హీరోతో సమానమైన పాత్రలు వస్తేనే చేస్తా !

అదృష్టమంటే కన్నడ నటి రష్మిక మందన్నదే అంటున్నారు. చిత్రసీమలో అరంగేట్రం చేసిన రెండేళ్లలోనే ఈ అమ్మడు తారాపథంలో దూసుకుపోతున్నది. ముఖ్యంగా తెలుగులో ‘గీత గోవిందం’ ఈ సుందరికి యువతరంలో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించిపెట్టింది. తాజాగా తమిళంలో అరంగేట్రం చేస్తూ కార్తీ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తన సినీ ప్రయాణం, కథాంశాల ఎంపికలో ప్రాధాన్యతల గురించి రష్మిక మాట్లాడుతూ….
 
“సినీరంగంలో ఓపిక చాలా ముఖ్యం. సినిమా అంగీకరించడం వరకే మన చేతిలో ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాల్ని అయినా అంగీకరించాల్సిందే. నా సక్సెస్ ఎంతో మంది కృషి ఫలితమని నమ్ముతాను. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు పెద్దపీట వేద్దామనుకుంటున్నాను. బాలీవుడ్‌లో వచ్చిన మహిళా ప్రధాన చిత్రాలు ‘ఇంగ్లీష్ వింగ్లీష్’, ‘డియర్ జిందగీ’ తరహా ఇతివృత్తాల్లో నటించాలని ఉంది. ప్రస్తుతం వరుసగా వాణిజ్య చిత్రాల్లో అవకాశాలొస్తున్నాయి. కథలో కొత్తదనం ఉంటేనే సినిమాల్ని అంగీకరిస్తున్నాను. నేను సినిమాల్ని తిరస్కరించడంతో కొంతమంది దర్శకనిర్మాతలు నొచ్చుకుంటున్నారు. అయితే వారు నా పక్షాన కూడా ఆలోచించాలి. కమర్షియల్ చిత్రాల నాయికగా ముద్రపడొద్దన్నదే నా అభిలాష. హీరోతో సమానమైన పాత్రలు వస్తేనే సినిమాలకు ఓకే చెబుతున్నా” అని చెప్పింది.
 
అరుదైన గౌరవం దక్కింది !
యంగ్ బ్యూటీ రష్మిక మందన్న కన్నడంలో ‘కిర్రాక్ పార్టీ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే కన్నడ ప్రేక్షకులను ఆకర్షించిన ఆమె టాలీవుడ్‌లోకి ‘ఛలో’ చిత్రంతో ప్రవేశించి మంచి హిట్‌ను అందుకుంది. ఇక రెండవ సినిమా ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ప్రస్తుతం రష్మిక తెలుగు, కన్నడ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఈ భామ ‘యజమాన’ అనే చిత్రంతో కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 
ఈ చిత్రానికి ఇప్పటికే పాజిటివ్ టాక్ రావడంతో పాటు రెండు రోజుల్లోనే భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రంలో హీరోగా నటించిన దర్శన్ కంటే హీరోయిన్ రష్మికకే ఎక్కువ ప్రశంసలు దక్కుతున్నాయి. మైసూర్ నగరంలోని ఓ థియేటర్ వద్ద రష్మిక అభిమానులు ఆమె భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేసి పెద్ద దండతో అలంకరించారు. ఇప్పటివరకు కన్నడ సినీ చరిత్రలో ఏ హీరోయిన్‌కు దక్కని అరుదైన గౌరవం రష్మికకు దక్కడం విశేషం.