సంచలన విజయాలు సాధిస్తున్న ‘రెబల్‌స్టార్‌’ ప్రభాస్‌

‘బాక్సాఫీస్‌ బాహుబలి’ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు అక్టోబర్‌ 23ఆరడుగుల పైన హైట్‌..హైట్‌కు తగ్గ పర్సనాలిటీ.. పర్సనాలిటీకి తగ్గ వాయిస్‌ ప్రభాస్‌ సొంతం. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెలుగు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాలని ‘బాహుబలి’ చేస్తే, దానికి సరిపోయే హీరోగా ప్రభాస్‌ నిలిచారు..అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్‌ నటనకు ప్రేక్షకులు, విమర్శకులు ‘శభాష్‌’ అన్నారు. ‘బాహుబలి’ తర్వాత ‘ఆల్‌ ఇండియా స్టార్‌’గా ఎదిగిన ప్రభాస్‌ ఈస్థాయికి చేరుకోవడానికి పదిహేడేళ్లకు పైగా కష్టం, అంకిత భావం, సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో విభిన్నమైన చిత్రాలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
 
కృషితోనే నేషనల్‌ స్టార్‌
తెెలుగు సినిమా అంటే ఓ రీజనల్‌ సినిమా అనే భావన నుండి నేటి తరం టాలీవుడ్‌ యువ దర్శకులు సత్తా చాటే క్రమంలో తెలుగు సినిమా దర్శకులకు, నిర్మాతలకు కొత్త ఊపిరినిచ్చిన సినిమా ‘బాహుబలి’. అప్పటి వరకు టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రాజమౌళి తెలుగులో చేసిన కొత్త ప్రయోగం. ఇలాంటి ఓ సినిమాను తెరపై ఆవిష్కరించడం అంత తేలికైన విషయం కాదు. మరి ఆయనకు వెన్నుదన్నుగా నిలిచే హీరో కూడా ముఖ్యం కదా. రాజమౌళికి రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ అండగా నిలబడ్డారు. సినిమాను రెండేళ్లలో పూర్తి చేయాలనుకున్నారు. రేండేళ్లు కాస్తా ఐదేళ్లయ్యింది. ఐదేళ్ల వరకు మరో ప్రాజెక్ట్‌ గురించి ఆలోచించకుండా కమిట్‌మెంట్‌తో బాహుబలిని ప్రభాస్‌ పూర్తి చేశారు. ప్రభాస్‌ తపన, రాజమౌళి కృషి కలయికే ‘బాహుబలి’. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేయడమే కాదు, ఏకంగా తెలుగు సినిమా మార్కెట్‌ను ఆకాశమే హద్దు అనేలా చేసింది. బాహుబలి రిలీజ్‌ ముందు వరకు తెలుగు సినిమా మార్కెట్‌ ఓ వందకోట్లు ఉంటే.. రిలీజ్‌ తర్వాత ఆ రేంజ్‌ పాతిక రేట్లు పెరిగింది.బాహుబలి రెండు భాగాలు కలిపి దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందంటే ఆ సినిమా ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్క ర్లేదు. పలు దేశాల్లో ఈ చిత్రం ప్రదర్శించడం ద్వారా ఇంటర్నేషనల్‌ హీరో అయ్యారు ప్రభాస్‌.
 
అంతర్జాతీయ గుర్తింపు
ప్రభాస్‌ మైనపు ప్రతి మను 2017లో బ్యాంకాక్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజి యంలో ప్రతిష్టించారు. అందుకోసం 350 ఛాయా చిత్రాలను, ఆయన శారీరక కొలతలను తీసుకున్నారు. ఆయన బాహుబలి చిత్రంలోని వస్త్రధారణతో ఉన్న ఆహార్యాన్ని పోలిన ప్రతిమను సృష్టించి మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించడం విశేషం.
 
వసూళ్లతో బాక్సాఫీస్‌ షేక్‌
బాహుబలితో ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్‌తో యువి క్రియేషన్స్‌ సుజీత్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళ భాషల్లో రూ.350కోట్లతో భారీ బడ్జెట్‌, హైటెక్నికల్‌ వేల్యూస్‌తో ప్యాన్‌ ఇండియా చిత్రం. బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌ ,నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీష్రాఫ్‌, మందిరా బేడి , ఇంటర్నేషనల్‌ టెక్నీషియన్స్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రభాస్‌ కెరీర్‌లో ‘వన్‌ ఆఫ్‌ ది హయ్యస్ట్‌ గ్రాసర్‌’గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. తొలిరోజునే ప్రపంచ వ్యాప్తంగా రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్‌లో రూ153కోట్ల వసూళ్లను సాధించి మరోసారి అక్కడ ప్రభాస్‌ తన సత్తా చాటారు. ప్రపంచ వ్యాప్తంగా 425 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది.
 
ప్రభాస్‌ ప్రస్తుతం ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా వుంటూ అందర్నీ ఆప్యాయంగా ‘డార్లింగ్‌’ అని పలకరించే ప్రభాస్‌ని అందరూ ఎంతో ఇష్టపడతారు. అలాంటి రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు అక్టోబర్‌ 23. ఈ సందర్భంగా ‘రెబల్‌ స్టార్‌’ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు !