అలనాటి హీరోయిన్ కృష్ణకుమారి కన్నుమూశారు !

అలనాటి హీరోయిన్ కృష్ణకుమారి(83) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఈ రోజు ఉదయం బెంగుళూరులో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు సహా పాతతరం అగ్రహీరోలందరితోనూ నటించారు. ఆమె మరణించారన్న వార్త తెలియగానే సినిమా ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

కృష్ణకుమారి పశ్చిమ బెంగాల్‌లోని నైహతిలో 1933, మార్చి 6న  జన్మించారు. షావుకారు జానకి ఈమెకు పెద్దక్క. కృష్ణకుమారి సుమారు 110 పైగా తెలుగు సినిమాల్లో నటించారు. బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి దీపిక అనే కుమార్తె ఉన్నారు.

‘నవ్వితే నవరత్నాలు’ సినిమాతో చిత్రప్రవేశం చేసిన ఆమె అగ్ర కథానాయికిగా ఎదిగారు. పిచ్చి పుల్లయ్య, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, ఆప్తమిత్రులు, అంతస్తులు, శ్రీకృష్ణావతారం, చిక్కడు దొరకడు, వరకట్నం, బంగారు భూమి, బందిపోటు తదితర సినిమాల్లో నటించారు.

మూడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న కృష్ణకుమారి.. రాష్ట్రస్థాయిలోనూ నంది అవార్డులు దక్కించున్నారు. కాంచనమాల, సావిత్రి, ఎన్టీయార్ అవార్డులు కూడా అందుకున్నారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌ సంస్థ నుంచి జీవన సాఫల్య పురస్కారం కూడా పొందారు.