వంద సినిమాలు చేసినట్లుంది !

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, నివేదా థామస్‌, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జై లవకుశ’. కె.ఎస్‌.రవీంద్ర దర్శకుడు. నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మాత. ఈ సినిమా సెప్టెంబర్‌ 21న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ఇంటర్వ్యూ…

చూస్తుంటే మూడు సినిమాలు ఒకేసారి చేసినట్టుంది? 
– (నవ్వుతూ) మూడు కాదు..వంద సినిమాలు చేసినట్లుంది. కథ డిమాండ్‌ చేసింది. జర్నీ కష్టంగానే ఉంటుంది. ఓ నటుడికి తనను తాను ప్రూవ్‌ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు కష్టపడాలి. ప్రేక్షకులు దగ్గరవ్వడానికి ఇంకా ఆస్కారం దొరికింది.

బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌ ఎప్పుడు? 
– ఇంకా ఏమీ అనుకోలేదు. ఈ నెల 24న సీజన్‌ వన్‌ పూర్తవుతుంది. ఈ షో ప్రారంభం కావడానికి ముందుగానే సెకండ్‌ సీజన్‌ గురించి ఆలోచించాలని అనుకోలేదు. భవిష్యత్‌లో చేస్తానా, చేయనో ఇప్పుడే చెప్పలేను. బిగ్‌ బాస్‌ నాకు ఛాలెంజింగ్‌గా, ఎగ్జయిటింగ్‌గా అనిపించిన కాన్సెప్ట్‌. అసలు షో ఎలా ఉంటుందోనని భయం అందరిలో ఉండేది. కానీ అన్నీ భయాలను పక్కన పెడితే ప్రేక్షకులు కొత్తదనాన్ని యాక్సెప్ట్‌ చేశారు.

తొలిసారి త్రిపాత్రాభినయం చేయడం ఎలా అనిపించింది? 
– సినిమాలో మూడు క్యారెక్టర్స్‌ చేయడం కంటే, ఆ కథే నన్ను బాగా ఎగ్జయిట్‌ చేస్తుంది. తర్వాతే మూడు క్యారెక్టర్స్‌ చేయడం ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది. ఇమేజ్‌ ఉండే టెక్నిలాజికల్‌ లీడ్‌కి మూడు క్యారెక్టర్స్‌ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. అయితే మంచి ప్లాట్‌ ఫాం మీద మీరు చేసిన టెక్నికల్‌ జిమ్మిక్‌ను చూపెట్టగలిగితే అప్పుడు ఫలితం గొప్పగా ఉంటుంది. ‘జై లవకుశ’ కథ విన్నప్పుడు కథే నన్ను ముందు ఎగ్జయిట్‌మెంట్‌ చేసింది.

మూడు క్యారెక్టర్స్‌లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్‌ ఏది? 
– సాధారణంగా దేని కోసమైనా కష్టపడితే దాని మీద ఇష్టం పెరుగుతుందని అంటారు. ఈ చిత్రంలో జై పాత్ర కోసం ఎక్కువగా కష్టపడ్డాను కాబట్టి ఆ పాత్రంటే ఇష్టమెర్పడింది. మిగతా క్యారెక్టర్స్‌ను తక్కువ చేయడం కాదు కానీ జై, లవ, కుశల్లో ఏ ఒక్క క్యారెక్టర్‌ను పక్కకు పెట్టినా, కథకు సంపూర్ణత ఏర్పడదు. ‘జైలవకుశ’ ఒక నటుడిగా టఫ్‌ సినిమానే. వెరీ వెరీ వెరీ ఛాలెంజింగ్‌. ఇంతకు ముందు చాలాసార్లు చెప్పినట్లు నాకు ఛాలెంజెస్‌ అంటే ఇష్టం. ప్రతిదీ ఈజీగా ఉంటే కిక్‌ ఉండదు. చూసేవాళ్లకు కూడా ఎమోషన్‌ రాదు. లవుడు, కుశుడు పాత్రలకు రెఫరెన్స్‌ పాత్రలుండేవి. కానీ జై పాత్రకు రెఫరెన్స్‌ పాత్రలు లేవు. రావణాసురుడిని ఆరాధించే క్యారెక్టర్‌ జై. ఇన్‌టెన్స్‌ ఉన్న పాత్ర ఇది. జై పాయింట్‌ ఆఫ్‌ వ్యూలోనే కథ వెళుతుంది.

జై పాత్రలో నటించడానికి ఏమైనా రెఫరెన్స్‌ తీసుకున్నారా? 
– నేను ‘జై లవకుశ’ సినిమాలో నటించడానికి ఎక్కడా, ఏ కోచింగ్‌ కానీ రెఫరెన్స్‌ కానీ తీసుకోలేదు. ఒక వ్యక్తిగా నేను కూడా కోచింగ్‌ అనే సిస్టమ్‌ను నేను ఇష్టపడను. చాలా మంది మీరు ఇంత బాగా చేస్తున్నారు కదా, కొన్ని టిప్స్‌ చెప్పండి అని అడుగుతుంటారు. నేను శిక్షకుడిని కాదు, ఇంకా విద్యార్థినే. ఇక సినిమాలో జై పాత్ర గురించి చెప్పాల్సి వస్తే, పాత్ర కోసం నేనేం రీసెర్చ్‌ చేయలేదు. జై పాత్రలో నత్తిగా మాట్లాడాలి. దాన్ని ఎలా చేయాలి అని ఆలోచించాను. చాలా మంది నత్తిగా ఎందుకు మాట్లాడుతారంటే, వారు చెప్పాలనుకున్న విషయం ఏంటో తెలుసు. కానీ వాని మైండ్‌ చెప్పాలనుకున్న విషయాన్ని బ్లాక్‌ చేసేస్తుంటుంది. దానికి భయమో, అపనమ్మకమో కారణాలుగా ఉండొచ్చు. ఒక వయసు వచ్చిన తర్వాత ఆ సమస్య పోతుంది. దాన్ని అర్థం చేసుకోకుండా కొంత మంది అదో సమస్యగా భావించి ఎక్కువగా చేసేస్తుంటారు. అందుకని నేను నత్తిగా మాట్లాడేటప్పుడు ఎదుటివారికి అర్థం అయ్యేలా ఉండాలి అనుకుని, ఇలా చెబితే బావుంటుందనిపించి నాకు నేనే అనుకుని చేశాను.

సీనియర్‌ ఎన్టీఆర్‌ రావణాసురుడిగా నటించారు కదా? 
– ఆయన చేశారు కాబట్టే భయం. నటుడిగా ఆయన రావణాసురుడి పాత్రకు ఓ అవధిని క్రియేట్‌ చేసి వెళ్లిపోయారు. ఆ అవధికి దగ్గరగా కూడా వెళ్లలేం.

వరుస సక్సెస్‌ల వెనుక కారణమేంటి? 
– తెలుగు సినిమా గత కొన్ని సంవత్సరాలుగా కొత్త బాట పట్టింది. ఇది చాలా మంచి పరిణామం. ఇలాంటి సమయంలో ఇలాగే చేయాలని అవధులు పెట్టుకుంటే మన ఎదుగుదలకు మనమే ఫుల్‌స్టాప్‌ పెట్టుకున్నట్లవుతుంది. మనం అర్థం చేసుకుని అభివృద్ధిలో భాగమైనా కావాలి లేకుంటే దూరంగా నిలబడి పరిస్థితులను విశ్లేషించాలి. కాలానుగుణంగా మార్పు సహజం. అది నాలో అయినా కావచ్చు లేదా మీలో అయినా కావచ్చు. ఎక్కువ ఆలోచనలు పెట్టుకుంటే ఎటూ వెళ్లలేం. సూపర్‌హిట్‌ సినిమాకు ప్రత్యేకంగా దారేదీ లేదు. అందుకు ప్లాన్‌ ఏమీ లేదు. నిజాయితీగా చేసే ప్రయత్నమే అందుకు దారి.

ఇలాంటి సినిమా చేయడం వెనుక ఇన్‌స్పిరేషన్‌ ఏంటి? 
– నాకు తాతగారి ‘భలేతమ్ముడు’ సినిమా అంటే చాలా ఇష్టం. అందులో ఆయన క్యారెక్టర్‌ చూస్తే , ఆయన పాల్‌ అంటుంటే నాకు భలే ఇష్టం. ఒక విలన్‌ క్యారెక్టర్‌ను కూడా ఆయన ఆహార్యం, రూపు రేఖలు, డిక్షన్‌, డైలాగ్‌ డెలివరీతో హీరో క్యారెక్టర్‌ ప్రెజంట్‌ చేయగలిగారు. అలాగే తాతగారి దానవీరశూరకర్ణ సినిమా నాకు ఇన్‌స్పిరేషన్‌. కథ పరంగా కాకుండా, ఆయన కృష్ణుడి పాత్ర నుండి ధుర్యోధనుడి పాత్రకు, కర్ణుడి పాత్రకు ఎలా పరకాయ ప్రవేశం చేశారనే విషయాన్ని నేను బాగా గమనిస్తాను. అసలు ఆయన బేలన్స్‌ చేశారోనని ఆలోచించేవాడిని. చాలా సంవత్సరాలుగా ఓ స్థిరమైన స్ఫూర్తి మనసులోనే ఉండేది. అలాగని నేను దానవీరశూరకర్ణతో ఈ సినిమాని పోల్చడం లేదు. అసలు పోల్చుకోకూడదు కూడా. ఎందుకంటే స్టోరీ అయినా, గొప్ప నటుడుగా ఆయన పెర్ఫామెన్స్‌ పరంగా అయినా అసలు రెండింటికి పోలికే ఉండదు. నాలాంటి నటుడికి మూడు పాత్రలు చేయడం చాలా కష్టం.

‘జైలవకుశ’ ఎలాంటి మూవీ అనుకోవచ్చు? 
– సినిమాలో అన్నీ ఎలిమెంట్స్‌ ఉంటాయి. అసలు విషయానికి వస్తే తల్లిదండ్రులు వారి బిడ్డలకు సన్నార్గం ఏదీ, చెడు మార్గం ఏది అని చెప్పాలి. అలా చెప్పకుంటే వారిపై బయటి విషయాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు తల్లిదండ్రుల మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యం. అలా బయట కొన్ని కారణాల ప్రభావంతోముగ్గురు బిడ్డల తల్లి కల చెదిరిపోతుంది. మళ్లీ ఆ తల్లి కల నిలబడుతుందా? నిజమవుతుందా? రావణ రామ లక్ష్మణులు మళ్లీ రామ లక్ష్మణ భరతులు అవుతారా? అనేదే ఈ సినిమా. ‘జై లవకుశ’ చాలా ఎమోషనల్‌ మూవీ.

సినిమా చేసే సమయంలో ప్రెషర్‌ ఫీలయ్యారా? 
నాకు, అన్నయ్యకు ఎప్పటి నుండో కలిసి సినిమా చేయాలని కోరిక. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో సినిమూ చేయడం ఇంకాస్తా బాధ్యతను పెంచింది. యాదృచ్చికమో మరేమో కానీ అన్నదమ్ములు కలిసి చేసిన సినిమాలో అన్నదమ్ముల అనుబంధాన్ని తెలియజేసే కథే అదృష్టంగా దొరికింది. బయటి బేనర్‌లో, మీ స్వంత బేనర్‌లో సినిమా చేయడానికి తేడా ఏంటని మీరు అడిగితే, ఈ సినిమాను మా తల్లిదండ్రులకు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాం. కాబట్టి నాకైనా, అన్నకైనా బాధ్యతతో పాటు ఒత్తిడైతే ఉండేది.

అభిమానుల ఎక్స్‌పెక్టెషన్స్‌ ఎక్కువ…అందుకనే ఇలాంటి కథను ఎంచుకున్నారా? 
– త్రిపాత్రాభినయం చేయాలని ముందుగా మనసులో లేదు. ఏ సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి అని కథలు వింటున్న క్రమంలో బాబీ చెప్పిన కథే ‘జై లవకుశ’. బాబీ రైటర్‌గా ఎన్నో సినిమాలకు పనిచేశాడు. దర్శకుడుగా తన ఎగ్జిక్యూషన్‌ గొప్పగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌, ఛోటాగారు సహా మంచి టెక్నికల్‌ టీం వారి ఎక్స్‌పీరియెన్స్‌ను బాబీకి సపోర్ట్‌ చేశారు. ‘జై లవకుశ’ చిత్రం కోసం పనిచేసిన అందరికీ వారి కెరీర్‌లో ఇది గుర్తుండిపోయే చిత్రమవుతుంది. నేను బాక్సాఫీస్‌ రిజల్ట్‌ గురించో, కలెక్షన్స్‌ గురించో మాట్లాడటం లేదు.

మీ సినిమా అంటే అభిమానులు అంచనాలు ఎక్కువగా ఉంటుంది కదా? 
– అంచనాలు ఉండటం తప్పుకాదు. ఎంత వద్దనుకున్నా, కాదనుకున్నా మనిషి మీద మనిషికి అంచనాలు ఉంటాయి. అయితే వాటిని నిజాయితీతో కూడిన ప్రయత్నంతోనే అధిగమించగలం.

రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలున్నాయా? 
– రాజకీయాల గురించి ఇంత త్వరగా మాట్లాడటం సరైంది కాదని నా అభిప్రాయం. నా దృష్టంతా ఇప్పుడు సినిమాలపైనే ఉంది. నేను క్లియర్‌గా ఇదే దృష్టితో ఉండాలనుకుంటున్నాను. నేను వెళతానో, వెళ్లనో తెలియని రంగం గురించి ఇప్పుడే మాట్లాడాలనుకోవడం లేదు. సినిమాలు, కుటుంబం గురించే ప్రస్తుతం ఆలోచిస్తున్నాను.

తదుపరి చిత్రం త్రివిక్రమ్‌గారితోనే…
నా తదుపరి చిత్రం త్రివిక్రమ్‌గారితోనే, అయితే ఎప్పుడు మొదలవుతుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను.