బైసెక్సువల్ గా నెగెటివ్ పాత్రలో రణ్‌వీర్ !

‘పద్మావతి’ చిత్రం లో నెగెటివ్ రోల్‌లో రణ్ వీర్ సింగ్ కనిపించనున్నాడు. ఈ రోజుల్లో పాత్ర ఎలాంటిదైనా బాగా చేస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని…  నటులుగా తాము ప్రతిభావంతం గా చేసి ప్రేక్షకులను మెప్పిస్తామనే ధైర్యంతో హీరో, హీరోయిన్స్ ఉన్నారు. నెగెటివ్ షేడ్ పాత్ర అయినా సరే వెంటనే ఓకే చెబుతున్నారు. ఇదే తరహాలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ .. సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘పద్మావతి’ చిత్రం కోసం బైసెక్సువల్( స్త్రీ, పురుషుల కలగలిసిన) గా మారాడట.

ఇప్పటికే చిత్రంలో రణ్‌వీర్ సింగ్ షూటింగ్ పార్ట్ పూర్తైనట్టు తెలుస్తుండగా, అల్లావుద్దీన్ ఖిల్జీగా నెగెటివ్ రోల్‌లో రణ్ వీర్ సింగ్ కనిపించనున్నాడు. తన బానిస అయిన జనరల్ మాలిక్ కాఫూర్‌పై మోహం పెంచుకున్న అల్లావుద్దీన్ పాత్రలో రణ్ వీర్ అద్భుతంగా నటించాడట. ముందుగా పద్మావతి ప్రేమలో పడ్డ అల్లావుద్దీన్, ఆమె ‘ససేమిరా’ అనే సరికి ఆత్మహత్యకి కూడా ప్రయత్నిస్తాడని సమాచారం. మాలిక్ కాఫూర్ పాత్రని ‘నీర్జా’ ఫేం జిమ్ సర్భా పోషించనున్నట్టు టాక్. తన కెరీర్‌లో తొలిసారి రణ్‌వీర్ ఇలాంటి పాత్ర చేయబోతుండడంతో అభిమానులలో భారీ అంచనాలు పెరిగాయి. ఇక షాహిద్ కపూర్ రాజా రావల్ సింగ్ పాత్రని పోషిస్తున్నాడు. ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని నవంబర్ 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.