ఆర్‌.పి సంగీత సారథ్యంలో విడుద‌లైన వీడియో సాంగ్‌

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్‌…తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య అక్క‌ర్లేని పేరు. చిత్రం, జ‌యం, నువ్వు-నేను, `సంతోషం`, `మ‌న‌సంతా`,  `నువ్వు లేక నేను లేను` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు సంగీతం అందించిన ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్‌. ద‌ర్శ‌క నిర్మాత‌గా మారిన త‌ర్వాత త‌న సంగీతంతో మ్యూజిక్ ప్రేమికుల‌ను అల‌రించడం త‌గ్గిపోయింది. అయితే సంగీత ప్రేమికుల కోసం ఆర్‌.పి ఇప్పుడు `నీతో ఏదో చెప్పాల‌ని ఉంది` అనే మెలోడీ వీడ‌గియో సాంగ్‌ను గురువారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుద‌ల‌వుతుంది.
ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోటి పాట‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌కు సంగీతం అందించ‌డ‌మే కాకుండా ట్యూన్‌కు త‌గ్గ సాహిత్యం కూడా ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ అందించ‌డం విశేషం. ఈ సాంగ్‌ను ఆస్ట్రేలియాలో చిత్రీక‌రించారు. `బాహుబ‌లి` సినిమాలో `మ‌మ‌త‌ల త‌ల్లి..` పాటను పాడిన స‌త్య యామిని పాడగా, సత్య యామిని, అనుదీప్‌ కలిసి నటించారు. జ‌న‌వ‌రి 5న ఈ పాట‌ను ఆన్‌లైన్‌లో అంద‌రికీ అందుబాటులో ఉంటుంది.  ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో ….

మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి మాట్లాడుతూ – “కొత్త ఏడాది 2018లో ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. అంతే కాకుండా త‌ను ఇక సినిమాల‌కు మ్యూజిక్ చేస్తాన‌న‌డం..ఓ మ్యూజిక్ కంపోజ‌ర్‌గా ఆనందాన్నిచ్చింది. నేను త‌న సంగీతానికి పెద్ద అభిమానిని. ప్ర‌స్తుతం ఉన్న సింగ‌ర్స్ ఎవ‌రో మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట‌ల‌ను ఆల‌పిస్తున్నారు. కానీ ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటే..స్వంతంగా ట్యూన్‌ను కంపోజ్ చేసుకుని పాడ‌ట‌మే క‌దా..కానీ చాలా మంది అలా చేయ‌డం లేదు. ఇక‌పై అలా చేస్తే బావుంటుంద‌ని నా అభిప్రాయం“ అని తెలిపారు.
ఆర్‌.పి ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ – “ఈ పాట‌ను విడుద‌ల చేయ‌డానికి ఆదిత్య మ్యూజిక్ వారు ముందుకు రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. 2004లో ఇక‌పై నేను వేరే సినిమాల‌కు సంగీతం అందించ‌ను అని ప్ర‌క‌టించ‌గానే..మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటిగారు న‌న్ను బాగా మంద‌లించారు. కానీ అప్ప‌టి ప‌రిస్థితులు వేరుగా ఉన్నాయి. కోటిగారు నాపై అభిమానంతో నాకు పెద్ద క్లాస్ కూడా పీకారు. నా మ్యూజిక్‌ను నా అభిమానులే కాదు..నేను కూడా మిస్ అయ్యాను. కానీ ఈ ఏడాది నుండి మ్యూజిక్ చేయ‌డానికి నేను సిద్ధంగా ఉంటాన‌ని తెలియ‌జేస్తున్నాను. నేను డైరెక్ట‌ర్‌గా చేశాను కాబ‌ట్టి వేరే ద‌ర్శ‌కుడి ప‌నిలో వేలు పెడ‌తాన‌నే కొంద‌రి భావ‌న‌. కానీ నేను చెప్పేదేంటంటే..ఓ సినిమాకు ద‌ర్శ‌కుడే పెద్ద‌. త‌న క్రియేటివ్ వ‌ర్క్‌లో నేను జోక్యం చేసుకోకుండా ఓ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా నా ప‌నిని మాత్ర‌మే చేయ‌డానికి ప్రాధాన్య‌త‌నిస్తాను. ఒకప్పుడు సాంగ్స్ రికార్డింగ్ అంటే చెన్నై లేదా ముంబైకి వెళ్లాల‌నేవారు. కానీ నేడు ప‌రిస్థితి అలా లేదు. ఇక్క‌డే ఎంతో క్వాలిఫైడ్ సింగ‌ర్స్ ఉన్నారు. కాకుంటే వీరంద‌రూ స్వంతంగా ట్యూన్స్ కంపోజ్ చేసి పాడాల‌ని నేను కోరుతున్నాను. అలాంటి ఇండిపెండెంట్ మ్యూజిక్‌ను ముందుకు తీసుకెళ్ల‌డానికి ఆదిత్య మ్యూజిక్ సిద్ధంగా ఉంటుంది. ఎవ‌రైనా సింగ‌ర్స్‌కి కాన్సెప్ట్ ఐడియా కూడా నేనే డిజైన్ చేసి ఇవ్వ‌డానికి కూడా నేను సిద్ధ‌మే“ అన్నారు.
ర‌ఘు కుంచె మాట్లాడుతూ – “విదేశాల్లో ఎక్కువ‌గా ఇండిపెండెంట్ మ్యూజిక్‌కే ఎక్కువ ఆద‌ర‌ణ ఉంటుంది. ఇప్పుడున్న సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకుంటే ఇండియాలో కూడా ఈ మ్యూజిక్‌కు ఎక్కువ పాపుల‌ర్ అవుతుంది“ అన్నారు.
విజ‌య‌ల‌క్ష్మి మాట్లాడుతూ – “ఇండిపెండెంట్ మ్యూజిక్‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్‌గారి, ఆదిత్య మ్యూజిక్ వారి ప్ర‌య‌త్నం అభినందనీయం“ అన్నారు.
వేణు మాట్లాడుతూ – “ఈ సాంగ్ ఆర్‌.పి గారికి పెద్ద క‌మ్ బ్యాక్ అవుతుంది“ అన్నారు.
స‌త్య యామిని మాట్లాడుతూ – “నేను సింగ‌ర్‌గా అంద‌రికీ ప‌రిచ‌య‌మే. అయితే ఆర్‌.పిగారు ఇందులో న‌న్ను న‌టింప‌చేశారు. ఆర్‌.పిగారి మ్యూజిక్‌ను వినాల‌ని ఎంతో మంది చూస్తున్నారు. అంద‌రి కోసం ఆర్.పి.ప‌ట్నాయ‌క్‌గారు మ్యూజిక్  చేయ‌డానికి అంగీక‌రించ‌డం ఆనందంగా ఉంది“ అన్నారు.

అనుదీప్ మాట్లాడుతూ – “పాటను చాలా బాగా పిక్చ‌రైజ్ చేశారు. యామిని చ‌క్క‌గా పాడ‌ట‌మే కాదు..చ‌క్క‌గా న‌టించింది కూడా. ఇండిపెండెంట్ మ్యూజిక్‌ను డెవ‌ల‌ప్ చేయ‌డంలో భాగంగా ఆర్‌.పి.పట్నాయ‌క్‌గారు చేస్తున్న కృషి అభినంద‌నీయం“ అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ మాధ‌వ్ మాట్లాడుతూ – “ఆర్‌.పిగారు సంగీతం అందించిన ఈ పాట‌ను నేను విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. ఇలాంటి ఇండిపెండెంట్‌మ్యూజిక్ కాన్సెప్ట్‌తో ఎవ‌రూ ముందుకు వ‌చ్చినా వారిని ఎంక‌రేజ్ చేయ‌డానికి ఆదిత్య‌మూజిక్ ముందుంటుందని తెలియ‌జేస్తున్నాం“ అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో ర‌ఘు కుంచె, విజ‌య‌ల‌క్ష్మి, వేణు, ర‌వివ‌ర్మ‌, జెమిని సురేష్‌, యామినీ, అనుదీప్‌, మ‌నీషా, ఆదిత్య మ్యూజిక్ మాధ‌వ్‌, స‌త్య‌దేవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
Watch Full Video Song Link =>>> https://youtu.be/l7ECrhn3_-Y