ఈ వ్యవహారాన్ని సున్నితంగా పరిష్కరించాలి !

 సినీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాల కేసు పరిశోధన కొంచెం హుందాగా కొనసాగించాలని తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ప్రతినిధులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. సినిమాను పరిశ్రమగా పరిగణిస్తే ఆదాయం పరిమితమే కాని ప్రభావం చాలా పెద్దదని, పని చేసేది కొన్ని వేల మంది అయినా కోట్ల మందిపై ప్రభావం చూపుతున్నందున ఈ వ్యవహారాన్ని సున్నితంగా పరిష్కరించాలని కోరారు.
తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పి.కిరణ్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కె.మురళీమోహన్‌, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీరాజా, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ బుధవారం ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. సదా ప్రజా శ్రేయస్సు కోసం శ్రమించే మనసున్న ముఖ్యమంత్రి గారికి వినమ్రతతో అంటూ రాసిన ఈ లేఖను తెలుగు సినీ రంగ ప్రముఖులు విడుదల చేశారు.
తెలుగు సినిమా రూ.2,000 కోట్లు మార్కు దాటిన సంతోషం, ఒక దర్శకుడికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వచ్చిన ఆనందంలో పరిశ్రమ వెలిగిపోతున్న సమయంలో మాదకద్రవ్యాల కేసు గ్రహణం వలె కమ్మిందని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. విలన్లు నెగ్గిన సినిమాలు తీయడం పరిశ్రమకు అలవాటు లేదని, చెడు మీద మంచి గెలవడమనే కథనే 60 ఏళ్లుగా చెబుతూ బయటి సమాజంలో కుటుంబ విలువలు ఎలా ఉన్నా కనీసం సినిమాల్లో అయినా అవి బలంగా ఉండాలని నమ్మే పరిశ్రమలో పని చేస్తున్నట్టు వివరించారు. సమాజం పట్ల ఎంత గౌరవం లేకపోతే తగ్గిపోతున్న మానవీయ విలువల్ని ఇంకా పట్టుకుని ముందుకు తీసుకెళుతున్నాం.. ఎందుకంటే అవి కాలాతీతమని పేర్కొన్నారు.
‘మాదక ద్రవ్యాలు వినియోగించే వాళ్లు ఎప్పటికీ హీరోలు కారు. కొద్ది మంది చేసిన పొరపాట్లకు పరిశ్రమ తలవంచుకోవలసిన పరిస్థితి రావడం బాధాకరమ’ని అన్నారు. క్రమశిక్షణ లేని వారిని పరిశ్రమ భరించినట్టు ఒక్క మచ్చుతునక లేదని, శారీరకంగా, మానసికంగా దృఢత్వం గల వ్యక్తులే ఇక్కడ నిలదొక్కుకుని మనగలరని తెలిపారు. ఇలాంటి అలవాట్లున్న వాళ్లు వాళ్లంతట వాళ్లే తెరమరుగవుతారని, అయినప్పటికీ తమ వంతుగా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వానికి, పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏ వర్గం, కులం, మతం మీద, ప్రభుత్వం మీద ఒక్క చెడు మాట లేకుండా సినిమా తీసే ప్రయత్నం చేస్తాం, కానీ ప్రతివాళ్లు సినిమా వాళ్ల మీద ఇంత తీవ్రంగా స్పందించడం బాధ కలిగించిందని తెలిపారు.
ఎవరికో కష్టమొస్తే జోలె పట్టుకుని విరాళాలు సేకరించిన కథానాయకులు ఉన్న పరిశ్రమ ఇదని, మాకు కష్టం వచ్చినపుడు సమాజం నుంచి, మీడియా నుంచి కొంచెం సానుభూతి కోరుకుంటున్నట్టు చెప్పారు. ‘ఈ సంఘటన మా అందరికీ ఒక కుదుపు. అలసత్వంతో ఉండకూడదనే ఒక హెచ్చరికగా భావిస్తున్నామ’ని అంటూ దీన్ని వెలుగులోకి తెచ్చిన ప్రభుత్వ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కాని మొత్తం సినీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ పరిశోధనను కొంత హుందాగా ముందుకు తీసుకువెళ్లమని మాత్రమే కోరుతున్నట్టు వారు విజ్ఞప్తి చేశారు. మొత్తం మాదక ద్రవ్యాల కేసును ఎంతో ధైర్యంగా వెలుగులోకి తేవడాన్ని సినీ పరిశ్రమ తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ఈ బృహత్కార్యంలో తమవంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ‘సినీ పరిశ్రమకు ఈ పది రోజులు చీకటి రోజులు. అయినా గ్రహణం గంటసేపే ఉంటుంది. ప్రయాణం నిరంతరం సాగుతూనే ఉంటుంద’ని ఆ లేఖలో పేర్కొన్నారు.