‘ఆట నాదే – వేట నాదే’ అంటున్న వెంకీ

దర్శకుడు కొత్త వాడైనా అతడి టాలెంట్ మీద నమ్మకం ఉంచడం వెంకటేశ్ అలవాటు. ఆ అలవాటునే వెంకీ తన తదుపరి చిత్రాలకూ అనుసరిస్తున్నాడు. ఈ మధ్య వెంకీ చిత్రాల సంఖ్య తగ్గినా తన నటనాసామర్ధ్యం ఏ మాత్రం తగ్గలేదని ‘గురు’ చిత్రంతో నిరూపించాడు. సుధ కొంగర కొత్త దర్శకురాలు అయినప్పటికీ, వెంకీని డీ-గ్లామరైజ్డ్ లుక్‎తో ప్రెజెంట్ చేసినప్పటికీ మంచి విజయం సాధించింది. అందుకే ఈ విజయాన్ని తన తదుపరి చిత్రాలకు స్ఫూర్తిగా చేసుకొని గతంలో తనతో చేయని మరికొందరు కొత్త దర్శకులతో ముందు కెళ్తున్నాడు వెంకీ.
 వెంకీ కొత్త దర్శకుల లిస్ట్‎లో ముందు వరుసలో ఉన్న దర్శకుడు తేజ. తాజాగా రానాకి ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే విజయవంతమైన చిత్రాన్నందించాడు ఈ దర్శకుడు . అందుకే వెంకటేశ్, తేజతో సినిమా చేయడానికి వెంటనే ముందుకొచ్చాడు. నిజానికి వీరిద్దరి కలయికలో గతంలో ‘సావిత్రి’ అనే పేరుతో ఒక చిత్రం రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ప్రారంభంలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు వెంకీ తేజకు మరో అవకాశమిచ్చాడు. ‘ఆట నాదే వేట నాదే’ అనే వెరైటీ టైటిల్‎తో ఈ సినిమా తెరకెక్కనుంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్‎లో ఈ సినిమా ఉంటుందని సమాచారం.
 వెంకటేశ్‎తో మొదటిసారిగా సినిమా చేయడానికి కొంత మంది యువ దర్శకులు రెడీగా ఉన్నారు. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్’ వరుస విజయాలతో జోరుమీదున్న అనిల్ రావిపూడి, వెంకటేశ్‎తో సినిమా చేయనున్నట్టు వార్తలొచ్చాయి. ‘F2’ అనే వెరైటీ టైటిల్‎తో తెరకెక్కనున్న ఈ చిత్రం ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ నేపథ్యంలో సాగుతుందట. ఇదే కోవలో రామ్‎తో ‘నేను శైలజ’,’ఉన్నది ఒకటే జిందగి’ లాంటి ప్రేమకథా చిత్రాలు తీసిన మరో యువ దర్శకుడు కిశోర్ తిరుమల వెంకీతో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ పేరుతో ఒక వినోదాత్మకమైన కుటుంబ కథాచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఫైనల్‎గా నాగ్‎తో ‘సోగ్గాడే చిన్నినాయనా’, నాగచైతన్యతో ‘రారండోయ్ వేడుకచూద్దాం’ లాంటి విజయవంతమైన చిత్రాల్ని తీసిన కళ్యాణ్ కృష్ణ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా ఒక మల్టీ స్టారర్ మూవీకి ప్రయత్నాలు ప్రారంభించాడు.