కాలు రుద్దిన హీరోకు బుద్ధి చెప్పింది !

బాలీవుడ్ సంచలన నటి రాధికా ఆప్టే మరోమారు వార్తల్లో నిలిచింది. బాలీవుడ్‌పైనే దృష్టిసారిస్తున్న రాధికాఆప్టే సినీ తారలపై లైంగిక ఒత్తిడి ఉన్న మాట నిజమేనని ప్రకటించి వివాదాస్పద నటీమణుల లిస్టులో పడిపోయింది. ఆ తర్వాత దక్షిణాది సినీ ఇండస్ట్రీ పైనా కామెంట్స్‌ చేసింది. ఇలా ఏదో ఒక సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న రాధికా.. తాజాగా మరో కామెంట్‌ చేసింది. బాలీవుడ్‌ నటి నేహా దూపియా నిర్వహిస్తున్న ‘టాక్‌ షో’ వోగ్ బీఎఫ్‌ఎఫ్‌కు రాధిక అతిథిగా వెళ్లింది…

అక్కడ ఆమె మాట్లాడుతూ… తాను నటించిన తొలి దక్షిణాది సినిమాలో ప్రముఖ హీరో చెంప పగలగొట్టానని తెలిపింది. ఆ సినిమా షూటింగ్‌లో భాగంగా సెట్‌కి వెళ్లిన తొలి రోజే తనతో హీరో అసభ్యంగా ప్రవర్తించాడని, తన పక్కనే కూర్చున్న అతడు.. తన కాలిని అసభ్యంగా రుద్దాడని చెప్పింది. కనీసం పరిచయం కుడా లేని తనతో ఆ హీరో అలా ప్రవర్తించడంతో కోపంతో చెంప చెళ్లుమనిపించానని రాధిక వివరించింది. తెలుగులో బాలకృష్ణతో లెజెండ్‌, లయన్‌.. వర్మ రక్తచరిత్ర వంటి సినిమాలతో పాటు తమిళంలో రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమాతో రాధికా దక్షిణాది వారికి చేరువైంది.

 లైంగిక ఒత్తిడి ఉన్న మాట నిజమే !

లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని నటి రాధికాఆప్టే అంటోంది.  అర్ధనగ్న దృశ్యాల ఫొటోలను సోషల్‌ మీడియాల్లో పోస్ట్‌ చేస్తూ తరచూ వార్తల్లో ఉండే ఈ ఉత్తరాది భామ వివాదాస్పద వ్యాఖ్యలతో  కలకలం సృష్టిస్తుంటుంది. కోలీవుడ్‌లో  కొన్ని చిత్రాల్లో నటించిన రాధికాఆప్టే టాలీవుడ్‌లోనూ ఒకటి రెండు చిత్రాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు లేవు. బాలీవుడ్‌పైనే దృష్టిసారిస్తున్న రాధికాఆప్టే సినీ తారలపై లైంగిక ఒత్తిడి ఉన్న మాట నిజమేనని ప్రకటించి వివాదాస్పద నటీమణుల లిస్టులో పడిపోయింది.

 రాధిక మాట్లాడుతూ…. హీరోయిన్లకు లైంగిక వేధింపులు అన్నవి నిజమేనని చెప్పింది. అయితే అలాంటి సంఘటనలను అందరూ బయటకు చెప్పుకోలేరని అంది. అలా చెబితే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని, కలలు కల్లలై పోతాయనే భయం అని అన్నది. అయితే హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాలని కోరింది. లేకుంటే అలాంటి సంఘటనలు పెరిగిపోతాయని అన్నది. సమాజంలో మార్పు రావాలని, మహిళలు తమకు జరిగిన అన్యాయాలపై ధైర్యంగా పోరాడాలని చెప్పింది. అప్పుడు దురాగతాలకు అడ్డుకట్ట వేయవచ్చునని చెప్పింది. తనకు అలాంటి సంఘటనలు పెద్దగా ఎదురవ్వలేదని, తాను ఎదుర్కొన్న అనుభవాలను ఇంతకు ముందే వెల్లడించానని చెప్పింది. అయితే ఇతరుల లైంగిక వేధింపుల గురించి తాను మాట్లాడనని చెప్పింది.