నువ్వు నువ్వే కాబట్టి అందంగానే ఉంటావు !

“అటు వైపు చూడొద్దు, అటు వెళ్లొద్దు, ఇలా చేయొద్దు, అలా ఉండొద్దు.. ఇలా మహిళలకు ఎన్నో కట్టుబాట్లను సమాజం విధించింది. ఈ నిర్బంధ నియమాలు ఇంకా ఎక్కువ శాతం మహిళలపై పనిచేస్తూనే ఉన్నాయి. వీటన్నింటికీ స్వస్తి చెప్పాలి”….. అని అంటోంది  విలక్షణ నటి రాధికా ఆప్టే .

రాధికా ఆప్టే విమర్శలు పట్టించుకోదు. చేస్తున్న పాత్రకు నూరుపాళ్లు న్యాయం చేయడమే ఆమె లక్ష్యం. పాత్ర ఏదైనా సరే. వందకు వంద మార్కులు పడాల్సిందే. అందం.. అభినయం. రెండింటినీ మేళవించి అందరినీ ఆకట్టుకోవడమే తెలిసిన నటి రాధికా ఆప్టే. వెండితెర, య్యూట్యూబ్‌, చిన్న సినిమా.. పెద్ద సినిమా.. ఇలా గిరి గీసుకు కూర్చోలేదు. ఎక్కడ నటనకు అవకాశం ఉంటే అక్కడ అడుగుపెట్టింది. ఆమె ఇలా చెబుతోంది ….
“మహిళ జీవితం ఆమె చేతుల్లో ఉంది. దాన్ని ఎవరూ నిర్దేశించలేరు. శరీర ఆకృతి ఎలా ఉన్నా, ఆకట్టుకునే విధంగా ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావు. ఎందుకంటే నువ్వు నువ్వే కాబట్టి. నీ జీవిత లక్ష్యాన్ని నువ్వే నిర్దేశించుకోవాలి. ఇతరులు దాన్ని నియంత్రించకూడదు. నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావో అలాగే ఉండాలి. ఇతరులు అన్నారు కదా అనీ నిన్ను నువ్వు మార్చుకోకూడదు. నీకు ఏదనిపిస్తే అదే చేయాలి. సమాజం విధించిన కట్టుబాట్లను తెంచేయాలి”

“ఈ సమాజమే అసమసమాజం. అలాంటి అసమ సమాజంలోనే ఉన్న సినిమా పరిశ్రమలో సమానత్వాన్ని ఆశించడం మన అమాయకత్వం. పారితోషికం, పాత్రచిత్రణ ఇలా అన్నింటిలో ఇక్కడ హీరోకు ఉన్న ప్రాధాన్యం హీరోయిన్‌కు ఉండదు. అన్నిచోట్లా అసమానత. ఇది రంగస్థలం… సినిమా… అన్ని రంగాల్లోనూ ఉన్నది. పురుషాధిపత్యం ఎక్కువగా ఉన్న మసాలా సినిమాల కన్నా ప్రత్యామ్నాయ సినిమాల్లో నేను ఎక్కువగా నటించేది అందుకే. కాకపోతే, పాటలు, ఫైట్లతో ఆడవాళ్ళను అందంగా, సంప్రదాయానికి కట్టుబడినట్లు చూపించే మాస్‌ సినిమాలు చేస్తే నటిగా కమర్షియల్‌ వ్యాల్యూ వస్తుంది. దాని వల్ల మనం ప్రత్యామ్నాయ సినిమాలు నటించినప్పుడు, అవి ఎక్కువ మందికి చేరతాయ”ని అంటోంది రాధిక