సినిమాల్లేకనే వ్యాపారంలోకి దిగిందన్నారు !

సినిమాల్లో తాప్సీ పనైపోయింది. అందుకే వ్యాపారంలోకి దిగిందన్నారు. కెరీర్‌ బాగా ఉన్న సమయంలోనే వ్యాపారంలోకి ప్రవేశించాను. వ్యాపారం ప్రారంభించిన తరువాతే మరిన్ని ఎక్కువ సినిమాలు చేశాను. ఇప్పుడు కూడా సినిమాలు వదిలేయాలన్న ఆలోచన నాకు లేదు. వెండితెర మీద కంటిన్యూ అవుతానని అంటోంది తాప్సీ.
‘ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ’… ప్రారంభించాలనే నిర్ణయం వెనుక ఏ ప్లాన్ లేదు. సినిమాల్లో అవకాశం వచ్చినట్టుగానే, వెడ్డింగ్ ప్లానర్‌గా మారాలన్న ఆలోచనా వచ్చింది. వ్యాపారం చేయాలనుకోవడం స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమే. ఈ వెంచర్‌లో నా పార్టనర్స్‌ ఇద్దరూ నా ప్రాణానికి ప్రాణం లాంటివారు. అందుకే అంత ధైర్యంగా అడుగు వేయగలిగాను. వెడ్డింగ్ ప్లానింగ్ రంగంపై నాకు బోలెడంత విశ్వాసముంది. ఎలాంటి మాంద్యం ఉన్నా పెళ్ళిళ్ళు మాత్రం ఆగవు. ఈ రంగంలో కాస్త తెలివిగా, వ్యూహాత్మకంగా ఆలోచిస్తే తేలికగా సక్సెస్‌ కావచ్చు. ఇదే నా సక్సెస్‌ మంత్ర. క్లైంట్ బడ్జెట్‌కి సరిపోయేలా వెడ్డింగ్ ప్లాన్ చేయాలి. మా డిమాండ్లతో క్లైంట్ల బడ్జెట్‌ను అమాంతంగా పెంచడం మాకు ఇష్టం లేదు. అప్పుడే ఆ క్లైంట్ల ద్వారా మరికొందరు క్లైంట్లు మాకు వస్తారు. నేను సినిమాల్లో బిజీగా ఉన్నా మిగతా ఇద్దరూ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు.
బాడ్మింటన్‌ టీం… స్పోర్ట్స్‌ అంటే చిన్నతనం నుంచీ ఇష్టం. అందులో రాణించాలనుకున్నాను. కానీ కుదరలేదు. అందుకే ఓ టీంను కొని నా కోరిక తీర్చుకోవాలనుకున్నాను. బాడ్మింటన్‌ అనేది అందరికీ తెలిసిన ఆట. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఆడి ఉంటారు. ఈ టీంను కొంటే బాగుంటుందన్న ఉద్దేశంతో కొన్నాను. ఈ టీంను ఇష్టంగా కొన్నాను తప్ప ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న ఆలోచన నాలో లేదు.