దాన్ని బ్రేక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నా !

‘హీరో అంటే అదొక జెండర్‌ (లింగ) అని అందరిలో ముద్ర పడింది. దాన్ని బ్రేక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని అంటోంది తాప్సీ. కథానాయికగా ఇప్పుడు తాప్సీ రేంజే వేరు. గ్లామర్‌కి పరిమితం కాకుండా బలమైన పాత్రలు, విభిన్నమైన సినిమాలు చేస్తూ తానేంటో నిరూపించుకుంటుంది. అంతేకాదు మహిళా ప్రధాన చిత్రాల్లోనూ భాగం అవుతూ మెప్పిస్తోంది. సినిమాల్లో హీరో అంటే పురుషుడే చేయాలనే ప్రస్తుతం ఉన్న విధానాన్ని మహిళా ప్రాధాన్యతా చిత్రాలు తగ్గిస్తాయని బాలీవుడ్‌ నటి తాప్సి నమ్మకం వ్యక్తం చేసింది. చిత్రసీమలో పురుషాధిక్యతను క్రమేణా తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తానని చెప్పింది. మహిళా ప్రాధాన్య చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించేలా అటు ఇండిస్టీ, ఇటు ప్రేక్షకలు మద్దతిస్తే ‘హీరో సినిమాలు-హీరోయిన్‌ సినిమాలు’ అనే బేధం మధ్య ఖాళీని పూరించొచ్చనని విశ్వాసం వ్యక్తం చేసింది.
 
సినిమా రంగంలో హీరో అంటే పురుషుడే. అది అనాది కాలం నుంచీ కొనసాగుతోంది. లింగ ఆధారిత సినిమాల రూపకల్పన విధానాన్ని నెమ్మది మార్చాలన్నది తాప్సి లక్ష్యం. ” హీరో అన్న దానికి లింగ సంబంధం ఉండదు. ఈ విషయాన్ని నేను నిరూపించగలను. మనం చాలా సంవత్సరాలుగా లింగ ఆధారంగానే సినిమాలు రూపొందిస్తున్నాం. దాన్ని ప్రేక్షకులు కూడా చూస్తున్నారు. ఈ విధానంలో రాత్రికి రాత్రే మార్పు రాదు. ఆ మార్పు నెమ్మదిగా, స్థిరంగా వస్తుంది. ఇటువంటి మార్పు కోరుకుంటున్న నటీమణులందరూ పట్టువిడకుండా ప్రయత్నించాలి ” అని పేర్కొంది తాప్సి. ఆమె నటించిన గత చిత్రం ‘బాద్లా’ వంద కోట్లు కలెక్ట్‌ చేసింది.
 
ఇటీవల ఆమె చేసిన ‘గేమ్‌ ఓవర్‌’ కూడా అదే స్థాయిలో కాసులు కురిపిస్తుందని ఆశించారు. కానీ నిరాశ పరచడంపై ఆమె మాట్లాడుతూ… ‘ ఈ సినిమా వాణిజ్య పరంగా విజయం సాధిస్తుందని, ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ఇటువంటి ప్రయోగాలు మిగిలిన వారు కూడా చేస్తారని అనుకున్నాం. ప్రస్తుతం మనమంతా పరివర్తన చెందే దశలో ఉన్నాం. అన్ని రకాలు సినిమాలను ఆహ్వానిస్తున్నాం.అన్ని రకాల మంచి చిత్రాలకు ఆదరణ లభిస్తుంది. ‘గేమ్‌ ఓవర్‌’ రెగ్యులర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కాదు. అన్నింటిలాగే పాటలు, హాస్యం అన్నీ ఇందులో ఉండవు” అని చెప్పింది.ప్రస్తుతం ఆమె ‘మిషన్‌ మంగళ్‌’, ‘తడ్తా’, ‘సాండ్‌ కి ఆంఖ్‌’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.