వాళ్ల ఎఫర్ట్ అంతా ‘కేజీఎఫ్’ విజువల్ క్వాలిటీలో కనిపించింది !

కన్నడ ‘రాకింగ్ స్టార్’ యష్ హీరోగా‘కేజీఎఫ్’… లెజెండరీ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్ బ్యానర్‌పై విజయ్‌ కిరంగదూర్ నిర్మిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తుండగా.. కొత్త అమ్మాయి శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. డిసెంబర్ 21న ఐదు భాషల్లో భారీగా విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారాహి చలనచిత్రం’ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు లెజెండరీ నటులు కైకాల సత్యనారాయణతో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘నాలుగైదు సంవత్సరాల క్రితం నేను సాయికొర్రపాటితో మాట్లాడుతూ.. కర్ణాటకలో సీన్ ఏంటండి? అక్కడ ఎవరు టాప్ అని అడిగితే.. ‘టాప్ స్టార్స్ కాకుండా ఒక కొత్త కుర్రాడు వచ్చాడు. అందరినీ దాటేసి ముందుకెళ్లిపోయాడు. హిట్ మీద హిట్ వరుసగా కొడుతున్నాడు. పేరు యష్’ అని చెప్పారు. ఎవరండీ ఈ యష్.. ఎప్పుడూ పేరు వినలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగితే.. ఒక బస్సు డ్రైవర్ కొడుకని చెప్పారు. అంతేకాకుండా ఇంకో విషయం చెప్పారు.. తన కొడుకు సూపర్‌స్టార్ అయినా కూడా ఆ తండ్రి ఇంకా బస్సు డ్రైవర్‌గానే పని చేస్తున్నారని. నాకు చాలా ఆనందంగా అనిపించింది. కాదు నేనింత సంపాదించాను కదా.. నాకింత పేరు వచ్చింది కదా నువ్వు మానేయొచ్చు కదా అంటే.. ఒరేయ్ నేను బస్ డ్రైవర్ అయ్యే నిన్ను సూపర్‌స్టార్‌ను చేశా.. నీ పని నువ్వు చూసుకో.. నా పని నేను చేసుకుంటా అన్నారట. అప్పుడు నాకు అనిపించింది.. యష్ కంటే వాళ్ల నాన్నే పెద్ద సూపర్‌స్టార్ అని.
 
ఈ సంవత్సరం ఏప్రిల్‌లోనో, మేలోనో నేను ఆర్ఆర్ఆర్ కథ చర్చల కోసం బెంగళూరు వెళ్లాను. తాజ్ హోటల్‌లో ఉన్నప్పుడు యష్ కూడా అదే హోటల్‌లో ఉన్నాడు. వాళ్ల టీమ్ అంతా వచ్చి నన్ను కలిశారు. రెండు నిమిషాలు టైమ్ ఇస్తారా అని చెప్పి.. కేజీఎఫ్ వీడియో చూపించారు. ఫస్ట్ టైమ్ అప్పుడు నేను విజువల్స్ చూశా. నిజంగా అద్భుతంగా అనిపించింది. వాళ్ల ఎఫెర్ట్ అంతా విజువల్ క్వాలిటీలో కనిపించింది. చాలా ఫెంటాస్టిక్‌గా అనిపించింది. ఇది నిజంగా పాన్ ఇండియన్ సినిమా అవుతుందనిపించింది. బడ్జెట్ పెట్టిన ప్రతి సినిమా పాన్ ఇండియన్ సినిమా అయిపోదు. ఒక రీజియన్‌కు కట్టుబడకుండా.. అందరినీ అలరించే కథాంశం ఉంటే తప్పకుండా అది పాన్ ఇండియన్ సినిమా అవుతుంది. కేజీఎఫ్ విజువల్స్ చూసినప్పుడు ఇది తప్పకుండా పాన్ ఇండియన్ సినిమా అవుతుందనిపించింది. వెంటనే బాంబేలోని అనిల్ తఢానీకి ఫోన్ చేసి.. కన్నడలో యష్ అనే హీరో చేసిన సినిమా విజువల్స్ చూశాను. చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి చూడండి అని చెప్పాను. తర్వాత శోభుగారికి(శోభు యార్లగడ్డ) చెప్పాను. సాయిగారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. కేజీఎఫ్ కన్నడ సినిమాలాగా కాకుండా పాన్ ఇండియన్ సినిమాలా రిలీజ్ అవుతోంది. చాలా సంతోషంగా ఉంది. అంత మంచి విజువల్స్ రావాలంటే డబ్బులు పెడితేనో, హీరో డేట్స్ ఇస్తేనో రావు. కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఉండాలి. అలాంటి టీమ్ వీళ్లకు దొరికింది కాబట్టే ఇలాంటి సినిమా తీయగలిగారు. ఇండియాలో ఏ భాషలోనూ లేని గొప్పతనం మన తెలుగువాళ్లకు ఉంది. ఒక సినిమా నచ్చితే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. కేజీఎఫ్ చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా.’’ అన్నారు.
 
కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘ఈ బ్యానర్ వాళ్లది నేను తొలి సినిమా చూశాను. చాలా బాగుంది. రెండో సినిమా కూడా బాగుంది. ఇది మూడో సినిమా. ఇది కూడా చాలా బాగుంటుందని అనిపిస్తోంది. నా మీద గౌరవంతో సమర్పణలో నా పేరు వేశారు. ఈ చిత్రం ప్రొడక్షన్‌లో మా అబ్బాయి పాలుపంచుకున్నాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించి.. పార్ట్-2 కూడా తర్వలోనే మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను. ఒక సీనియర్ నటుడిగా నన్ను పిలిచి ఈ చిరు సత్కారం చేయడం చాలా సంతోషంగా ఉంది. మా కాలంలో ఇలాంటి ప్రీరిలీజ్ ఈవెంట్‌లు లేవు.’’ అని అన్నారు.
 
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘‘మేమంతా ఈ రోజు ఇక్కడున్నామంటే దానికి కారణం రాజమౌళి సర్. ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి మా అందరికీ బాట వేశారు. విజన్ ముందు బడ్జెట్ అనేది చాలా చిన్న విషయం అని నిరూపించారు. మీ అడుగుల్లోనే మేము ధైర్యంగా ఈ చిత్రన్ని పాన్ ఇండియాన్ సినిమాగా తీసుకొస్తున్నాం. హ్యాట్సాఫ్ సర్. కైకాల సత్యనారాయణగారి పేరును మా సినిమా సమర్పణలో వేయడం మాకు చాలా గర్వకారణం. నా టీమ్‌లోని ప్రతి టెక్నీషియన్ ఎంతో కష్టపడి పని చేయడం వల్లే ఇలాంటి సినిమా సాధ్యమైంది. చాలా ఎఫర్ట్ పెట్టి ఈ చిత్రాన్ని రూపొందించాం. తెలుగు ప్రేక్షకులు మా ‘కేజీఎఫ్’ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా.’’ అన్నారు.
 
నిర్మాత విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ.. ‘‘తెలుగులో ఇంత భారీగా సినిమా విడుదల కావడానికి కారణం సాయిగారే. మా సినిమాను ఇంత పెద్ద చిత్రం చేయడానికి సాయం చేసిన సాయిగారికి ధన్యవాదాలు. ఇక మనఅందరికీ పరిచయం ఉన్న రాజమౌళి సార్.. మంచి చిత్రాలను ప్రోత్సహిస్తారనేది అందరికీ తెలుసు. మా సినిమా పెద్ద విజయం సాధించాలని మాకు ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చిన రాజమౌళిగారికి కృతజ్ఞతలు.’’ అన్నారు.
 
హీరోయిన్ శ్రీనిధి మాట్లాడుతూ.. ‘‘కొత్త అమ్మాయి అయిన నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ప్రతి సీన్‌లోనూ నన్ను ఎంతో కంఫర్టబుల్‌గా ఉంచిన డీవోపీ భువన్‌కు థ్యాంక్స్. రాజమౌళి సర్.. మిమ్మల్ని ఇలా దగ్గరగా చూసే అవకాశం రావడం ఒక అభిమానిగా చాలా సంతోషపడుతున్నా.’’ అన్నారు.
 
‘రాకింగ్‌స్టార్’ యష్ మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడూ ఒక మాటను నమ్ముతాను. మనం ఎక్కడికి వెళ్లితే అక్కడి కల్చర్‌ను పాటించాలి. అందుకే నాకు తెలిసిన తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. తప్పులుంటే మన్నించండి. మా టెక్నీషిన్స్ ఒక్కొక్కరు ఒక్కో డైమండ్‌లాంటి వాళ్లు. చాలా షైన్ అయి కష్టపడి పని చేశారు. వాళ్లు లేకపోతే ఈ సినిమా లేదు. ఇప్పుడు మీ అందరికీ ఒక కథ చెప్పాలి.. మొక్కజొన్న పంట పండించే ఒక రైతుకు ఉత్తమ రైతు అవార్డు వచ్చింది. అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వాళ్లు వెళ్లారు. మీకే ఎప్పుడు ఇలా అవార్డు రావడానికి కారణం ఏంటని అడిగారు? అప్పుడు ఆయన తన పొలానికి తీసుకెళ్లారు. పక్క పొలాల వాళ్లకు కూడా తాను పండించే విత్తనాలనే ఆ రైతు అందరికీ ఇచ్చాడు. మీరు వేసే విత్తనాల గురించి పక్కవాళ్లకు చెప్పేస్తే ఎలా అని మీడియా వాళ్లు ప్రశ్నిస్తే.. పక్క పొలం బాగుంటేనే నా పొలం కూడా బాగుంటుంది. చుట్టుపక్కల పొలాలు చీడపురుగులతో ఉంటే అవి నా పొలానికి కూడా సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే నా చుట్టు పక్కల వాళ్లకు కూడా నేను వాడే మంచి విత్తనాలనే ఇస్తానని చెప్పాడు.. ఈ కథ ఎందుకు చెప్పానంటే రాజమౌళి గారు కూడా ఇప్పుడు అలా చేస్తున్నారు. మనమంతా అలాగే ఉండాలి. మా దగ్గర మంచి సినిమా ఉంటే మీరు సపోర్ట్ చేయాలి.. మీ దగ్గర మంచి సినిమా ఉంటే మేం సపోర్ట్ చేయాలి. బాహుబలిని కర్ణాటకలో చాలా పెద్ద హిట్ చేశారు. 12 ఏళ్ల క్రితం నా సీరియల్‌ను శోభు యార్లగడ్డ గారు ప్రొడ్యూస్ చేశారు. నా గురించి ఆయనకు తెలుసు. హిందీలో అనిల్ తఢానీ మా సినిమాను విడుదల చేయడానికి కారణం రాజమౌళి సర్, శోభు సర్. సినీ ఇండస్ట్రీలో భాషా బేధాలు ఉండకూడదు. ఏ భాష చిత్రమైనా అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం. ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళదాం. మేము సైనికుల్లాంటివాళ్లం.. సైనికుల్లా యుద్ధానికి వెళ్లాలి. అక్కడ గెలిచినా గౌరవం ఉంటుంది.. వీర మరణం పొందినా గౌరవం పెరుగుతుంది. కేజీఎఫ్ మీ అందరికీ నచ్చుతుంది. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.’’ అన్నారు.
https://we.tl/t-gMp0KMS50w
https://we.tl/t-PwOWPlruWk