ప్యాన్‌ ఇండియా చిత్రాలతో పెరిగిన ప్రభాస్ ఇమేజ్..‌ రేంజ్!

టాలీవుడ్‌లో ‘యంగ్‌ రెబల్‌స్టార్‌’ ప్రభాస్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ప్రభాస్‌ ‘బాహుబలి’తో ‘ప్యాన్‌ ఇండియా స్టార్’‌గా ఎదిగారు. తొలి చిత్రం ‘ఈశ్వర్‌’తో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుని..తర్వాత రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్‌నిరంజన్‌, డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, రెబల్‌, మిర్చి వంటి చిత్రాలతో వైవిధ్యత‌ను చూపుతూ  అన్నీ వర్గాల ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రభాస్‌.

‘బాహుబలి’కి ముందు.. ‘బాహుబలి’కి తర్వాత…
ప్రభాస్‌ కెరీర్‌ను చూస్తే బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని రెండు భాగాలుగా చూడాల్సిందే. ఎందుకంటే ఆయన కెరీర్‌ను బాహుబలి అమాంతం పెంచేసింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన బాహుబలి చిత్రంలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ప్రభాస్‌ నటించిన తీరు అద్వితీయం. ఆయన తప్ప మరొకరు ఆ పాత్ర చేయలేరనేంత గొప్పగా బాహుబలి సినిమాలో ఒదిగిపోయారు ప్రభాస్‌. జక్కన్న శైలిని ఒడిసిపట్టుకుని ఆయనపై నమ్మకంతో ఐదేళ్ల పాటు మరో సినిమాలో నటించకుండా ఈ సినిమాకే కట్టుబడి ఉండటం ప్రభాస్‌లోని అంకితభావాన్ని సూచిస్తుంది. బాహుబలిని ఐదేళ్ల వరకు ఓ మహాయజ్ఞంలా పూర్తి చేయడానికి ప్రభాస్‌ పడ్డ కష్టమేంటో సినిమా రిలీజైన తర్వాతే అందరికీ తెలిసింది. ఐదేళ్ల వరకు మరో ప్రాజెక్ట్‌ గురించి ఆలోచించకుండా ఓ కమిట్‌మెంట్‌తో సినిమా చెయ్యాలంటే ఏ హీరో అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ ప్రభాస్‌ మాత్రం అలా ఆలోచించలేదు. ఐదేళ్లు బాహుబలి గురించే తపన పడ్డారు. ప్రభాస్‌ తపన, రాజమౌళి కృషి కలయికే ‘బాహుబలి’. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం తెలుగుసినిమా మార్కెట్‌ ఇంత ఉందా అని నోరెళ్లబెట్టేలా చేసింది. ఒకప్పుడు బాలీవుడ్‌లో తెలుగు సినిమా అంటే చిన్నచూపు వుండేది. కానీ, ఇప్పుడు ప్రభాస్‌ నటనకు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రభాస్‌తో సినిమాలు చేస్తున్నాయి.

‘మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియం’ గౌరవం !
బ్యాంకాక్‌లోని ‘మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం’లో ప్రభాస్‌ మైనపు ప్రతిమను 2017లో ప్రతిష్టించారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూళ్ళు సాధించిన బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపును సంపాదించుకున్న దీంతో ప్రపంచస్ధాయి కళాకారుల సరసన చోటు సంపాదించిన ఈ మైనపు ప్రతిమ మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది.

ప్రభాస్‌ బాక్సాఫీస్‌ సత్తా ‘సాహో’
‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌తో యువి క్రియేషన్స్‌ సుజీత్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో చేసిన ప్యాన్‌ ఇండియా చిత్రం ‘సాహో’ని హైటెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మించారు. ప్యాన్‌ ఇండియా ఆర్టిస్టులు, హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌తో రూపొందిన ఈ చిత్రం టాలీవుడ్‌ ప్రేక్షకులనే కాదు.. బాలీవుడ్‌లో ఆడియెన్స్‌ను కూడా మెస్మరైజ్‌ చేసింది. బాలీవుడ్‌లో డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ అద్భుతమైన కలెక్షన్స్‌ను సాధించి బాక్సాఫీస్‌ వద్ద ప్రభాస్‌ సత్తాను ప్రూవ్‌ చేసింది.

పీరియాడికల్‌ లవ్‌స్టోరి ‘రాధేశ్యామ్‌’
ప్రభాస్‌ 20వ చిత్రంగా ‘జిల్’‌ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్‌’.ఈ ప్యాన్‌ ఇండియా మూవీని రెబల్‌స్టార్‌ డా. యూవీ కృష్ణంరాజు సమర్పణలో గోపికృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని టి. సిరీస్‌ బ్యానర్‌పై భూషణ్‌ కుమార్‌ అందిస్తున్నారు. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరిలో ప్రభాస్‌ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ విఎఫ్‌ఎక్స్‌ టెక్నీషియన్‌ కమల్‌ కన్నన్‌ ఈ చిత్రానికి విఎఫ్‌ఎక్స్‌ విభాగంలో పని చేస్తుండడం విశేషం. జార్జియాలో ఇప్పటికే కీలక సన్నివేశాలకి సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ని ముగించారు. కోవిడ్‌ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్‌ను హోల్డ్‌ చేశారు. తర్వాత కోవిడ్‌ 19 క్రైసిస్‌ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇటలీలో చిత్రీకరణను స్టార్ట్‌ చేశారు.  ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ఈ చిత్రం నుండి  రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులకి స్పెష‌ల్ ట్రీట్ ఇస్తూ ప్ర‌భాస్ పోషిస్తున్న విక్ర‌మాధిత్య రోల్ కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్.. రెబ‌ల్ స్టార్ ఇప్పుడు రాధేశ్యామ్ లో కూడా అల్ట్రా స్టైలిష్ గా క‌నిపించ‌బోతున్నారని అర్ధ‌మైపోతుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్‌ చేయడానికి నిర్మాతలు వంశీ, ప్రమోద్‌, ప్రసీదలు సన్నాహాలు చేస్తున్నారు.

వైజయంతీ సెల్యులాయిడ్‌ బొనంజా
ప్రతిష్టాత్మకమైన  వైజయంతీ మూవీస్‌ తన 50 వసంతాల సందర్భంగా ‌ప్రభాస్‌ హీరోగా ప్యాన్‌ వరల్డ్‌ మూవీని రూపొందనుంది. ‘మహానటి’తో జాతీయస్థాయి గుర్తింపును దక్కించుకున్న నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత అశ్వినీదత్‌ సినిమా రేంజ్‌ను పెంచుతూ వస్తున్నారు. ప్రభాస్‌ జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తుందని .. రీసెంట్‌గా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, బిగ్‌బి అమితాబ్‌ కీలక పాత్రను పోషిస్తున్నట్లు ప్రకటించి అంచనాలను మరింత పెంచారు. ప్రెస్టీజియస్‌గా రూపొందనున్న ఈ భారీ బడ్జెట్‌ మూవీ తో ఇదివరకెన్నడూ చూడని ఓ సెల్యులాయిడ్‌ బొనంజా ప్రభాస్‌ నుండి ఆశించవచ్చు.

రాముడి పాత్రలో ‘ఆదిపురుష్‌’
రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ బాలీవుడ్‌ దర్శకుడు ఓంరావుత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’ అనే ఎపిక్‌ విజువల్‌ వండర్‌ చిత్రానికి ఓకే చెప్పారు. 7000 సంవత్సరాల క్రితం పుట్టిన తెలివైన రాక్షసుడ్ని సంహరించడానికి, చెడుపై మంచి విజయం సాధించిన దానికి ప్రతీక అయిన రామాయణం ఆధారంగా ఈ విజువల్‌ వండర్‌ను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్‌ నటించనున్నారు. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కి ధీటుగా ప్రతినాయకుడు పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ ఆలీ ఖాన్‌ నటిస్తున్నారు. గుల్షన్‌ కుమార్‌, టి. సిరీస్‌ ఫిలిమ్స్‌ సమర్పణలో రెట్రోఫైల్స్‌ ప్రొడక్షన్‌, టి సిరీస్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై ఓం రౌత్‌(తానాజీ ఫేమ్‌) దర్సకత్వంలో ఈ సినిమా తెరకెక్క‌నుంది. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాతలు భూషణ్‌ కుమార్‌, కృష్ణ కుమార్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ భారీ బడ్జెట్‌ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్‌, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లే కాకుండా మరో రెండు సర్‌ప్రైజింగ్‌ అండ్‌ షాకింగ్‌ ప్యాన్‌ ఇండియా సినిమాలు ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురుచూస్తున్నాయి.

కోవిడ్‌ సహాయంలో రికార్డు
లాక్‌డౌన్‌ను నేపథ్యంలో ప్రభాస్‌ ముందుకొచ్చి భారీ ఆర్థిక సాయాన్ని అందించి తన పెద్ద మనసుని చాటుకున్నారు. కరోనా బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో 50 లక్షలు.. అలాగే ప్రధాన మంత్రి సహాయ నిధికి కూడా రూ. 3 కోట్ల విరాళం అందించారు. ఇది కాకుండా సినిమా షూటింగ్‌లు లేకుండా ఇబ్బందులు పడుతున్నటాలీవుడ్‌ కార్మికుల సహాయార్ధం ఏర్పాటు చేసిన సీసీసీ కమిటీకి సపోర్ట్‌ అందిస్తూ.. తన వంతుగా రూ.50 లక్షల విరాళం ప్రకటించి.. మొత్తంగా ప్రభాస్‌.. కరోనా సహాయార్ధం రూ.4.5 కోట్లను విరాళం ప్రకటించారు. దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ విరాళం ఇచ్చిన హీరోగా ప్రభాస్‌ రికార్డులకు ఎక్కారు. అలాగే ఎంతో మందికి వ్యక్తిగతంగా సాయం చేసినప్పటికీ పెద్దగా పబ్లిసిటీగా కోరుకోని నైజం ప్రభాస్‌ సొంతం

వర‌ద‌ బాధితుల స‌హాయార్ధం 1 కోటి 50 ల‌క్ష‌లు 
హైదరాబాద్ ను ముంచెత్తిన అకాల వ‌ర్షాలు చాలామందిని నిరాశ్రయుల‌ను చేసింది. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం కేసీఆర్ పిలుపునకు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ వరద బాధితుల కోసం తన వంతు సాయం ప్రకటించారు. తెలంగాణ సీఎం సహాయనిధికి కోటిన్నర రూపాయల విరాళం అందిచారు. అలానే బాధితుల‌కి త‌మ‌కు చేత‌నైన రీతిలో స‌హాయం చేయాల్సిందిగా త‌న అభిమానుల‌కి పిలుపునిచ్చారు ప్ర‌భాస్.

‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్’‌లో స్ఫూర్తినిస్తూ…
భవిష్యత్‌ తరాలకు మంచి వాతావరణం కావాలంటే పచ్చనిచెట్లు ఎంతో అవసరం. ఆ ఆవశ్యకతను తెలుసుకుని గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌. ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన‌ క్రేజీ హీరో ప్రభాస్‌.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకటి రెండు చెట్లు నాటడం కాకుండా.. ఏకంగా ఓ అడవిలో పెద్ద ఎత్తున చెట్లు నాటించే కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. దుండిగల్‌ సమీపంలో ఖాజిపల్లి అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ను హీరో ప్రభాస్‌ దత్తత తీసుకున్నారు. తండ్రి దివంగత ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణరాజు పేరు మీద అర్బన్‌ పార్కు, అటవీ ప్రాంతాన్ని ప్రభాస్‌ అభివృద్ధి చేయనున్నారు ప్రభాస్‌. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్‌ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

గత పుట్టినరోజుకి.. ఈ పుట్టినరోజుకి హీరోగా ప్రభాస్‌ రేంజ్‌ ప్యాన్‌ ఇండియా స్టార్‌గా పెరిగింది. స్టార్‌ మేకర్స్‌ అందరూ ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా చేయడాన్ని ఓ స్టేటస్‌గా భావిస్తున్నారు. ఇలా ప్రతి సినిమాకు క్రేజ్‌ పెంచుకుంటోన్న ప్రభాస్‌ పెద్దనాన్న రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, తండ్రి స్వర్గీయ సూర్యనారాయణ ఆశీస్సులతో అగ్ర పథంలో దూసుకెళ్తున్నారు. ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా వుంటూ అందర్నీ ఆప్యాయంగా పలుకరించే ‘డార్లింగ్‌’ ప్రభాస్‌ పుట్టినరోజు అక్టోబర్‌ 23.
హ్యాపీ బర్త్‌ డే టు రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ !