బాలీవుడ్ రంగప్రవేశానికి ఎన్టీఆర్ సిద్ధం ?

ఏ హీరోకి అయినా  బాలీవుడ్ లోకి  వెళ్లాలనే కోరిక సహజంగానే ఉంటుంది… అయితే సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తుంటారు. దాదాపు పదిహేనేండ్ల తర్వాత ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంతో నాగార్జున బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఓ విశేషమైతే…. ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లోకి అడుగిడేందుకు సన్నాహాలు చేయటం మరో విశేషం. ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. దీంతోపాటు రామ్‌చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ మల్టిస్టారర్‌ చిత్రంలోనూ నటించబోతున్నారు. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టేనని ఫిల్మ్‌నగర్‌ టాక్‌…

ఈ టాక్‌కి కారణం ఎవరో కాదు బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ధావన్‌. ఎన్టీఆర్‌కు వరుణ్‌ధావన్‌ పెద్ద అభిమాని. ఎన్టీఆర్‌ డాన్సులు, ఫైట్లు అంటే వరుణ్‌కి బాగా ఇష్టమట. ఇదే విషయాన్ని ఆయన తన అభిమానులతో సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంలో మీరిద్దరూ కలిసి ‘రణ్‌భూమి’లో నటించే అవకాశం ఉందా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానమివ్వలేదు. కానీ, నటించే అవకాశం ఉందని చెప్పకనే చెప్పాడు. అంతేకాదు… “ఇటువంటి విషయాలను నాకంటే దర్శకుడు శశాంఖ్‌ఖైతాన్‌ చెప్పడమే కరెక్ట్‌” అని కూడా ట్వీట్‌ చేయడంతో ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. ‘రణ్‌భూమి’తో ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ రంగ ప్రవేశం విషయం లో త్వరలోనే మనకు క్లారిటీ వస్తుంది.

‘సెలెక్ట్‌’ మొబైల్‌ బ్రాండ్‌  అంబాసిడర్‌గా
ఎన్‌టీఆర్‌ను సెలెక్ట్‌ మొబైల్స్‌ తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకోవడంతో, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ క్లబ్‌లోకి ఎన్‌టీఆర్‌ కూడా చేరిపోయారు.మొబైల్‌ రిటైల్‌ ఇండస్ట్రీలోకి కొత్తగా ప్రవేశించిన ప్రముఖ మొబైల్‌ సంస్థ ‘సెలెక్ట్‌’ తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా టాలీవుడ్‌ స్టార్‌ను నియమించుకుంది. స్టార్‌ హీరో, ఎన్‌టీఆర్‌ను తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు ఈ కంపెనీ చెప్పింది. త్వరలోనే ఎన్‌టీఆర్‌ ఈ బ్రాండ్‌ కోసం షూట్‌ కూడా చేయనున్నారని తెలిసింది.
 
తిరుపతి, హైదరాబాద్‌లో స్టోర్లను ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ మొబైల్స్‌ తన కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించింది. తొలుత దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో 500 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఈ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలోనే చెప్పింది. రామ్‌ చరణ్‌ ‘హ్యాపీ’ మొబైల్స్‌కు, అల్లు అర్జున్‌ ‘లాట్‌’ మొబైల్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.