విభిన్నమైన పొలిటికల్‌ సినిమా ‘ఎన్‌.జి.కె’

విభిన్న తరహా ‘గజిని’, ‘యముడు’, ‘సింగం’ లాంటి  చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మించిన చిత్రం ‘ఎన్‌.జి.కె (నంద గోపాల కృష్ణ)’. ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో ‘ఏమైంది ఈవేళ’, అధినేత, ‘బెంగాల్‌ టైగర్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ అందిస్తున్నారు. ఈ చిత్రం మే 31 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరో సూర్య ఇంటర్వ్యూ….
 
‘యువ’ తర్వాత పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్నారు కదా! ఎలా అన్పిస్తోంది?
– ‘యువ’ అనేది పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో పాటు అన్నీ ఇంగ్రీడియంట్స్‌ ఉంటాయి. కానీ ఇప్పుడు ‘ఎన్‌జికె’ మనం అందరం ఇప్పటివరకూ చూసిన పొలిటికల్‌ సినిమాలకు విభిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులు పొలిటికల్‌ సినారియోను పూర్తిగా ఎక్స్‌పీరియన్స్‌ చేస్తారు. ఈ సినిమా ద్వారా శ్రీరాఘవ పొలిటికల్‌ సినిమాల్లో ఒక డిఫరెంట్‌ లేయర్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.
 
‘ఎన్‌జికె’ ఎలా ఉండబోతోంది?
– ఎలాంటి పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేని ఒక సాధారణ వ్యక్తి తనకు తెలియకుండానే అతన్ని పొలిటికల్‌ సిస్టమ్‌లోకి కొన్ని శక్తులు లాగితే.. ఆ వ్యక్తి వల్ల సమాజానికి ఎలాంటి మంచి జరిగింది? అనేది కథాంశం. ఇది గ్రాస్‌ రూట్‌ పొలిటికల్‌ ఫిల్మ్‌. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఒక జెన్యూన్‌ పర్సన్‌ ఈ సమాజాన్ని ఎలా మార్చాడు అనే అంశం మీదే సినిమా ఉంటుంది. రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో మేము ఏ రాజకీయపార్టీ కి విమర్శించలేదు.
 
శ్రీరాఘవ, మీ కాంబినేషన్‌ కోసం ఆడియన్స్‌ చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు?
– అవునండీ. ఆడియన్స్‌తో పాటు నేను కూడా 2001 నుండి ఆయన డైరెక్షన్‌లో వర్క్‌ చేయడానికి వెయిట్‌ చేస్తున్నాను. ఒక శ్రీరాఘవ ఫ్యాన్‌గా ఆయన సినిమాలో నటించడానికి నాకు 19 సంవత్సరాలు పట్టింది. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్‌ డ్రీమ్‌ వారియర్స్‌ కూడా విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. వారితో కలిసి వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీ.
 
శ్రీరాఘవగారితో వర్క్‌ చేయడం ఎలా అనిపించింది?
– ఈ సినిమా కథ రాయడానికి శ్రీరాఘవగారికి సంవత్సరంన్నర కాలం పట్టింది. ఆయన ఒక్కరే కూర్చుని ఈ కథను రాసుకున్నారు. స్క్రీన్‌ప్లే కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉండేలా చూసుకున్నారు. ప్రతి సీన్‌ని ఆయన ఎలా విజువలైజ్‌ చేయాలనుకుంటున్నారో మనకి ముందే తెలిసేలా చేస్తారు. ఆయన మంచి నటుడు కాబట్టే ఇప్పటివరకూ మనకి అన్ని యూనిక్‌ ఫిలింస్‌ ఇవ్వగలిగారు.
 
ఈమధ్యకాలంలో ఆయన ఫామ్‌లో లేరు కదా?
– ఒకానొక సందర్భంలో ప్రతి ఒక్కరూ అలాంటి ఫేజ్‌ను ఫేస్‌ చేస్తూనే వస్తారు. ధోని కూడా ఒక సందర్భంలో ఫేస్‌ చేశారు. కొంతమంది పీపుల్‌ వెరీ యూనిక్‌గా ఉంటారు. వారిని ఇంకొకరితో రీప్లేస్‌ చెయ్యలేం. శ్రీ రాఘవ లాంటి టాలెంటెడ్‌ ఫిల్మ్‌ మేకర్‌. ఇంతవరకూ ఏ దర్శకుడు కూడా ఆయనలాంటి సినిమా చేయలేదు. యాక్టింగ్‌ తెలియని వారితో కూడా యాక్టింగ్‌ చేయించగలరు. ఆయన సాంగ్స్‌ సీక్వెన్స్‌ కూడా రెగ్యులర్‌ ఫార్మాట్లో ఉండదు. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఒక డిఫరెంట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఆడియన్స్‌కి ఇవ్వడానికి తానెప్పుడూ కృషి చేస్తూనే ఉంటారు.
 
ఆయన సెట్‌లో ఎలా ఉంటారు?
– శ్రీరాఘవగారి షూటింగ్‌ సెటప్‌ ఆశ్రమంలా ఉంటుంది. సెల్‌ఫోన్‌లు ఉండవు. వేరే ఎవ్వరితో మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరూ ఒక మెడిటేషన్‌ మోడ్‌లో ఉండి చాలా ఫోకస్డ్‌గా ఉంటారు. ప్రతి సీన్‌ కోసం అదే ఎమోషన్‌ను మనం కూడా ఫీల్‌ అవ్వాల్సి ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత బాల సార్‌లాంటి ఒక డైరెక్టర్‌ని ఎక్స్‌పీరియన్స్‌ చేసినట్టు అన్పించింది. ఆయన దృష్టంతా మానిటర్‌పైనే ఉంటుంది. ఒక షాట్‌ అయిపోగానే అది ఎలా వచ్చింది? అని అన్నీ కోణాలు నుండి సరిచూసుకొని ‘ఓకే’ అంటారు. ఆయన ఓకే అనడం చాలా రిలీఫ్‌గా అన్పిస్తుంది.
 
తమిళ్‌ రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా?
– ఇది ఏ రీజన్‌ బేస్డ్‌ ఫిల్మ్‌ కాదు అలాగని ఏ లొకాలిటీ తో సంభందం లేదు . ఇది జనరల్‌ పాలిటిక్స్‌కి సంబంధించిన అంశం మాత్రమే.
 
మీరు ఫస్ట్‌టైమ్‌ బయోపిక్‌లో నటిస్తున్నారు కదా! ఎలా అన్పిస్తోంది?
– శూర‌రై పోట్రు ఎగ్జాక్ట్‌గా బయోపిక్‌లా ఉండదు. కొంత సినిమాటిక్‌ లిబర్టీ తీసుకోవడం జరిగింది. కానీ మేం ఎవ్వరి బయోపిక్‌ అయితే తీస్తున్నామో, వారి పట్ల పూర్తి గౌరవంగా ఉన్నాం. కానీ.. ఆడియన్స్‌కి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడం కోసం అలా చేశాం. సుధ చాలాకాలంగా నా రాఖీ సిస్టర్‌. మేమిద్దరం ‘యువ’ మూవీ దగ్గర నుండి చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. తను చెప్పిన స్క్రిప్ట్‌ నాకు నచ్చింది. అలాగే తను కూడా ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు చాలా పేషెన్స్‌గా వెయిట్‌ చేసి ఈ స్క్రిప్ట్ రాసింది. ఈ సినిమాను మా యూనిట్ అందరూ చాలా ఎంజాయ్‌ చేస్తూ చేస్తున్నాం.
 
మీ సినిమా ఫస్ట్‌టైమ్‌ సౌత్‌ కొరియాలో రిలీజ్‌ అవుతుంది కదా?
– మనలో చాలామంది సౌత్‌ కొరియా సినిమాలను ఇష్టపడతారు. అలాగే ‘ఎన్‌జికె’ సౌత్‌ కొరియాలో రిలీజవుతున్న తొలి తమిళ్‌ సినిమా. అక్కడినుండి నలుగురు వచ్చి సినిమా చూసారు. నాకు కూడా చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. సౌత్‌ కొరియా నుండి ఎలాంటి ఫీడ్‌ బ్యాక్‌ వస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.
 
జగన్‌గారు మీకు చాలా క్లోజ్‌ కదా?
– నేనెప్పుడూ ఆయన్ని జగన్‌ అన్నా అని పిలుస్తాను. అనీల్‌ రెడ్డి నా క్లాస్‌మేట్‌. పది సంవత్సరాల క్రితం వారి కుటుంబానికి హ్యూజ్‌ లాస్‌ జరిగింది. ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత జగనన్న ఇంత పెద్ద విజయాన్ని సాధించడం సామాన్యమైన విషయం కాదు. ప్రజలందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన సెకండ్‌ యంగెస్ట్‌ సీయం. ప్రజలు కోరుకునే మార్పును ఆయన ద్వారా సాధిస్తారని అనుకుంటున్నాను. జగన్‌ ఒక సక్సెస్‌ఫుల్‌ పొలిటీషియన్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను.
 
ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్న రాధామోహన్‌ గురించి చెప్పండి?
– రాధామోహన్‌గారి కన్విక్షన్‌ చాలా గొప్పది. ఆయన ఇంతవరకు సినిమాని చూడకుండా తెలుగులో రిలీజ్‌ చేయడానికి ముందుకొచ్చారు. అందులోనూ హోల్‌ హార్టెడ్‌గా మా సినిమాకు మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు. మా అందరి సపోర్ట్‌ ఆయనకి ఎప్పుడూ ఉంటుంది.
 
రకుల్‌, సాయి పల్లవిలతో కలిసి నటించడం ఎలా ఉంది?
– వాళ్ళిద్దర్నీ శ్రీరాఘవ సార్‌ సెలెక్ట్‌ చేశారు. ఇప్పటివరకు ఒకేసారి ఇద్దరి హీరోయిన్‌లతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఇది రెండో సారి అనుకుంటా..రకుల్‌, సాయి పల్లవి ఇద్దరూ చాలా మంచి పెర్‌ఫార్మ్‌ చేశారు. ఈ సినిమా ఇద్దరికీ మంచి పేరు తెస్తుంది.
 
టైటిల్‌ ఇంగ్లీష్‌ లెటర్స్‌ పెట్టడం ఎవరి ఛాయిస్‌?
– మేం ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే టైటిల్‌ కోసం వెదుకుతున్న సమయంలో తమిళ్‌, తెలుగు భాషల్లో వేర్వేరు టైటిల్స్‌ అనుకున్నాం. కానీ ‘శివాజీ’, ‘రోబో’, ‘2.0’లా రెండు భాషల్లో ఒకే టైటిల్‌ పెడితే బాగుంటుందని మా పి.ఆర్‌ టీమ్‌, అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌ సలహా ఇవ్వడం జరిగింది. అలాగే ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో ఎలాంటి న్యూస్‌ వచ్చినా టైటిల్‌ ఒకటే ఉంటే తొందరగా ఆడియన్స్‌కి రీచ్‌ అవుతుందని ‘ఎన్‌జికె’ని సెలెక్ట్‌ చేయడం జరిగింది.