భారీ యాక్షన్.. విషయం శూన్యం… ‘సాహో’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.5/5

యు.వి.క్రియేష‌న్స్‌ బ్యానర్ పై సుజిత్‌ దర్శకత్వంలో వంశీ, ప్ర‌మోద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు
కధాంశం… ముంబైలో అతి పెద్ద దొంగ‌త‌నం జ‌ర‌గుతుంది. రెండు వేల కోట్ల రూపాయ‌ల‌ను ఓ దొంగ చిన్న సాక్ష్యం కూడా దొరక్కుండా కొట్టేస్తాడు. కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీస‌ర్ డేవిడ్‌(ముర‌ళీశ‌ర్మ‌), కానిస్టేబుల్ గోస్వామి(వెన్నెల‌కిషోర్‌) దొంగెవ‌రో తెలుసుకునే ప్రయత్నంలో విఫలమవుతారు. దీంతో ప్ర‌భుత్వం ఓ స్పెష‌ల్ ఆఫీస‌ర్ అశోక్ చ‌క్ర‌వ‌ర్తి(ప్ర‌భాస్‌)ను నియ‌మిస్తుంది. అశోక్ కేసుని ఛేదిస్తుండగా చివ‌ర‌కు జై(నీల్ నితిన్ ముఖేష్‌)నే ఆ దొంగ అని తెలుస్తుంది. అయితే జైకు పోలీసుల నుంచి సమాచారం వ‌స్తుండ‌టంతో త‌ప్పించుకుంటూ ఉంటాడు.
జైనే అస‌లు దొంగ అని సాక్ష్యాల‌తో ప‌ట్టుకోవాలంటే ఏదో ఒక‌టి చేయాల‌ని.. అత‌నితో స్నేహం చేయ‌డానికి హీరో అత‌నుండే ప‌బ్‌కి వెళ‌తాడు. అదే స‌మ‌యంలో అమృతానాయ‌ర్‌(శ్ర‌ద్ధాక‌పూర్‌)కి డ్యూటీ వేస్తాడు. క్ర‌మంగా అశోక్ ఆమెను ల‌వ్ చేస్తుంటాడు. ఓసారి తాగిన మైకంలో జై ఓ క్లూ అశోక్‌కు ఇస్తాడు. వాజీ న‌గ‌రంలో ఉండే బ్లాక్ బాక్స్‌లో కోట్ల రూపాయ‌లున్నాయని అది ద‌క్కితే తానే అదృష్ట‌వంతుడిన‌ని, అందుకోసం తాను ప్ర‌యత్నిస్తున్న‌ట్లు చెబుతాడు. ఆ బ్లాక్ బాక్స్ దొంగ‌త‌నం చేసే క్ర‌మంలో అత‌న్ని రెడ్ హ్యాండ్‌గా ప‌ట్టుకోవాల‌ని ప్ర‌భాస్ పోలీసుల‌తో క‌లిసి ప్లాన్ చేస్తాడు.ఈ క్ర‌మంలో సిటీలో పెద్ద డాన్ రాయ్‌(జాకీ ష్రాఫ్‌)ను కొంద‌రు చంపేస్తారు. ఆయ‌న స్థానంలో డాన్ అయిన ఆయ‌న త‌న‌యుడు విశ్వాంక్‌(అరుణ్ విజ‌య్‌) తండ్రిని చంపిన వారిని ప‌ట్టుకోవ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఈ క్ర‌మంలో అనుకోని షాకింగ్ విష‌యాలు రివీల్ అవుతూ వ‌స్తాయి. అస‌లు అశోక్ ఎవ‌రు? అత‌నికి, రాయ్ గ్యాంగ్‌కి ఉన్న రిలేష‌న్ ఏంటి? అస‌లు బ్లాక్ బాక్స్ ర‌హ‌స్య‌మేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ… ‘బాహుబ‌లి’ త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పెర‌గ‌డంతో సాహోపై అంచ‌నాలు ఆకాశాన్ని అంటాయి. ఈ అంచ‌నాల‌తోనే ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కు వ‌స్తాడు. ఈ అంచ‌నాల‌కు అందుకునేలా సినిమా ఉండాలి.రొటీన్‌ క్రైమ్‌ ఫార్ములా కథను ఎంచుకున్న సుజీత్‌, ఆ కథను కూడా ఆకట్టుకునేలా చెప్పలేకపోయాడు. లెక్కలేనని పాత్రలు, ప్రతీ పాత్రకు ఓ సబ్‌ ప్లాట్‌తో కథనం గజిబిజీగా తయారైంది. ‘సాహో’ లో యాక్ష‌న్ డ్రామా.. యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను భారీ గా చిత్రీక‌రించారు. ఎంత భారీ చిత్ర‌మైనా భావోద్వేగాలు కూడా చాలా ముఖ్యం. ఎమోష‌న్ పార్ట్ ఈ సినిమాలో అంత ఎఫెక్టివ్‌గా, క‌నెక్టింగ్‌గా ఉండ‌దు. ఇంటర్వెల్ ట్విస్ట్ కోసం ఫస్టాఫ్ మొత్తం డల్ గా నడిపారు. అయితే ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ మాత్రం బాగా పేలింది.ఇక సెకండాఫ్ అయినా కనెక్ట్ అవుతుంది అనుకుంటే.. అక్కడ వరసపెట్టి ట్విస్ట్ లు పెట్టాడు. మరీ మైండ్ గేమ్ లు ఎక్కువై ..ప్ర‌తి విష‌యంలో ట్విస్ట్‌, థ్రిల్లింగ్ ఇవ్వాల‌నే త‌లంపుతో ప్ర‌తి విష‌యాన్ని దాచి పెట్ట‌డం.. చివ‌ర‌కు రివీల్ చేయ‌డంతో తిక‌మ‌క‌గా త‌యారైంది. ఈ సినిమాలో ట్విస్ట్ లుకు,స్టైల్ కు ఇచ్చిన ప్రయారిటి ఎమోషన్స్ కు ఇవ్వలేదు.
 
యాక్షన్ సీన్స్ చాలా హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తేవచ్చు. కానీ,ఆ యాక్షన్ సీన్స్ కు తగ్గ నేపధ్యం, ఎమోషన్ జత చేయటంలో మాత్రం డైరక్టర్ ఫెయిలయ్యాడు. తెరపై యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ చేసే ఫైట్లు అదిరిపోయినా థియేటర్ లో పెద్దగా రెస్పాన్స్ రాలేదు.ప్ర‌భాస్ యాక్ష‌న్ సన్నివేశాల్లో అద్భుతంగా చేసినా.. ఎవ‌రితో, ఎందుకు చేస్తున్నాడ‌నే క‌న్‌ఫ్యూజ‌న్ క‌న‌ప‌డుతుంది.దాంతో తెరపై ఎంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నా కనెక్ట్ కావటం కష్టమైపోతుంది. క్లైమాక్స్ లో ప్లాష్ బ్యాక్ చూస్తే రొటీన్ రివేంజ్ స్టోరీ చూశామని అనిపిస్తుంది.ఇంత భారీ సినిమాకు క్లైమాక్స్ ‘ముందుగా మనం ఊహించేలానే’ బలహీనమైన ట్విస్ట్ తో పెట్టారు.
 
తారాగణం… ప్ర‌భాస్ చాలాకాలం తరువాత వెండితెర మీద కనిపించినా అతన్ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి చూపించారు. ప్రభాస్‌ను స్టైలిష్‌గా, హాలీవుడ్ స్టార్‌లా చూపే ప్రయత్నం లో దర్శకుడు చాలావరకు సక్సెస్ అయ్యాడు. ప్ర‌భాస్ న‌టుడిగా చాలా రిస్కు తీసుకుని న‌టించాడు. రెండు వేరియేషన్స్‌లోనూ ప్రభాస్‌ నటన ఆకట్టుకుంటుంది. లుక్స్‌ పరంగానూ ప్రభాస్‌ సూపర్బ్ అనిపించాడు. ఇక యాక్షన్‌ సీన్స్‌లో ప్రభాస్‌ చూపించిన ఈజ్‌ వావ్‌ అనిపించేలా ఉంది. అలాగే శ్ర‌ద్ధాక‌పూర్ గ్లామర్ సినిమాకు పెద్ద ప్ల‌స్‌. పోలీసు అధికారి పాత్రలో శ్రద్ధా కపూర్‌ ఒదిగిపోయింది. యాక్షన్‌ సీన్స్‌లోనూ మెప్పించింది. విలన్లుగా చాలా మంది నటులు తెర మీద కనిపించారు. చంకీ పాండే, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్‌, లాల్‌లు తమ పాత్రల పరిధి మేరకు ఓకె అనిపించగా.. జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, మహేష్‌ మంజ్రేకర్‌ లాంటి నటులకు సరైన పాత్రలు దక్కలేదు. మరో కీలక పాత్రలో నటించిన మురళీ శర్మ మరోసారి తనదైన నటనతో మెప్పించారు. వెన్నెల కిశోర్‌ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు.
 
సాంకేతికం… త‌నిష్క్ బ‌గ్చి, గురురంద్వా, బాద్షా, శంక‌ర్ ఎహ్‌సాన్‌లాయ్‌ అందించిన పాట‌ల పిక్చ‌రైజేష‌న్ అద్భుతంగా ఉంది. కానీ.. హిందీ పాట‌ల్లా అనిపిస్తాయి. పాటలు కథనంలో స్పీడు బ్రేకర్లలా మారాయి.జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయ్యింది. చాలా సన్నివేశాలను తన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో మరింతగా ఎలివేట్ చేశాడు. మ‌ది సినిమాటోగ్రఫి ఎక్స్‌ట్రార్డిన‌రీ. గతంలో ఎప్పుడు చూడని లొకేషన్లను ఎంతో అందంగా వెండితెర మీద ఆవిష్కరించారు. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ యాక్షన్ కొరియోగ్రఫి. హాలీవుడ్ స్టంట్‌ మాస్టర్‌లు డిజైన్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌ రెప్ప వేయకుండా చూసేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు అద్భుతం. ప్రభాస్‌ మీద ఉన్న ప్రేమతో నిర్మాతలు అవసరానికి మించి ఖర్చు చేశారు– రాజేష్