మమ్ముట్టి ప్రోత్సాహంతో అతని సరసన ట్రాన్స్‌జండర్ !

టాలీవుడ్ నుంచో, బాలీవుడ్ నుంచో అరువుతెచ్చుకునే ఈ రోజులలో సమాజంలో ఆదరణలేని వర్గం వ్యక్తిని హీరోయిన్‌గా  పెద్దస్టార్ పక్కన నటింపజేయడంతో అందరి చూపు ఇప్పుడు కేరళవైపు మళ్ళింది. తమిళ మళయాళ భాషలలో ఒకేసారి రిలీజ్‌చేసే ఈ సినిమా తమిళ వెర్షన్‌కు “పెర్నబు” అని నామకరణం చేశారు. మళయాళ వెర్షన్‌కు ఇంకా పేరు నిర్ణయించలేదు. ఏ భాషలోనూ ఏ నిర్మాతలు, దర్శకులు చేయని సాహసాన్ని మాలివుడ్‌లో చేస్తున్నారు. వారి సాహసానికి మమ్ముట్టి ఆశీస్సులు తోడవడంతో సినిమా రంగంలో సంచలనం రేగుతోంది….

ఇరవై ఒకటో ఏళ్ల అంజలీ అమీర్ రెండేళ్ల క్రితం సర్జరీ చేసుకుని కోయంబత్తూరులో మోడల్ గా రాణించింది.అయినా సరైన అవకాశాల్లేక ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించింది.  ముఖ్యంగా జెండర్ సమస్య ఆమెను విపరీతమైన క్షోభకు గురిచేసింది. ఎట్టకేలకు ఒక అవకాశం వచ్చింది. మోడల్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఆమె ఆనందానికి  అవధుల్లేవు.  రామసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొద్ది రోజుల్లో విడుదల కాబోతోంది. ఆమెను హీరోయిన్ గా తీసుకుందామని దర్శకుడు చేసిన ప్రపోజల్ ను  మమ్ముట్టి తిరస్కరించలేదు సరికదా.. మంచి నిర్ణయం తీసుకున్నావని అభినందించాడు. అది ఆయన గొప్ప వ్యక్తిత్వం అని సంతోషంగా చెప్తోంది అంజలి అమీర్.  అగ్రదర్శకులు, అగ్రహీరో సరసన నటించాలంటే చాలా భయమేసింది. కానీ మాముట్టి ధైర్యం చెప్పి నాతో నటింపజేస్తున్నారు అని అంజలి చెప్పింది…

చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న అంజలి తండ్రిని రెండేళ్ళ క్రితం పోగొట్టుకుంది. తనకు చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లలా ఉండాలనే కోరిక ఉండేదని అందుకే ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా వినకుండా ఇల్లువదిలివెళ్ళిపోయి సెక్స్‌మార్పిడి చేయించుకున్నానని చెప్పింది. ఈ ఆపరేషన్ జరిగేటప్పటికి తను పదోతరగతి చదువుతున్నానని, ఆపరేషన్ పూర్తయ్యాక కోయంబత్తూరు, బెంగళూరు నగరాలలో రెండేళ్ళపాటు గడిపానని చెప్పింది. అక్కడ తనని ఎవ్వరూ దగ్గరికి రానిచ్చేవారు కారని, మానసికంగా ఎంతో నరకం అనుభవించానని చెప్పింది. తనలాగే ట్రాన్స్‌జండర్ అయినవాళ్ళు బతుకు తెరువులేక సమాజాదరణకు నోచుకోక వ్యభిచారానికి దిగారని, బజార్లో డాన్స్‌లు చేస్తూ అడుక్కుంటూ అధ్వాన్నస్థితిలో బతుకుతున్నారని వాపోయింది.

‘నాకు మొదట్నుంచి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. నటన నాకు ప్రాణం. చిన్నప్పుడు యూత్‌ఫెస్టివల్స్‌లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాను. సినిమా రంగానికి రాకముందు మోడల్‌గా పనిచేశా. ఈ రంగంలో రాణిస్తా ననే  నమ్మకం నాకు ఉంది అని చెప్పింది. నేను మోడలింగ్ చేసే రోజులలో ఎవ్వరికీ నా జండర్ విషయంలో అనుమానమే రాలేదు. ఒక టివి వారు తమ షో కోసం బుక్ చేసి ఆ తర్వాత నేను ట్రాన్స్‌జండర్ అని తెలిసి రిజెక్ట్ చేశారు. అప్పుడే నా విషయంలో బైటికి తెలిసింది. రహస్యం బట్టబయలైందని నేనేం బాధపడడంలేదు. ఇది రహస్యమనీ భావించడంలేదు. నటించే అవసరం వస్తే వెండితెరమీదే నటిస్తా..జీవితంలో నటించడం  నాకు చేతకాదు అని చెప్పింది అంజలి.