కొన్నిసార్లు నిర్మొహమాటంగా వదిలేశాను !

‘చేసే ప్రతి సినిమాలోనూ నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉండాలని ప్రయత్నిస్తాను. ఈ ప్రయత్నంలో కొన్ని సార్లు నిర్మొహమాటంగా కొన్ని కథలు, అందులోని పాత్రలు నచ్చక వదిలేశాను. ఇకపై కూడా నా పంథా ఇలాగే ఉంటుంది’ అని అంటోంది బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధాకపూర్‌. ప్రస్తుతం ‘సాహో’, ‘చిచ్చోర్‌’, ‘స్ట్రీట్‌ డాన్సర్‌’ వంటి భిన్న తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్రద్ధా తాజాగా ‘బాఘీ 3’ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ప్రభాస్‌, త్రిషా నాయకానాయికలుగా తెలుగునాట అఖండ విజయం సాధించిన చిత్రం ‘వర్షం’. ఈచిత్రాన్ని బాలీవుడ్‌లో ‘బాఘీ’గా రీమేక్‌ చేసి విజయాన్ని అందుకున్నారు. అలాగే దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘బాఘీ 2’ కూడా విశేష ప్రేక్షకాదరణ పొందింది. దీంతో దీన్నొక సీరిస్‌గా చేయాలనే ఉద్దేశంతో దర్శక, నిర్మాతలు ‘బాఘీ 3’కి కూడా రంగం సిద్ధం చేశారు. ఇందులో టైగర్‌ షరాఫ్‌ సరసన శ్రద్ధా నటించబోతోంది. ‘బాఘీ’ తర్వాత వీరిద్దరూ కలిసి మళ్ళీ ఇందులో నటిస్తున్నారు. ఇందులో శ్రద్ధా ఎయిర్‌ హోస్టెస్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
బహుబాషా చిత్రం కావడంవల్లనే భారీగా…
ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన సినిమా ’సాహో‘. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. అయితే ఈ సినిమా కోసం శ్రద్ధాకపూర్ రూ.5 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకున్నారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 30న విడుదల కానుంది. సాహో బహుబాషా చిత్రం కావడం వల్లనే శ్రద్ధాకపూర్ భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాజల్, తమన్నా, త్రిష వంటి సీనియర్ హీరోయిన్లు ప్రతి సినిమాకి సుమారు రూ.2 కోట్ల వరకు పారితోషికంగా అందుకుంటున్నారు. లేడీ సూపర్ స్టార్ నయన తార మాత్రం ప్రతి సినిమాకు రూ.4 కోట్ల వరకు తీసుకుంటున్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’తో రీ ఎంట్రీ ఇస్తోన్న అలనాటి అందాల తార విజయశాంతి 3 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది