విలక్షణ వినోదం.. ‘ఓ బేబీ’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 3/5

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చ‌ర్స్‌ బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వం లో సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ ఈ చిత్రాన్ని నిర్మించారు
 
కధాంశం.. బేబీ (ల‌క్ష్మి)కి చిన్న‌ప్ప‌టి నుంచీ పాట‌లు పాడాల‌నేది కోరిక‌. ఆమె తండ్రి అంగీక‌రించ‌డు. దాంతో ఆమె త‌న‌కు ఇష్ట‌మైన వ్య‌క్తి (అడ‌వి శేష్‌)ను పెళ్లాడుతుంది. ఏడాది తిర‌గ‌క ముందే ఆమె కడుపు పండుతుంది. మిలిట‌రీకి వెళ్లిన భ‌ర్త శ‌వ‌మై తిరిగి వ‌స్తాడు. దాంతో త‌న‌కు తెలిసిన ప‌నులు చేసుకుంటూ కొడుకు శేఖ‌ర్ (రావు ర‌మేష్‌)ను చ‌దివించి ప్రొఫెస‌ర్ని చేస్తుంది. త‌ల్లి మాట‌లు విని పెరిగిన అత‌ను కూడా జీవితంలో స్థిర‌ప‌డ‌తాడు. త‌న కొడుకు ప‌నిచేసే కాలేజీ క్యాంప‌స్‌లోనే బేబీ క్యాంటీన్ న‌డుపుతుంటుంది. చిన్న‌నాటి స్నేహితుడు చంటి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) ఆమెకు తోడుంటాడు. చంటి మ‌ర‌ద‌లు సులోచన (ఊర్వ‌శి)కి, బేబీకి క్ష‌ణం ప‌డ‌దు. చంటి కుమార్తె అన‌సూయ‌కు కూడా బేబీ మీద కాస్త ద్వేష‌మే. క‌డుపులో గ్యాస్‌, కాళ్ల‌నొప్పులు, కీళ్ల నొప్పుల‌తో ఓ వైపు బాధ‌ప‌డుతుంటుంది బేబీ. ఆమె య‌థాలాపంగా అనే మాట‌లు కూడా ఆమె కోడ‌లు (ప్ర‌గ‌తి)ని ఇబ్బందిపెడుతాయి.ఈ నేప‌థ్యంలో కోడ‌లికి అనారోగ్యం చేస్తుంది.
కుటుంబ స‌మ‌స్య‌ల‌తో ఇంటికి దూర‌మ‌వుతుంది బేబీ. స‌రిగ్గా ఆ స‌మ‌యంలోనే ఆమె ఓ ఫొటో స్టూడియోకు వెళ్తుంది. అక్క‌డ ఆమెకు ఓ స్వామీజీ (జ‌గ‌ప‌తిబాబు) వినాయ‌కుడి ప్ర‌తిమ‌ను చేతిలో పెడ‌తాడు. దాని వ‌ల్ల ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? కొత్త జీవితంలోకి వ‌చ్చిన విక్ర‌మ్ (నాగ‌శౌర్య‌) ఆమెను ఎలా చూసుకున్నాడు? ఆమె వల్ల ఆమె మ‌న‌వ‌డు రాఖీకి జ‌రిగిన లాభం ఏంటి? జీవితంలో ఆఖ‌రికి బేబీ చేయాల్సి వ‌చ్చిన త్యాగం ఏంటి? వంటివ‌న్నీ సినిమాలో చూడాలి…
విశ్లేషణ.. కొరియన్‌ చిత్రం ‘మిస్‌ గ్రానీ’ మానవ సంబంధాలని హృద్యంగా, వినోదభరితంగా చూపిస్తుంది. తెలుగులోకి రీమేక్‌ అయిన ‘మిస్‌ గ్రానీ’కి దర్శకురాలు నందిని రెడ్డి చేసిన మార్పు చేర్పులు పెద్దగా లేకపోయినా.. ఈ కథ, ఆ ఎమోషన్స్‌ మనసుని స్పృశిస్తాయి. మ‌న‌వైన ఆలోచ‌న‌లు, భావోద్వేగాల‌తో డైలాగులు, స్క్రీన్‌ప్లేను రాసుకున్నారు.వృద్దాప్యం పోయి య‌వ్వ‌నం రావ‌డం అనేది ఫాంట‌సీ ఎలిమెంట్‌. దీన్ని కూడా క‌న్విన్సింగ్‌గా చెప్ప‌గ‌లిగారు నందిని రెడ్డి. క‌న్‌ఫ్యూజ‌న్ లేకుండా తెర‌కెక్కించారు.డెబ్బయ్‌ ఏళ్ల బామ్మ… ఇరవై నాలుగేళ్ల యువతిగా మారిన ట్విస్ట్ నుండే బోలెడంత వినోదం పుట్టింది. ఇక ఆ పాత్ర తన వాళ్లతో కలిసే సన్నివేశాలు, తను ఎవరో తెలియక తన ముందు వాళ్ళు చేసే పనులకి ఆమె ఎలా స్పందించిందనే సందర్భాలు బాగా పండాయి.అవసరానికి మించిన రన్‌ టైమ్‌, ఆకట్టుకోని మ్యూజిక్‌, కొన్ని ఇబ్బందికరమైన ఎమోషన్స్‌ ..వీటన్నింటినీ సమంత తన నటనతో కవర్‌ చేసింది. చ‌క్క‌టి కుటుంబ విలువ‌లు, స్వ‌చ్ఛ‌మైన స్నేహం, బంధాలు..అనుబంధాలూ..ఇలాంటి అంశాలను మిళితం చేసిన ఈ సినిమా కుటుంబ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది.
 
నటవర్గం.. సమంత పెళ్లి తర్వాత కమర్షియల్‌ చిత్రాలకి దూరం కావడంతో .. కమర్షియల్‌ చిత్రాలకి భిన్నంగా తన ప్రతిభను చూపే కథలని ఆమె ఎంచుకుంటోంది. ఓ బేబీలో ఆమె పర్‌ఫార్మెన్స్‌ సమంత కెరీర్‌లో ఒక మైలురాయిలా నిలిచిపోతుంది. ఎమోష‌న‌ల్ పాత్ర‌ల‌ను పండించ‌గ‌లిగిన స‌మంత ఈ చిత్రంలో జీవితాన్ని మ‌ళ్లీ ఆస్వాదించే స‌న్నివేశాల్లో కామెడీని కూడా బాగా పండించింది. ల‌క్ష్మి లాగా ఆమె న‌డిచే న‌డ‌క‌, మేన‌రిజ‌మ్స్ ఆక‌ట్టుకుంటాయి. లక్ష్మీ, రాజేంద్రప్రసాద్‌, నాగశౌర్య, రావు రమేష్‌ల అభినయం ఈ చిత్రానికి అదనపు బలమయింది.ల‌క్ష్మి ఈ సినిమాలో అద్భుతంగా బేబీ పాత్ర పోషించారు. కొడుకు ప‌ల‌క‌రింపే క‌ర‌వైనా..ప‌రువుగా బ‌త‌కాల‌నుకునే ఊర్వ‌శి పాత్ర కూడా బావుంది.
చంటి పాత్ర రాజేంద్ర‌ప్ర‌సాద్ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర‌. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, సమంత కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ల‌క్ష్మికి త‌గ్గ‌ట్టు ఆమె స‌న్నివేశాల్లోనూ, స‌మంత‌కు త‌గ్గ‌ట్టు సెకండాఫ్ స‌న్నివేశాల్లోనూ రాజేంద్ర‌ప్ర‌సాద్‌ బాగా న‌టించారు. ఆయ‌న కుమార్తెగా న‌టించిన సున‌య‌న కూడా చ‌క్క‌గా న‌టించింది. స‌మంత‌ భ‌ర్త‌గా అడివి శేష్ క‌నిపించిన రెండు మూడు స‌న్నివేశాల్లోనూ ఆక‌ట్టుకున్నారు. జ‌గ‌ప‌తిబాబుకు గెట‌ప్స్ బాగున్నాయి. బాలనటుడి నుండి హీరోగా మారిన తేజ సజ్జా ఆకట్టుకున్నాడు.తల్లీ కొడుకుల అనుబంధాన్ని హైలైట్‌ చేసే సన్నివేశాలన్నీ అలరించాయి.అమ్మ లేనపుడు ఆ లోటు ఎంతగా తెలుస్తుందో చెబుతూ.. రావ్ రమేష్ తో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడి కంట నీరుపెట్టిస్తాయి. `పెద్ద‌వాళ్లు వెళ్తూ వెళ్తూ పిల్ల‌ల బాల్యాన్ని కూడా త‌మ‌తో తీసుకెళ్తారు’,’నీ బతుకు నువ్వు బతుకమ్మా..నీ కోసం నువ్వు బతుకమ్మా’ అంటూ వారిద్దరి మధ్య జరిగే సంభాషణ మనసును తాకుతుంది.అతిగా ప్రేమ‌ను కురిపించే అత్తతో ఇబ్బంది పడే కోడ‌లి పాత్ర‌లో ప్ర‌గ‌తి బాగా చేసింది. నాగ‌శౌర్య త‌న పాత్ర‌ను బాగా పోషించాడు.
 
సాంకేతికంగా.. సంగీత ప్రధానంగా సాగిన ఈ చిత్రంలో ఒక్క పాట కూడా ఆకట్టుకోకపోవడం ఈ చిత్రం లో ప్రధానమైన ఇబ్బంది. సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌ ఆకట్టుకునే బాణీలు ఇవ్వడంలో విఫలమయ్యాడు.ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి హృదయాలకు హత్తుకునేలా చిత్రీకరించడంలో కెమెరా మెన్ రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌ ప్రతిభ కనబడుతుంది. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.మూవీ నిడివి తగ్గించే అవకాశం ఉంది.సినిమా నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి– రాజేష్