుంది. సినిమాకి బాగా ప్లస్ అయింది. నిజంగా అమ్మవారు ఉంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. వినోదాత్మక సన్నివేశాల్లో ఆమె కనబర్చిన టైమింగ్, తన ఎక్స్ ప్రెషన్స్ లో చూపించిన దైవత్వం బాగుంది. మధ్య తరగతి కుర్రాడిగా.. ఓ రిపోర్టర్ గా బాలాజీ చాలా బాగా నటించాడు. తన పాత్రలో జీవించేశాడు. ముఖ్యంగా అతను చూపించిన కన్‌ఫ్యూజన్‌, అలాగే అతనిలోని దాగి ఉన్న కష్టం, బాధ గురించి చెప్పే సీన్స్ లో అతని నటన బాగుంది.. ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన పాత్ర అజయ్‌ ఘోష్‌ ది. దొంగ బాబాగా తన నటనతో … అచ్చం బాబాల మేనరిజమ్స్‌తో బాగా ఆకట్టుకున్నాడు. అలాగే హీరోకి తల్లిగా నటించిన ఊర్వశి బాగా నవ్విస్తుంది.
 
సాంకేతికం… దినేష్‌ కృష్ణన్‌.బి సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. మెయిన్ సన్నివేశాల్లోని విజువల్స్ ను చాలా సహజంగా చూపించారు. గిరీష్‌ గోపాలకృష్ణన్‌ సంగీతంలో పాటలు బాగోలేవు. కానీ నేపథ్య సంగీతం బావుంది. ముఖ్యంగా హీరో నయనతారల మధ్య వచ్చే సీన్స్.. క్లైమాక్స్ లో సీన్స్ లో నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ను ఇంకా బాగా ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. దినేష్‌ కృష్ణన్‌.బి సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. మెయిన్ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. డైలాగులు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది – రాజేష్