‘2.0’ కంటే ముందుగానే మరో కొత్తసినిమా

‘కాలా’ రజనీకాంత్‌కు మిశ్రమ ఫలితాన్ని అందించింది. అయితే ప్రస్తుతం ఆయన కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే డెహ్రాడూన్‌లో ప్రారంభమైంది. సిమ్రాన్‌, విజయ్ సేతుపతి, బాబీ సింహా, మేఘా ఆకాష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రజనీ నటిస్తున్న మరో సినిమా ‘2.0’ కంటే ముందుగానే విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుందట.

శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ ‘2.0’లో నటిస్తున్న విషయం విదితమే. ‘శివాజీ’, ‘రోబో’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. అక్షరు కుమార్‌ ప్రతినాయకుడిగా, అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటించారు. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ కారణంగా పలు సార్లు వాయిదా పడింది. ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌ చేస్తున్న సంస్థ దివాళా తీయడంతో మరో సంస్థకు అప్పగించారు. దీంతో గతేడాది దీపావళికి విడుదల కావాల్సిన ఈ సినిమా అప్పట్నుంచి ఈ ఏడాది జనవరికి, ఆ తర్వాత ఏప్రిల్‌కి, మళ్ళీ ఈ ఏడాది దీపావళికి వాయిదా పడింది.తాజా సమాచారం మేరకు ఈ చిత్రం ఈ ఏడాది కూడా రావడం కష్టమట. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఇంకాస్త ఆలస్యమవుతుండటంతో వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఛాన్స్‌ ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. చిత్ర బడ్జెట్‌ కూడా రూ.200 నుంచి రూ.300కోట్లకు చేరుకుందని అంటున్నారు.

అయితే ఇటీవల విడుదలైన ‘కాలా’ నాలుగు రోజుల్లోనే రూ.100కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు సమాచారం. ఆస్ట్రేలియాలో ‘పద్మావతి’ తర్వాత ఎక్కువ కలెక్షన్లను రాబట్టిన భారతీయ సినిమాగా ‘కాలా’ నిలిచింది. ఇది అక్కడ 2.4 కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్‌ సినీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ తెలిపారు.