వైభవంగా ‘సంతోషం’ సౌత్ ఇండియా ఫిలిం అవార్డుల వేడుక !

“సంతోషం” వార పత్రిక సంతోషం పేరుతొ సురేష్ కొండేటి గత ఇరవై ఏళ్లుగా తెలుగు సినిమా రంగానికే కాకుండా… ఇటీవల కొన్నేళ్ళుగా దక్షిణాది బాషలన్నిటికి సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డు పేరుతొ  అవార్డులు అందచేస్తున్నారు. ఈ సారి సంతోషం 20 వ అవార్డు వేడుకలు ‘సంతోషం – సుమన్ టివి’ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అథితులుగా చిరంజీవి, ప్రముఖ తమిళ దర్శకుడు భారతి రాజా, అల్లు అరవింద్, మురళీమోహన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,జి. ఆదిశేష గిరి రావు, గిరిబాబు, రాజేంద్ర ప్రసాద్ ,తమన్నా, పాయల్ రాజ్ పుత్, శ్రీకాంత్, నారాయణమూర్తి, అల్లరి నరేష్, సుశాంత్, ఆకాష్ పూరి, సుమన్ రంగనాధ్, దర్శకులు కిషోర్ తిరుమల, శివ నిర్వాణ , వీరబద్రం, రామజోగయ్య శాస్తి, సోహెల్ లతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ … సంతోషం సురేష్ ఇరవై ఏళ్లుగా ఇంత గ్రాండ్ గా అవార్డు వేడుకలు నిర్వహించడం నిజంగా గొప్ప విషయం. సినిమా కళాకారులకు అవార్డులు అనేవి ఓ గొప్ప ఉత్సాహాన్ని  ఇస్తాయి.ఈ అవార్డు వేడుకలు ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం సినిమా కళాకారులను అవార్డులు అందించి సత్కరించాలి. కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత అటు ఆంధ్రా ప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ అవార్డు వేడుకల విషయం మరచిపోయాయి. ఇకపై అయినా ఈ రెండు ప్రభుత్వాలు అలోచించి అవార్డు వేడుకలు నిర్వహిస్తే మంచిది. సంతోషo – సుమన్ టివి నేతృత్వంలో జరుగుతున్న ఈ అవార్డు వేడుకల్లో అవార్డులు అందుకున్న వారికి నా అభినందనలు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇటీవలే మరణించిన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు కు ట్రిబ్యూట్ గా వందమంది సింగర్స్ తో వంద పాటలతో గ్రాండ్ ట్రిబ్యూట్ జరిగింది. ఇంద్రజ, లక్ష్మి రాయ్, దివి, అక్ష ఖాన్, ప్రగతి , కృష్ణ , సిద్ధార్థ్,  అఖిల్, హమీద , రాతి మిత్రావ్, సందీప్, అమర్‌దీప్ తదితరులు డాన్సులతో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. ఈ వేడుకలో  సుమ, సుడిగాలి సుధీర్, అవినాష్, సోయల్, అరియానా, అఖుల్, సతీష్ లు యాంకరింగ్ తో అదరగొట్టారు.

సీనియర్ తమిళ దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ ..  తెలుగు ప్రేక్షకులు అంటే నాకు చాలా ఇష్టం. వారు సినిమా బాగుంటే చాలు ఆదరిస్తారు. నా సినిమాలు ఎన్నో తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇక చిరంజీవి ఆనాడు అలా ఉన్నాడో ఇప్పటికే అదే డెడికేషన్, అదే స్పిరిట్ తో ఉన్నాడు. నాకు చాలా  ఇష్టమైన వ్యక్తి చిరంజీవి. అలాగే తెలుగు ప్రజలకు సినిమా అంటే మమకారం. అందుకే పాండమిక్ సమయంలో కూడా థియటర్స్ కు దైర్యంగా వచ్చి ‘మీకు మేమున్నాం’ అని నిరూపించారు. ఇక సంతోషం అవార్డు వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా లాక్ డౌన్ తరువాత ఈ రేంజ్ లో అవార్డు వేడుకను నిర్వహించినందుకు ఆయనను అభినందిస్తున్నాను అన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ .. సంతోషం అవార్డులు సురేష్ ఒక్కడే అన్ని తానై ఈ అవార్డు వేడుకలు ఇన్ని సంవత్సరాలుగా అందించడం గొప్ప విషయం. తెలుగు చిత్రపరిశ్రమ ఈ మధ్య దేశ వ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకుంటుంది. మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవుతున్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా రంగానికి గొప్ప ప్రోత్సహం అందించే దిశగా ఎప్పుడు ముందు ఉంటుంది అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ .. సురేష్ ఏదైనా పట్టు పట్టాడంటే కచ్చితంగా దాన్ని సాధించి తీరుతాడు. సంతోషం అవార్డు వేడుకల్లో గత 17 సంవత్సరాలు నుండి అల్లు రామలింగయ్య గారి స్మారక అవార్డు కూడా అందచేయడం ఆనందించే విషయం. ఇక ఈ వేదికపై వందమంది సింగర్స్ తో వంద పాటలతో మనం అందరం కోల్పోయిన ఎస్పీ బాలు కు ట్రిబ్యూట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అన్నారు.