‘విశ్వకవి’ ప్రేమకథతో ప్రియాంక నిర్మిస్తున్న ‘నళిని’

నిర్మాతగా ‘నళిని’ పేరుతో ఓ త్రిభాషా చిత్రాన్ని నిర్మించేందుకు ప్రియాంక సన్నాహాలు చేస్తున్నారు.హాలీవుడ్‌ టెలివిజన్‌ సిరీస్‌లు, చిత్రాల బిజీతో రెండేండ్ల గ్యాప్‌ తర్వాత బాలీవుడ్‌ కమ్‌ బ్యాక్‌గా ‘భారత్‌’, ‘క్రిష్‌ 4’ చిత్రాల్లో నటించేందుకు ప్రియాంక చోప్రా పచ్చజెండా ఊపిన విషయం విదితమే. ఇదిలా ఉంటే, నిర్మాతగా ‘నళిని’ పేరుతో ఓ త్రిభాషా చిత్రాన్ని నిర్మించేందుకు ప్రియాంక సన్నాహాలు చేస్తున్నారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జీవితంలోని ఫస్ట్‌లవ్‌ అంశం నేపథ్యంలో ఈ చిత్రాన్ని మరాఠి, బెంగాలీ, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత ఉజ్జ్వల్‌ ఛటర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విషయమై ఆయన మాట్లాడుతూ….

‘ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రధారిణిగా ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల ఇది సాధ్యపడలేదు. అలాగే ఈ స్క్రిప్ట్‌కు విశ్వ భారతి యూనివర్సిటీ నుంచి ఆమోదం రావడం బాగా ఆలస్యమైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 17 ఏండ్ల వయసులో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 20 ఏండ్ల అన్నపూర్ణ అనే అమ్మాయిని ప్రేమించారు. ఇంగ్లండ్‌లో పెరగడంతో అన్నపూర్ణ ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడేవారు. తమ ఇంటి పక్కనే ఉన్న ఠాగూర్‌కి ఇంగ్లీష్‌ నేర్పించే బాధ్యతను అన్నపూర్ణ తీసుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ చనువుతోనే అన్నపూర్ణ పేరును నళినిగా ఠాగూర్‌ మార్చారు. అయితే వీరి ప్రేమను ఠాగూర్‌ నాన్న తిరస్కరించడంతో, నళిని ఓ విదేశీయుడిని పెళ్ళి చేసుకుని ఇంగ్లాండ్‌లోనే స్థిరపడిపోయింది. ఈ కథను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాం. మోడ్రన్‌ శాంతినికేతన్‌ని సందర్శించిన సమయంలో ఓ విద్యార్థి కోణంలో నుంచి ఈ చిత్ర కథ ప్రారంభం అవుతుంది. ఇందులో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌గా సాహెబ్‌ భట్టాఛార్జీ, నళినిగా వైదేహి పరశురామి నటిస్తున్నారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది’ అని చెప్పారు.