నింగికేగిన ‘పవర్ స్టార్’కు టాలీవుడ్ తో చక్కటి అనుబంధం!

“కన్నడ కంఠీరవ” రాజ్ కుమార్ కుమారుడు.. ‘అప్పు’ అని ముద్దుగా పిలుచుకునే ‘పవర్ స్టార్’ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణాన్ని కన్నడ ప్రజలు జీర్ణించుకోలేకున్నారు.46 ఏళ్ల వయసులోనే హఠాన్మరణం చెందడంతో కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా తెలుగు వారితో పునీత్ రాజ్‌కుమార్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మన టాలీవుడ్ డైరెక్టర్లు, హీరోలతో పునీత్‌కు మంచి అనుబంధం ఉంది. కన్నడలో పునీత్‌ను హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేసి, సెన్సేషనల్ హిట్ అందించింది మన పూరీ జగన్నాధే కావడం విశేషం. తెలుగులో ‘ఇడియట్’  ఎంత సంచలనమైన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే అంతకు ముందే ఈ సినిమాను కన్నడలో ‘అప్పు’ పేరుతో పునీత్ రాజ్ హీరోగా తెరకెక్కించారు. 2002 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం.. పునీత్‌ను స్టార్ హీరోను చేసిందనేది వాస్తవం. అప్పటినుంచి పునీత్‌ను అభిమానులంతా అప్పు అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అనంతరం ఇదే కథతో తెలుగులో ఇడియట్ పేరుతో తీసి.. రవితేజకు కూడా స్టార్ హోదాను ఇచ్చారు పూరీ. అటు పునీత్‌కు, ఇటు రవితేజకు ఒకే ఏడాదిలో.. పూరి జగన్నాధ్ సంచలనమైన విజయాలను అందించారు. పునీత్ రాజ్‌కుమార్‌కు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా సన్నిహిత సంబంధం ఉంది. పునీత్ నటించిన ‘చక్రవ్యూహ’  కోసం ఎన్టీఆర్ ఓ పాటను కూడా పాడారు.

పునీత్ రాజ్‌కుమార్ ‘అప్పు’ తర్వాత.. ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. అభి, ఆకాశ్, అజయ్, అరసు, అంజనీపుత్ర తదితర చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో చిన్న వయసులోనే ‘పవర్ స్టార్’ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు పునీత్. అదేవిధంగా బాలనటుడిగానూ ఆయన చాలా చిత్రాల్లో నటించారు. జాతీయ స్థాయి ఉత్తమ నటుడుగా అవార్డు కూడా అందుకున్నారు. కన్నడిగులు ప్రత్యక్ష దైవంలా ఆరాధించే రాజ్‌కుమార్‌కు ఈయన మూడో కుమారుడు. మొదటి కుమారుడు శివరాజ్ కుమార్‌ కూడా కన్నడ చలన చిత్ర సీమలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. రెండో కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్.. మొదట్లో హీరోగా అనేక సినిమాల్లో నటించారు. పునీత్ ఇటీవల నటించిన ‘యువరత్న’ సినిమా తెలుగులోనూ విడుదలై.. మంచి సినిమా టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా, మరో రెండు సినిమాలు ‘జేమ్స్, ద్విత్వ’ ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి.  మంచి చిత్రాలను అందించడంతో పాటూ, మంచి పేరును కూడా సొంతం చేసుకున్నారు  పునీత్.

విధి రాతను ఎవరూ మార్చలేరు !

పునీత్ రాజ్‌కుమార్ కు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులర్పిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పునీత్ రాజ్‌కుమార్ .. భవిష్యత్తును గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాటలను గుర్తు చేసుకుంటూ అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతన్నారు.  పునీత్ కాజ్‌కుమార్.. అప్పట్లో  ఓ ఇంటర్యూలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగానే భవిష్యత్తు గురించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు… ‘భవిష్యత్తు మన చేతిలో లేదు. గతాన్ని వెనక్కి తీసుకురాలేం. విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. దాన్ని ఎవరూ మార్చలేరు’ అని పేర్కొన్నారు. అప్పట్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలను గుర్తు చేసుకుని అభిమానులు కంటతడి పెడుతున్నారు. ‘మీరు లేరనే వార్తను నమ్మలేకపోతున్నాం. ఈ చేదు వార్త నిజం కాకూడదు.. ప్లీజ్ పునీత్ తిరిగి రా’ అంటూ కామెంట్  చేస్తున్నారు.

పునీత్ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ సూపర్ హిట్ !

“కౌన్ బనేగా కరోడ్ పతి”(కేబీసీ) షో బుల్లి తెరపై ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమితాబ్ బచ్చన్‌ను ఈ షోనే గట్టెక్కించందంటే అందులో అతిశయోక్తి లేదు. మన దగ్గర ఈ షో “ఎవరు మీలో కోటీశ్వరుడు” అనే పేరుతో ప్రసారం అవుతోంది. కన్నడ వెర్షన్‌ షోకు పునీత్ రాజ్ కుమార్ హోస్ట్‌గా వ్యవహరించారు. కన్నడ బుల్లి తెరపై ఈ షో మొదటి సీజన్ 2017లో ప్రారంభమైంది. ఈ సీజన్‌ను పునీత్ రాజ్ కుమార్ హోస్ట్ చేశారు. మొదటి సీజన్ భారీ విజయం సాధించింది. దీంతో రెండో సీజన్‌కు కూడా ఆయనే హో‌స్ట్‌గా వ్యవహరించారు. మూడో సీజన్‌కు అనివార్య కారణాల వల్ల హోస్ట్‌గా చేయలేకపోయారు. నాలుగో సీజన్‌కు తిరిగి ఆయనే హోస్ట్‌గా వ్యవహరించడం మొదలెట్టారు. నాలుగో సీజన్ 2019లో ప్రసారం అయింది. “ఫ్యామిలీ పవర్” అనే షోకు కూడా పునీత్ హోస్ట్‌గా చేశారు. ఈ షో కలర్స్ కన్నడ ఛానల్‌లో ప్రసారం అయింది. ఈ షో 2017 నవంబర్ నుంచి 2018 ఏప్రిల్ వరకు ప్రసారం అయింది. ప్రస్తుతం “నేత్రావతి” అనే కన్నడ టీవీ షోకు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో ఉదయ టీవీలో ప్రసారం అవుతోంది.

రెండు భాషల్లో ఒకే సినిమా…ఫలితం వేర్వేరు !

జూనియర్ ఎన్టీఆర్‌కు పునీత్ రాజ్ కుమార్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరిలో ఎవరు ఎక్కడికి వచ్చినా మరొకరిని కలవకుండా వెళ్లరు. చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ గురించి పునీత్ రాజ్ కుమార్ ప్రస్తావించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయనను ఎంతగానో మెచ్చుకున్నారు.‘‘ జూనియర్‌ ఎన్టీఆర్‌ నా కుటుంబ సభ్యుడిలాంటివాడు. తారక్‌ మాతృమూర్తి స్వస్థలం కర్ణాటక. మేం ఎంతో సన్నిహితంగా ఉంటాం. ఇద్దరం ఒకే కథతో సినిమా చేశాం. నేను వీరకన్నడిగలో హీరోగా నటిస్తే.. తను ఆంధ్రావాలాలో హీరోగా నటించాడు. నేను అడిగానని నా కోసం చక్రవ్యూహ సినిమాలో పాట పాడాడు. బెంగళూరు వస్తే నాకు తప్పకుండా ఫోన్ చేస్తాడు ’’ అని తారక్‌తో అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో పునీత్ రాజ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ హీరోగా పూరీ తెరకెక్కించిన సినిమా ‘ఆంధ్రావాలా’. ఈ సినిమా టాలీవుడ్‌లో సంచలనం స‌ృష్టించలేకపోయింది. కానీ, సేమ్ స్టోరీతో ‘వీర కన్నడిగా’ అనే టైటిల్‌తో పునీత్ రాజ్‌కుమార్ కన్నడంలో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతకు ముందు పూరీకి అసిస్టెంట్‌గా పని చేసిన ‘వీర కన్నడిగా’ డైరెక్టర్ మెహర్ రమేశ్ పునీత్ ‘వీర కన్నడిగా’తో డైరెక్టర్ అయ్యాడు. ఈ చిత్రం శాండల్‌వుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.