పాత్ర మీద పట్టుపోతుందని మూడు కోట్లు వదిలేసాడు !

రణ్‌వీర్ సింగ్‌ భారీ ఆఫర్‌ను వదిలేసుకోవడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.కష్టపడి  ఎదిగినవారు పక్క చూపులు చూడరు. ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారు.  ప్రతీ సినిమానూ అంకిత భావంతో చేస్తూ దూసుకుపోతారు. అలాంటి వాళ్లకు తమ సినిమాలకన్నా మరేవీ ముఖ్యంగా కనిపించవు. అంతటి ఓ ఆదర్శవంతమైన కథానాయకుడు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్. ఇతడిప్పుడు ఒక సినిమాలో చేస్తున్న పాత్ర కోసం 30 నిమిషాలకు 3 కోట్ల భారీ ఆఫర్‌ను సైతం వదలుకున్నాడట.
విషయం ఏమిటంటే… ప్రస్తుతం సినిమాలతోనే కాకుండా, కొన్ని ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ గానూ ఫుల్ బిజీగా ఉన్న రణ్‌వీర్ సింగ్‌ను తన పెళ్లికి వచ్చి డ్యాన్స్ చేయాలని కోరాడట ఒక బిజినెస్ మ్యాన్. 30 నిమిషాల పాటు డ్యాన్స్ చేస్తే ఏకంగా 3 కోట్ల భారీ పారితోషికాన్ని ముట్టచెబుతానని ఒక బ్రహ్మాండమైన ఆఫరిచ్చాడట. కానీ రణ్ వీర్ ఆ ఆఫర్‌ను వదిలేసుకోవడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
 అయితే రణ్‌వీర్ సింగ్ ఆ ఆఫర్‌ను వదిలేసుకోవడాన్ని కాకుండా దాన్ని వదలుకోడానికి గల కారణానికి అందరూ ఫిదా అవుతున్నారట ఇప్పుడు. బిజినెస్ మేన్ పెళ్లికి డ్యాన్స్ చేయడానికి వెళితే.. రణ్ వీర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలోని పాత్ర మీద పట్టుపోతుందని, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం కుదరదని భావించాడట. అందుకే అంత పెద్ద ఆఫర్‌కి రణవీర్ చలించలేదని అతడి డెడికేషన్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు.