తొందరగా తెరమరుగు కావడం నాకిష్టం లేదు !

పూజా హెగ్డే ఐదేళ్ల క్రితం వరుణ్ తేజ్ ‘ముకుందా’తో పరిచయమై ఆ తర్వాత చైతుతో ‘ఒక లైలా కోసం’ చేసినా రెండూ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. అల్లు అర్జున్ ‘డీజే’ ఆఫర్ వచ్చే దాకా పూజాది సంకట స్థితే. ఆ తరువాత నుంచి ఆమె కెరీర్ మెట్రో ట్రైన్‌లా పరుగులు పెడుతూనే ఉంది. వరసబెట్టి స్టార్ హీరోల సరసన క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంటోంది. ‘అరవింద సమేత వీర రాఘవ’తో ఓకే అనిపించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం ‘మహర్షి’ షూటింగ్‌లో బిజీగా ఉంది. ప్రభాస్ సరసన మరో సినిమా చేస్తోంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే వెండితెరకు వచ్చి ఐదు సంవత్సరాల పైనే అయినా… మీ సినిమాల సంఖ్య పెరగక పోవడానికి కారణమేంటి అని పూజాని అడిగితే….
‘‘మెహంజదారో సినిమా సమయంలో చేసిన కొన్ని తప్పులే దీనికి కారణం. బాలీవుడ్‌లో ప్రారంభంలోనే పెద్ద సినిమాలో అవకాశమొచ్చిందన్న ఉత్సాహంతో రెండు సంవత్సరాల డేట్లు వారికి ఇచ్చేశాను. ఓ నటి కెరీర్‌లో ఓ రెండు సంవత్సరాలు ఎంత కీలకమో ఆ సమయంలో నాకు తెలియలేదు. ఆ తరువాత తెలుసుకున్నా ఫలితం లేదు. ఇదే కాకుండా నేను చేసిన సినిమాలు కొన్ని మంచి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తర్వాత సినిమాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదు. నా సినిమాలు ఎక్కువగా రాకపోవడానికి మొదటి కారణం ఇదే. తొందరతొందరగా సినిమాలు చేసేసి…అంతే ఫాస్ట్‌గా తెరమరుగు కావడం నాకిష్టం లేదు. ఈ మాట నేను ఎవరినీ దృష్టిలో పెట్టుకుని అనడంలేదు. నా అభిప్రాయం చెప్పానంతే..’’ అని తెలిపింది
విజయం చాలా తీయగా ఉంటుంది !
సొంతంగా ఎదగడంలో ఉన్న ఆనందమే వేరు అంటోంది పూజాహెగ్డే. దక్షిణాదిన ప్రయాణం మొదలు పెట్టిన ఈమె, ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ రాణిస్తోంది. తెలుగులో మహేష్‌బాబు, ప్రభాస్‌లతో కలిసి నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ‘‘కథానాయికని కావడం ఒకెత్తైతే, పాత్రలు విసిరే సవాళ్లకి అనుగుణంగా నన్ను నేను మార్చుకుంటూ ఎదుగుతుండడం మరో ఎత్తు. అందుకే నా ప్రతి అడుగూ నాకు సంతృప్తిని పంచుతోంద’’ని చెబుతోంది పూజాహెగ్డే. ‘‘సినిమా జీవితాన్ని కలలో కూడా ఊహించలేదు. అనుకోకుండా మోడలింగ్‌లోకి అడుగు పెట్టడం, ఆ తర్వాత కెమెరా ముందుకు రావడం… అంతా ఒక మాయలా అనిపిస్తుంది. కథానాయికని అయ్యాక ప్రతి అడుగు ఓ సవాల్‌గానే అనిపించింది. స్వతహాగా నేను సిగ్గరిని, ఎక్కువగా మాట్లాడను. ఆ స్థితి నుంచి పాత్ర కోరుకున్నట్టుగా ఒదిగిపోతూ, వ్యక్తిగా కూడా నన్ను నేను ఉత్తమంగా తీర్చిదిద్దుకున్నా. మొదట్లో విజయం కూడా ఊరించింది. విజయం నిదానంగానే వస్తుంది, కానీ చాలా తీయగా ఉంటుందని అనుభవమైంది. ఇప్పటిదాకా ఏం చేసినా సొంతంగానే చేశా, స్వీయ అనుభవంతోనే నేర్చుకున్నా. ఈ సంతృప్తే మరిన్ని సవాళ్లని స్వీకరించేంత ధైర్యాన్ని ఇస్తోంద’’ని చెప్పింది పూజాహెగ్డే.