మార్షల్ఆర్ట్స్ ప్రభాకర్ రెడ్డికి పవన్ కల్యాణ్ సత్కారం!

యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు యువతకు దేహ దారుఢ్యంతోపాటు మానసిక బలం చేకూరేందుకు దోహదం చేస్తాయి… అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చెప్పారు. చిన్నప్పటి నుంచీ యుద్ధ కళలు బాలబాలికలకు నేర్పిస్తే ఆత్మ రక్షణ విద్యగాను, మనోస్థైర్యం ఇచ్చే మార్గంగాను ఇవి ఉపయోగపడతాయి. మన దేశంలో పలు సంప్రదాయ యుద్ధ కళలు ఉన్నాయి… వాటితోపాటు పలు ఆసియా దేశాల మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయన్నారు. నెల్లూరుకు చెందిన మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు, పలు గిన్నిస్ బుక్ రికార్డులు పొందిన ప్రభాకర్ రెడ్డి ని శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో పవన్ కల్యాణ్సత్కరించారు. పవన్ కల్యాణ్ గారు నెలకొల్పిన ట్రస్ట్  ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ ద్వారా రూ.లక్ష చెక్ అందచేశారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… “వింగ్ చున్ అనే మార్షల్ ఆర్ట్.. మన దేశంలో ఉన్న శిక్షకుల గురించి చూస్తుంటే.. ప్రభాకర్ రెడ్డి గురించి తెలిసింది. మార్షల్ ఆర్ట్స్ లో వివిధ దేశాల్లో శిక్షణ పొంది, రికార్డులు సాధించిన ఆయన పెద్ద పెద్ద నగరాలకు వెళ్లిపోకుండా, తన ఊళ్ళోనే ఉంటూ యువతకు శిక్షణ ఇవ్వడం సంతోషం. ఇలాంటివారిని ప్రోత్సహించాలనే మా ట్రస్ట్ ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించాను” అన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ‘వింగ్ చున్’ గురించి తెలుసుకున్నారు. వింగ్ చున్ వుడెన్ డమ్మీపై కొన్ని మెళకువలు తెలుసుకున్నారు.

ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… “ చైనా, థాయిలాండ్, మలేసియా, శ్రీలంకల్లో పలు యుద్ధ కళలు నేర్చుకున్నాను. చైనాలోని షావోలిన్ టెంపుల్ లో శిక్షణ పొందాను.మార్షల్ ఆర్ట్స్ లో 29 ప్రపంచ రికార్డులు సాధించాను. యువతకు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉండటం ఎంతో ఉపయోగపడుతుంది. మన దేశంలో వీటిని నేర్చుకొంటున్నవారు తక్కువగానే ఉన్నారు. పవన్ కల్యాణ్ గారికి పలు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది. వీటిపై ఆసక్తి కూడా చాలా ఎక్కువ. వారు నన్ను పిలిచి సత్కరించి, ఆర్థిక సహాయం ఇవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది. పవన్ కల్యాణ్ గారికి నా కృతజ్ఞతలు” అన్నారు.