జూన్ 1న ఆర్. నారాయణమూర్తి  ‘అన్న‌దాత సుఖీభ‌వ‌’

ఆర్. నారాయణమూర్తి  రూపొందించిన చిత్రం ‘అన్న‌దాత సుఖీభ‌వ‌’ ఎట్టకేలకు సెన్సార్ ముగించుకుని జూన్ 1న విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి ప్రెస్‌మీట్లో
ఆయన మాట్లాడుతూ….
‘‘మా స్నేహ చిత్ర ప‌తాకంపై స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నేను న‌టించి రూపొందించిన చిత్రం ‘అన్న‌దాత సుఖీభ‌వ‌’. ఈ సినిమాకు హైద‌రాబాద్‌లో సెన్సార్ చిక్కులు ఏర్ప‌డ్డాయి. కీల‌కమైన స‌న్నివేశాల‌ను తీసేయ‌మ‌ని వారు చెప్ప‌డంతో రివైజింగ్ క‌మిటీకి వెళ్లాను. మా చిత్రానికి రివైజింగ్ క‌మిటీ క్లీన్ యు స‌ర్టిఫికెట్ ఇచ్చింది. జూన్ 1న చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాను. ఇవాళ అందరికీ అన్నం పెట్టే రైతు ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్క‌డ చూసినా రైతుల ఆత్మ‌హ‌త్య‌లు మ‌న‌సుల్ని పిండేస్తున్నాయి. అన్నం పెట్టే అన్నదాత ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ‘అన్న‌దాత సుఖీభ‌వ’ అని అంటాం. కానీ నేడు ‘అన్న‌దాత ప‌రిస్థితి దుఃఖీభ‌వ’ అన్న‌ట్టే ఉంది. పాల‌కుల‌కు ప్ర‌జ‌లంటే భ‌యం లేదు. భయం ఉన్నప్పుడే వ్య‌వ‌స్థ బాగుంటుంది. ‘అన్న‌దాత సుఖీభ‌వ’ సినిమా సెన్సార్‌కు చాలా ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాను. ఆ ఇబ్బందుల‌ను దాట‌డానికి నాకు రైతు సంక్షేమ సంఘాలు, వామ‌ప‌క్షాలు స‌హ‌క‌రించాయి. వారి మ‌ద్ద‌తుతో ఆర్సీని క్లియ‌ర్ చేసుకోగ‌లిగాను. ఈ నెల 14న పాట‌ల్ని విడుద‌ల చేసి, జూన్ 1న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాను’’ అని అన్నారు.