నేను మారనని చెప్పాను.. తారా స్థాయికి చేరాను!

“కాస్త లావెక్కు’ అని సలహా ఇచ్చినవారికి నేను ఒకటే సమాధానం చెప్పాను… ‘నేను మారను… నేనింతే!’ “అని అన్నానని చెప్పింది త్రిష .రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న అందాల తార త్రిష ఇప్పటికీ బిజీ కెరీర్ ను గడుపుతోంది. అయితే తాను ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగానని అంటోంది త్రిష. “కెరీర్ ప్రారంభంలో కొందరు నన్ను…’సన్నగా ఉన్నావు, సినిమాలకు పనికిరావ’ని కామెంట్ చేశారు. ‘మోడలింగ్ రంగం నుంచి వచ్చేవాళ్లు సినిమాల్లో రాణించలేర’ని అన్నారు. ‘కాస్త లావెక్కు’ అని సలహా ఇచ్చినవారికి నేను ఒకటే సమాధానం చెప్పాను… ‘నేను మారను… నేనింతే!’ అని అన్నాను. ఆతర్వాత కెరీర్‌లో పట్టుదలతో దూసుకుపోయి టాప్ హీరోయిన్‌ స్థాయికి చేరుకున్నాను” అని త్రిష పేర్కొంది. కెరీర్ ప్రారంభం నుంచి పలువురు ముంబయి హీరోయిన్ల పోటీ మధ్య.. త్రిష రాణించి.. టాలీవుడ్, కోలీవుడ్‌లలో గ్లామరస్ తారగా క్రేజ్‌ సంపాదించుకుంది.
 
బైక్‌ రైడింగ్‌,యుద్ధవిద్యల్లో శిక్షణ
త్రిష నవతరం తారలతో పోటీపడుతూ.. వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్నది. మూడు పదుల వయసు దాటినా త్రిష జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఆమె కథానాయికగా తెరకెక్కుతున్న తాజా తమిళ చిత్రం ‘రాంగి’. విదేశీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతున్నది. దీపావళి సందర్భంగా చిత్రబృందం ఆమె కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. బ్లూ టీషర్ట్‌లో తీక్షణమైన చూపులతో త్రిష ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. ఇటీవలే ఉజ్బెకిస్థాన్‌లో త్రిషపై ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రబృందం తెరకెక్కించింది. మొండితనం, ధైర్యసాహసాలు మెండుగా కలిగిన యువతిగా కనిపిస్తుంది. పోలీస్ అధికారిణిగా, ఖైదీగా భిన్న పార్శాల్లో ఆమె పాత్ర నడుస్తుందని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమా కోసం బైక్‌రైడింగ్‌తో పాటు యుద్ధవిద్యల్లో త్రిష శిక్షణ తీసుకుందని, డూప్‌లు లేకుండా… ఆమెపై తెరకెక్కించిన పోరాట సన్నివేశాలు అలరిస్తాయని అంటున్నారు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాకు కథను అందించారు. ‘జర్నీ’ ఫేమ్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది .