ప్రముఖ దర్శకుడు దుర్గా నాగేశ్వర రావు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు దుర్గా నాగేశ్వర రావు కన్ను మూసారు. బొట్టు కాటుక ,సుజాత, స్వర్గం,పసుపు-పారాణి వంటి విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన దుర్గా నాగేశ్వరరావు  ఈ  రోజు హైదరాబాద్ లోని రామాంతపూర్ లో కన్ను మూశారు. ఆయన వయసు ఎనభై ఏడేళ్లు .విజయ బాపినీడు నిర్మించిన ” విజయ ” చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. దర్శక రత్న దాసరి నారాయణరావు వద్ద పలు చిత్రాలకు excutive డైరెక్టర్ గా పని చేసిన దుర్గా నాగేశ్వరరావు ప్రముఖ నటుడు సి యస్ ఆర్ కు స్వయానా మేనల్లుడు.

ముగ్గురు దివంగత దర్శకులకు ‘దర్శకుల సంఘం’ సంతాపం !   

ఈ రోజు” తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం”తమ కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభలో ముగ్గురు దివంగత దర్శకులకు నివాళులు అర్పించింది.    ఈ రోజు మరణించిన దుర్గా నాగేశ్వరరావు కు, కొద్ది రోజుల క్రితం మరణించిన ప్రముఖ దర్శకుడు ఈరంకి శర్మ కు ,సీనియర్ కో డైరెక్టర్ రామ సూరి కి దర్శకుల సంఘం శ్రద్ధాంజలి ఘటించింది. ప్రధాన కార్యదర్శి రామ్ ప్రసాద్ , సీనియర్ సభ్యుడు రాజేంద్రప్రసాద్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సంతాప సభలో ఈరంకి శర్మ ద్వారా వెండి తెరకు పరిచయమైన నటులు జీ వీ నారాయణ రావు, హేమ సుందర్ ,రూపా దేవి లతో పాటు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ , ప్రముఖ నిర్మాత కానూరి,దర్శకులు ధవళ సత్యం ,సి వీ రావు, పర్వతనేని సాంబశివరావు, గార సత్యం తదితరులు పాల్గొని దివంగత దర్శకులతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు .