తెలుగు యూనికోడ్ ఫాంట్స్ ను ఆవిష్కరించిన సిరివెన్నెల !

వందలాది తెలుగు ఫాంట్స్ ను తయారు చేయడంలో భాషాభిమానులు సినీనటుడు అంబరీషకు అండగా నిలబడాలని ప్రముఖ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కోరారు. ఆంగ్ల అక్షరాల్లో వేలాది ఫాంట్స్ కు ధీటుగా.. తెలుగు ఫాంట్స్ ఎంత ఎక్కువగా వినియోగిస్తే భాష అంత విరివిగా ప్రజల్లోకి వెళ్తుందన్నారు.  క్రౌడ్ ఫండింగ్ తో అంబరీష తయారు చేసిన వేటూరి, సిరివెన్నెల తెలుగు యూనికోడ్ ఫాంట్స్ ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో సిరివెన్నెల ఆవిష్కరించారు.
అందులోని కళాత్మకతను ఆస్వాదించాలి !
సిరివెన్నెల మాట్లాడుతూ… సాంకేతికత పెరిగాక అక్షరాలను ఎంతో అందంగా తయారు చేస్తున్నారు. కానీ ఆ అందం ఎప్పుడో మన తెలుగు అక్షరాల్లో ఉంది. తెలుగు అక్షరాలు ముత్యాల్లాగా ఉంటాయనే ఖ్యాతి ఉంది. ఆ ఖ్యాతిని ఇనుమడింపచేస్తూ తెలుగుదనాన్ని గుర్తుచేస్తూ కొత్త దనాన్ని తీసుకొచ్చేందుకు అంబరీష ఎంతో శ్రమిస్తున్నారు. మానసికంగా, శారీరకంగా ఎంతో కష్టపడుతూ క్రౌడ్ ఫండింగ్ ద్వారా 30కి పైగా తెలుగు ఫాంట్స్ తయారు చేశారు. అందులో వేటూరి, సిరివెన్నెల ఫాంట్స్ తయారు చేశానని చెప్పగానే నాకు ఎంతో ఆనందం కలిగింది. ముఖ్యంగా నా గురుసమానులు, నేను రచయితగా అర్హత సంపాదించడానికి ప్రేరణగా నిలిచిన వేటూరిగారి పేరుతో తెలుగు ఫాంట్స్ ఆవిష్కరించడం ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రెండు ఫాంట్స్ ను వినియోగిస్తూ అందులోని కళాత్మకతను ఆస్వాదించాలి. అలాగే ఆ ఫాంట్స్ తయారు చేసిన వ్యక్తి శక్తిసామర్థ్యాలు, పట్టుదలను అర్థం చేసుకోవాలి. ఆంగ్ల  భాషలో ఉన్న ఫాంట్స్ తో పోటీపడుతూ తెలుగులోనూ వందల రకాల ఫాంట్స్ ను తెలుగువాళ్లు తయారు చేయాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు అంబరీషతోపాటు ఆయన సతీమణి సుధారాణి పాల్గొన్నారు.