‘బిగ్ బాస్’ … ఇలాగైతే కష్టం బాసూ !

దేశమంతా పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ లాంటి రియాలిటీ షో తెలుగు లో వస్తుందంటే ప్రేక్షకుల్లో చాలా  ఆసక్తి రేగింది. ఎన్టీఆర్ ఈ బుల్లితెర కార్యక్రమాన్ని నిర్వహిస్తారంటే  ‘బిగ్ బాస్’ షో ఊహించనంత సక్సెస్ అవుతుందని  అంచనా వేశారు. బిగ్ బాస్ షోకు సంబంధించి ఎన్టీఆర్  ప్రోమోలు కూడా చాలా ఆకర్షణీయం గా ఉండటంతో ఈ కార్యక్రమంపై ఆడియెన్స్ ఆసక్తి పెరిగింది. అయితే, ఎన్టీఆర్ కనిపించినంత సేపు షోకు రెస్పాన్స్ బాగానే ఉన్నా …ఆయనలేని సమయంలో ఈ కార్యక్రమం మరీ డీలా పడిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

రెండోది ఈ షోకు ముందు పన్నెండు మందిని అనుకున్నారు. ఆ తర్వాత 14 మందిని తీసుకున్నారు.  ఆదిలోనే అంసపాదు అన్నట్టు తొలుత పాల్గోవాల్సిన భరత్ యాక్సిడెంట్‌లో మరణించారు. రెండో పార్టిసిపెంట్ ముమైత్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. మూడో పార్టిసిపెంట్ నవదీప్ ఎందుకో తప్పుకున్నారు. ఇందులో పార్టిసిపెంట్స్ ఎన్టీఆర్ స్థాయికి తగినవాళ్లా..? అనేది  ప్రేక్షకుల సందేహం.బిగ్ బాస్ షో పార్టిసిపెంట్స్‌లో ఏ ఒక్కరు ఆడియెన్స్‌ను మెప్పించేలా వ్యవహరించడం లేదని ఈ షో చూసిన చాలామంది చర్చించుకుంటున్నారు. ఈ షోలో పాల్గొనే వారంతా…సహజంగా ఉండాలి. ఒకరితో ఒకరు కలిసిపోవాలి. కొట్లాడుకోవాలి, కామెడీ చేయాలి. కానీ ఇందులోని పార్టిసిపెంట్స్‌ ఎక్కువ మంది మరీ నీరసంగా కనిపిస్తున్నారు. దీంతో  ప్రేక్షకులకు కూడా నిరాశక్తి కలిగి ఛానెల్ మార్చేస్తున్నారు.

ఎంతో ఆర్భాటంగా మొదలైన ఆ బుల్లితెర కార్యక్రమం…ఎన్టీఆర్ కు  మైనస్‌గా మారే ప్రమాదం ఉందని అప్పుడే చర్చ మొదలైందట. ఇందుకు కారణం ఆ హీరో కాకపోయినా… ఆ ఎఫెక్ట్ మాత్రం ఆయనపైనే పడే అవకాశం ఉందని గుసగుసలు మొదలయ్యాయి. షో ఆకట్టుకునే విధంగా లేకపోతే అందుకు హోస్ట్ బాధ్యత వహించాల్సి వస్తుందని, ఇక్కడ కూడా అదే జరిగి ఎన్టీఆర్‌పై ఆ ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకుంటున్నారు .తక్షణమే ఈ షో లో ఆకర్షణీయమైన మార్పులు చేస్తే ప్రేక్షకులు తిరిగి ఇటు మళ్ళుతారని ,లేకుంటే కష్టాలు తప్పవని అంటున్నారు.