నటనే నా జీవితం అని మళ్లీ గుర్తు చేసింది !

పెళ్లయి తర్వాత గ్యాప్‌ తీసుకుంటున్న హీరోయిన్లు.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా పాత్రా ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. కానీ, నాలుగేళ్ల తర్వాత తిరిగి ‘హిచ్‌కీ’తో రీఎంట్రీ ఇచ్చిన రాణీ ముఖర్జీ మాత్రం బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపింది. మొదటి రోజు ఆ చిత్రం రూ. 3కోట్ల 30లక్షలు వసూలు చేసి.. ఈ మధ్య రిలీజ్‌ వచ్చిన లేడీ ఓరియంటల్‌ చిత్రాల్లో తొలి రోజు వసూళ్లలో టాప్‌ స్థానంలో నిలిచింది.

“పెళ్లయిన  వాళ్ల సినిమాలు హిట్‌ కాకూడదా?” అని రాణీ ముఖర్జీ ఈ సందర్భం గా ప్రశ్నిస్తోంది. ‘ఓ సినిమా విజయవంతం కావటానికి కావాల్సింది మంచి కథ, నటీనటుల ఫెర్‌ ఫార్మెన్స్‌. అంతేగానీ అందులో నటించేవారికి పెళ్లయ్యిందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. వ్యక్తిగత జీవితాన్ని.. సినీ జీవితాన్ని బ్యాలెన్స్‌ చేయగలుగుతానా? అన్న అనుమానాల మధ్యే నటించటం మొదలుపెట్టాను. కానీ, నటనే నా జీవితం అన్న విషయం నాకు ఈ చిత్రం మళ్లీ గుర్తు చేసింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో నా కూతురు అదిరాను చూసుకుంటూనే.. ఇకపై నటనలోనూ కొనసాగుతా. ఆదరిస్తున్న వారికి నా కృతజ్ఞతలు’ అని ఆమె తెలిపారు.

టూరెట్‌ సిండ్రోమ్‌తో బాధపడే ఓ మహిళ, టీచర్‌గా మారి వీధి బాలల బతుకులను మార్చాలని యత్నించటం… ఆ క్రమంలో అందరితో ఆమె అవమానాలు ఎదుర్కోవటం…ఆ ప్రయత్నంలో చివరకు విజయం సాధించటం అనే కథాంశంతో ‘హిచ్‌కి’ని దర్శకుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా తెరకెక్కించాడు.

ఓ మహానటిని తెరపై చూశా ! 
మా ఆవిడ పుట్టిన రోజు అయితేనూ…. ఇంట్లో అందరం సినిమాకనీ బయలుదేరాం. ఏ సినిమాకెళ్లాలో క్లారిటీ లేదు. చేతిలో కారుంది. గుడ్డిగా బయలుదేరాం.
కారులోనే ‘bookmyshow’ యాప్ ఓపెన్ చేసి ఎక్కడెక్కడ ఏ సినిమా ఆడుతుందో చూడ్డం మొదలెట్టా.
అప్పుడు నాకర్ధమెన విషయం ఏంటంటే… ఆడుతున్న మన తెలుగు సినిమాల్లో దాదాపుగా అన్నీ అద్భుతాలే.
అందుకే అంతటి అద్భుతాలకు… ‘శుభమా…!’ అంటూ పుట్టిన రోజు నాడు తీసుకెళ్లి నా అర్ధాంగిని బాధపెట్టడం ఇష్టంలేక…. అందర్నీ ఓ బాలీవుడ్ సినిమాకు తీసుకెళ్లా.
ఆ సినిమా పేరే… ‘హిచ్కీ’.
రాణీ ముఖర్జీ రీ ఎంట్రీ సినిమా. సినిమా చూసి బయటకు రాగానే… మా పిల్లలంతా మా ఆవిడకీ థ్యాంక్స్ చెప్పారు.
మా ఆవిడ’ పుట్టిన రోజున నాకు మంచి బహుమతి ఇచ్చావ్’ అని నన్ను అభినందించింది.
దాంతో… ఆనందంతో… నా ఛాతి వెడల్పైంది.

థియేటర్లలో ప్రేక్షకుల కరతాళ ధ్వనులు చాలా కాలం తర్వాత చూశా.
హృదయాన్ని చలింపజేసిన అసలుసిసలైన అద్భుతం ‘హిచ్కీ’ఓ మహానటిని తెరపై చూశా.        హేట్సాఫ్’ రాణీ ముఖర్జీ’ !                                                   – నరసింహ బుర్రా . జర్నలిస్ట్