పెళ్లి బహుమతులు వేలం వేస్తుందట !

సమంత  తన పెళ్లికి వచ్చిన బహుమతుల్ని అమ్మేయాలని చూస్తోంది. ఆమెకు అలాంటి అవసరం ఎందుకు వచ్చింది ? అన్న సందేహం రావడం సహజం. ఎవరైనా పెళ్లికి వచ్చిన బహుమతుల్ని అపురూపంగా భావిస్తారు. వాటిలో ప్రత్యేకమైన వాటిని ఎంచుకొని భద్రంగా దాచుకుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ప్రత్యేక సందర్భాల్లో వచ్చిన బహుమతుల్ని ప్రత్యేకంగా చూసుకుంటారు. కానీ సమంత మాత్రం తన పెళ్లికి వచ్చిన బహుమతుల్ని అమ్మేయాలని చూస్తోంది. అయితే, సమంత ఈ పనిచేస్తోంది ఓ మంచి పని కోసం.

హీరోయిన్‌గా తనకంటూ ఒక ఇమేజ్ వచ్చినప్పటి నుంచి సమంత ‘ప్రత్యూష ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి అభాగ్యుల్ని ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్ కోసం ఇప్పటికే ఆమె కొన్ని కోట్లు ఖర్చు చేసింది. ఈ సంస్థకు విరాళాలు అందించడం కోసం ఇప్పటికే రెండుసార్లు వేలంపాట కూడా నిర్వహించింది సమంత. తనతో పాటు కొందరు సెలబ్రిటీలకు సంబంధించిన వస్తువులు, దుస్తుల్ని ఆమె వేలం వేసి ఆ మొత్తాన్ని ఫౌండేషన్‌కు అందజేసింది. ఇదే తరహాలో తన పెళ్లికి వచ్చిన బహుమతుల్లో కొన్నింటిని సమంత వేలం వేయబోతోందట. ఇందుకు ఆమె భర్త నాగచైతన్య, మామయ్య నాగార్జున అనుమతి కూడా తీసుకుందట. వాళ్లు సంతోషంగా ఇందుకు అంగీకరించారట. త్వరలోనే వేలం పాట జరుగనుంది. ఇలా తన పెళ్లి బహుమతుల్ని కూడా సేవా కార్యక్రమాలకు వినియోగించాలన్న సమంత ఆలోచనను అభినందించాల్సిందే.