ఇప్పుడే కాదు.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా!

“నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను!”… అని అంటున్నారు విద్యాబాలన్‌. ‘పరిణీత’తో విద్యాబాలన్‌ హిందీ తెరకు పరిచయమై జూన్‌ 10తో 15 ఏళ్లయింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ… సినిమా మీద తనకున్న ప్రేమ గురించి కూడా చెప్పారామె. ‘‘నేను నిన్ను ప్రేమించాను.. ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాను.. ఇప్పుడే కాదు.. నిన్ను ఎప్పటికీ ఎక్కువగా ప్రేమిస్తాను… నా ప్రియమైన సినిమా’’ అంటున్నారు విద్యాబాలన్‌. ఎన్నో సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్న ఆమె ఇప్పుడు సినిమా మీద తనుకున్న ప్రేమను చెప్పడానికి ఓ కారణం ఉంది.‘పరిణీత’తో విద్యాబాలన్‌ హిందీ తెరకు పరిచయమై జూన్‌ 10తో 15 ఏళ్లయింది. సంజయ్‌ దత్, సైఫ్‌ అలీఖాన్, రైమా సేన్, దియా మీర్జా, విద్యాబాలన్‌ తదితరులు నటించిన ‘పరిణీత’ విద్యాకి మంచి పేరు తెచ్చింది.బెంగాలీ మహిళగా ఆ చిత్రంలో చక్కగా నటించారు విద్యాబాలన్‌. నటిగా 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ‘పరిణీత’ షూటింగ్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి, ఓ వీడియో షేర్‌ చేశారు…
‘‘ప్రపంచానికి తెలియక ముందే శేఖర్‌(సైఫ్‌ అలీ పాత్ర)లో లోలిత( విద్య, సైఫ్‌ అలీ పాత్ర) సగభాగం అయింది. నువ్వు కూడా నా రియల్‌ లైఫ్‌ శేఖర్‌ అయిపోయావు (సినిమా తనలో సగభాగం). ఇంకో విషయం ఏంటంటే.. నా భర్త సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌ యూటీవీలో చేరిన తర్వాత పని చేసిన మొదటి చిత్రం ఇది. మా ఇద్దరి తొలి చిత్రం ‘పరిణీత’ కావడం విశేషం’’ అని చెప్పింది విద్యాబాలన్.
వైద్యులు, సిబ్బందికి మద్దతు!
క‌రోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్యులు, సిబ్బందికి మద్దతుగా బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌ నిలిచింది. ఈ సందర్భంగా తన ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను షేర్‌ చేసింది…
“కోవిడ్‌-19పై వైద్యులు చేస్తున్న పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశ సైనికులు బోర్డర్‌లో నిలబడి దేశ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనకోసం కోసం కాపలా కాస్తున్నారు. ఇప్పుడు కరోనాపై యుద్దం చేస్తున్న వైద్యులు కూడా అలాగే కనిపిస్తున్నారు. కరోనా రోగుల‌తో వైద్యులు క్షణం తీరిక లేకుండా కాలం గ‌డుపుతున్నారు. వీరిలో ప్రాణాంత‌క వైర‌స్ ఒక్కరికి సోకినా అది పెద్ద ప్రమాదానికి తీస్తుంది. దీంతో పాటు క్వారంటైన్‌లో ఉండే వారి సంఖ్య పెరిగి ఆసుప‌త్రులు నిండిపోతాయి. మనకోసం ఇంతచేస్తున్న వైద్యులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అందుకోస‌మే పీపీఈ కిట్ల కోసం నిధుల సేకరణ మొద‌లు పెట్టాను. నాకు తోడుగా సినీ నిర్మాత మనీష్‌ ముంద్రా, ఫోటోగ్రాఫర్‌ అతుల్‌ కస్‌బేకర్‌ అండగా ఉన్నారు. రండి నాతో చేయి కలపండి.. మీ అందరి సహకారం ఉంటే మన హీరోలకు మరింత సాయం చెయ్యొచ్చు”అంటూ విద్యాబాలన్‌ చెప్పింది.