ఫోర్లు, సిక్సర్లు కొట్టబోతోంది తాప్సి !

తాప్సికి హాకీ అంటే ఇష్టం. కానీ ఈమె షూటర్‌గాను, క్రికెటర్‌గాను పాత్రలు చేసే అవకాశం వచ్చింది. స్టేడియంలో ఫోర్లు, సిక్సర్లు కొట్టబోతుంది తాప్సి పన్ను. అంతేకాదు భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఆమె సారథ్యం వహించబోతున్నారు. ఇందేంటి సినిమాలు మానేసి క్రికెట్‌ ఆడమేమిటి? అని అనుకుంటున్నారా? అదేంకాదు ఇప్పుడు బయోపిక్‌ల హవా నడుస్తుంది కదా. బాలీవుడ్‌లో మరో బయోపిక్‌ తెరకెక్కనుంది. అదే ప్రముఖ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌. వియోకామ్‌ 18 బ్యానర్‌లో తాప్సి ముఖ్య పాత్రలో ఈ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మిథాలీ పాత్రను ఎవరితో చేయించాలన్న దానిపై చిత్రబృందం చాలా కాలం నుంచి అన్వేషించింది. అంతిమంగా ఆ పాత్రకు తాప్సిని ఎంపిక చేసింది. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కనుంది ఈ చిత్రం. ఈ పాత్ర కోసం తాప్సి కొన్ని నెలలు పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారన్న దానిపై ఇప్పటి వరకూ నిర్ణయించలేదు. ఆ విషయాన్ని త్వరలో నిర్మాతలు తెలియజేయనున్నారు. ప్రస్తుతం ఈ కథానాయిక దేశంలో మొదటి షూటర్స్‌ చంద్రో తోమర్స్‌ బయోపిక్‌లో భూమి పడ్నేకర్‌తో కలసి నటిస్తుంది.
నటనకే అంకితం చేయను ! 
“నా తుదిశ్వాస వరకు నటించాలని ఉంది’ అనే స్థాయి కోరిక అయితే నాకు లేదు.’ప్రపంచస్థాయి నటి కావాలి’ అని కూడా ఎప్పుడూ కల కనలేదు.ఈ ఒక్క జీవితంలోనే ఎన్నో చేయాలని ఉంది. అందులో నటన కూడా ఒకటి అనుకుంటాను తప్ప… నా యావజ్జీవితాన్ని నటనకే అంకితం చేయాలని అనుకోను. నా జీవితంలో ఏ రోజైనా నటించాలని అనిపించకపోతే…మరో పని చేసే సామర్థ్యం నాకుంది”…అని అంటోంది ఇటీవల ‘బద్లా’, ‘గేమ్ ఓవర్’ తో సక్సెస్ సాధించిన తాప్సి.
 
అప్పుడే భారీ విజయం !
“నన్ను మార్చేంత శక్తి సక్సెస్‌కు లేదు. అందుకే సక్సెస్ వచ్చినప్పుడు మేఘాల్లో తేలిపోను. ఫెయిల్యూర్‌ ఎదురైనప్పుడు పాతాళానికి కుంగిపోను.సక్సెస్‌ను ‘బోనస్‌’ అనుకుంటానే తప్ప తలకు ఎక్కించుకోను. నిత్యం జీవితంలో ఎలా ఉంటానో అలాగే ఉండడానికి ప్రయత్నిస్తున్నా… ఆ మాటకొస్తే నా కెరీర్‌ మొదట్లో చేసిన ఒక తమిళ చిత్రానికి ఆరు నేషనల్‌ అవార్డులు వచ్చాయి! ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? బాలీవుడ్‌లో అడుగు పెట్టడానికి ముందు సక్సెస్, ఫెయిల్యూర్‌లను సమానంగా చూశాను. సామాజిక మాధ్యమాల్లో అంత క్రియాశీలకంగా ఉండను. సినిమా విజయం గురించి, వ్యాపార ఒడిదుడుకుల గురించి పెద్దగా పట్టించుకోను.చేస్తున్న పనిని తప్ప… సక్సెస్,ఫెయిల్యూర్‌లను సీరియస్‌గా తీసుకునే రకం కాదు నేను. ఒకేరకమైన పాత్రలు చేస్తే ప్రేక్షకులకు మొహం మొత్తుతుంది. అందుకే 20 నిమిషాల పాత్ర అయినా సరే… నచ్చితే చేస్తాను.మనం ఎప్పుడైతే మంచి సినిమా చేస్తామో.. అప్పుడే భారీ విజయం చేకూరుతుంది” అని పేర్కొంది తాప్సి.