ఆ కృతజ్ఞతతోనే పేదలకు సాయం చేస్తున్నా !

స్టార్ హీరోయిన్‌గా  గుర్తింపు తెచ్చుకున్న అందాల తార సమంత. నాగచైతన్యను వివాహమాడిన తర్వాత విడుదలైన ‘రంగస్థలం’ చిత్రంతో ఈ భామకు మరింత క్రేజ్ వచ్చింది. మహానటి చిత్రంలో నటించిన ఈ భామ తమిళ్ సినిమాలు కూడా చేస్తోంది. ఈ తార ఎంత బిజీగా ఉన్నా ఇంకో పక్క సమాజ సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ, తన సేవాతత్పరతను చాటుకుంటోంది.

దీనిపై సమంత మాట్లాడుతూ “నేను నటిగా మంచి పేరు సంపాదించుకున్నాను. సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఈ రెండింటినీ ఏక కాలంలో ఎలా చేయగలుగుతున్నారు? శ్రమ అనిపించడం లేదా? అని పలువురు అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ….పని లేకుంటేనే నాకు ఏమీ తోయదు”అని చెప్పింది. “లోకంలో నాకంటే అందగత్తెలు చాలా మంది ఉన్నారు. నాకంటే ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు. వాళ్లందరిని కాదని భగవంతుడు నాకు టాప్ హీరోయిన్ స్టేటస్‌ను ఇచ్చాడు. కాబట్టి నటనను నేను ప్రాణంగా భావిస్తున్నాను. సినిమాపై నాకున్న ప్రేమకు ఎల్లలే లేవు. సినిమానే నా జీవితంగా మారిపోయింది. ప్రతిభ, పేరు, డబ్బు, హోదా అన్నింటినీ భగవంతుడు నా స్థాయికి మించి ఇచ్చాడు. ఆ కృతజ్ఞతతోనే పేదలకు సాయం చేస్తున్నాను. నాకు సినీ అవకాశాలు తగ్గితే, చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే నా జీవితాన్ని పూర్తిగా సమాజసేవకు అంకితమిస్తా”అని అన్నారు.

30 రోజుల టార్గెట్‌ సెట్‌ చేసుకున్నా !

సినిమాల్లో పాత్రల కోసం రకరకాల ఆకృతుల్లో కనిపించాలని నటీనటులు నిరంతరం టార్గెట్లు పెట్టుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఒక్కో పాత్రకు ఒక్కోలా ఉండాలి. నిన్నటి వరకూ ఎన్టీఆర్‌ మూడు నెలలు టార్గెట్‌ పెట్టుకుని కరసత్తులు చేశాడు. అది త్రివిక్రమ్‌ సినిమా కోసం. ఇప్పుడు సమంత కూడా టార్గెట్‌ పెట్టుకుందట. అదీ 30 రోజులే. ఏ సినిమా కోసం…ఎటువంటి లుక్‌ కోసం? …. ఏ సినిమా కోసమూ కాదు. తన భర్త నాగచైతన్య రోజూ జిమ్‌లో పుల్‌అప్‌ చేస్తుండడం చూసి తానూ చేయాలని అనుకుంది. కానీ సాధ్యం కాలేదట. అందుకే పుల్‌అప్‌ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 30 రోజుల్లో ఆ లక్ష్యాన్ని అధిగమించాలని భావిస్తుంది. ఈ విషయాలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. పుల్‌ఆప్‌ చేస్తున్న ఫొటోలను పోస్టు చేసింది కూడా. తొలిసారి నేను పుల్‌అప్‌కు ప్రయత్నించా. ఘోర పరాజయం పొందా. 30 రోజుల టార్గెట్‌ సెట్‌ చేసుకున్నా. నేను చేయగలనని మీరు అనుకుంటున్నారా? అని అభిమానుల్ని ప్రశ్నిస్తూ ఆమె వీడియోపై పేర్కొంది సమంత.